
కరోనా నేపథ్యంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు లాక్‌డౌన్ ప్రకటించినా.. వాటిని ఉల్లంఘించి ఎలాంటి భద్రత చర్యలు తీసుకోకుండా 1,300 మందితో గత నెల 13,14,15 తేదీలలో తబ్లీగీ జమాత్ సమావేశం జరిగింది. దీని కారణంగా దేశంలో మరిన్ని కరోనా కేసుల నమోదయ్యాయి. సమావేశం నిర్వహించిన తబ్లీగీ జమాత్ నేత మౌలానా సాద్‌పై పోలీసులు కేసు నమోదు చేసిన సంగతి తెలిసిందే. అయితే ఈ వ్యవహారంలో కొత్త కోణాలు బయటపడుతున్నాయి.
రోహింగ్యాలు కూడా జమాత్‌కు హాజరయ్యారని కేంద్ర హోంశాఖ గుర్తించింది. హైదరాబాద్ రోహింగ్యా క్యాంప్ నుంచి పలువురు హరియాణా మేవాత్‌లో జరిగిన జమాత్‌కు హాజరైనట్టు నిఘా విభాగం గుర్తించింది. ఢిల్లీలోని రోహింగ్యాలు సైతం జమాత్ కార్యాకలాపాల్లో చురుగ్గా పాల్గొన్నారని తెలిసింది. జమాత్‌కు వెళ్లిన రోహింగ్యాలు తిరిగి క్యాంపులకు చేరుకోలేదని, దేశవ్యాప్తంగా రోహింగ్యా క్యాంపులున్న చాలా ప్రాంతాల్లో ఇదే పరిస్థితి ఉందని తెలిపింది. రోహింగ్యా ముస్లింల కదలికలు, వారి వివరాలు సేకరించాలని అన్ని రాష్ట్రాలకు కేంద్రం ఆదేశాలు ఇచ్చింది. రోహింగ్యాలు అందరినీ స్క్రీనింగ్ చేసి వైద్య పరీక్షలు నిర్వహించాల్సిందిగా ఉత్తర్వులు జారీ చేసింది.