
సంగారెడ్డి టౌన్, వెలుగు: నియోజకవర్గంలో అంతర్గతంగా ఉన్న రోడ్ల విస్తరణతో పాటు కొత్త రహదారుల నిర్మాణాలకు ప్రభుత్వం నుంచి గ్రీన్ సిగ్నల్ వచ్చిందని టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి తెలిపారు. ఆయా పనులకు సంబంధించిన అంశాలపై గురువారం అధికారులతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా నియోజకవర్గంలో మంజూరైన అభివృద్ధి పనుల గురించి వివరించారు. ఆర్అండ్ బీ ద్వారా కొండాపూర్ మండలం మల్లేపల్లి నుంచి చెరువుగట్టు వెడల్పు పనులు, రెండు లైన్ల రోడ్డు విస్తరణకు రూ.15 కోట్లు, తంగడపల్లి నుంచి ఆత్మకూరు వరకు 8 కిలోమీటర్లు రూ.15 కోట్లు మంజూరైనట్టు వెల్లడించారు.
పంచాయతీరాజ్ విభాగంలో కొండాపూర్ నుంచి అలియాబాద్ మీదుగా 9 కిలోమీటర్ల మేర రోడ్డు నిర్మాణానికి రూ.10 కోట్లు, కంది మండలం కలివేముల నుంచి మక్తల్ వరకు రూ.1.80 కోట్లు, చిమ్మాపూర్ నుంచి చిమ్మాపూర్ తండా వరకు కిలోమీటర్ రోడ్డుకు రూ.1.34 కోట్లు, సంగారెడ్డి బైపాస్ రోడ్డు నుంచి ముంబై షాపూర్ తండాకు రూ.1.85 కోట్లు, మారేపల్లి నుంచి సీతారామ కుంట వరకు రోడ్డు మరమ్మతులకు రూ.2.65 కోట్లు, సదాశివపేట మండలం ఆత్మకూరు నుంచి సింగూర్ ప్రాజెక్టు వరకు రోడ్డు మరమ్మతు కోసం రూ.5.2 కోట్లు మంజూరైనట్టు జగ్గారెడ్డి తెలిపారు.
సంగారెడ్డి ఆర్అండ్ బీ గెస్ట్ హౌస్ నుంచి బైపాస్ రోడ్డు మీదుగా బసవేశ్వరం విగ్రహం వరకు రూ.12 కోట్లతో ఫోర్ లైన్ల రోడ్డు 4 జంక్షన్ల వారిగా అభివృద్ధి చేయనున్నట్లు పేర్కొన్నారు. నేషనల్ హైవే నుంచి రైతు వేదిక శిల్పా వెంచర్ నుంచి భూ లక్ష్మమ్మ ఆలయం వరకు 60 ఫీట్ల రోడ్డుకు రు.4.5 కోట్లు, సంగారెడ్డి రాజీవ్ పార్క్ అభివృద్ధి కోసం రూ.12 కోట్లు మంజూరవగా, త్వరలోనే ఆయా పనులకు శంకుస్థాపన చేయనున్నట్టు జగ్గారెడ్డి తెలిపారు. కాంగ్రెస్ నాయకులు అనంత కిషన్, ఆంజనేయులు, మున్సిపల్, ఆర్ అండ్ బీ, అధికారులు పాల్గొన్నారు.