భక్తులతో వెళ్తున్న ట్రాక్టర్ అదుపుతప్పి..

భక్తులతో వెళ్తున్న ట్రాక్టర్ అదుపుతప్పి..
  • లారీని ఢీకొన్న ట్రాక్టర్..
  • ఆరుగురు మృతి.. మరో 20 మందికి గాయాలు
  • పాలి జిల్లా సుమేర్ పుర్ సమీపంలో ఘటన
  •  ప్రమాదంపై  ఉపరాష్ట్రపతి  జగదీప్ ధన్ ఖర్, ప్రధాని మోడీ  విచారం

రాజస్థాన్ రాష్ట్రంలో  ఘోర  రోడ్డు ప్రమాదం  జరిగింది. ట్రాక్టర్- లారీ  ఢీకొని ఆరుగురు  చనిపోయారు. మరో  20 మందికి  గాయాలయ్యాయి. పాలి జిల్లా  సుమేర్ పుర్  పోలీస్ స్టేషన్ పరిధిలో  భక్తులతో వెళ్తున్న ట్రాక్టర్ అదుపుతప్పి  లారీని   ఢీకొట్టింది. నిన్న రాత్రి ప్రమాదం జరిగింది.  ప్రమాదాన్ని గుర్తించి వెంటనే  సహాయక చర్యలు చేపట్టారు. 
గాయపడిన వారిని  హాస్పిటల్ కు తరలించారు.
 జైసల్మేర్ లోని  రామ్ దేవరా ఆలయ  దర్శనం చేసుకుని తిరిగి వస్తుండగా ప్రమాదం జరిగినట్లు సమాచారం. రామ్ దేవరా నుంచి పాలీకి తిరిగి వస్తున్న సమయంలో భక్తులు ప్రయాణిస్తున్న ట్రాక్టర్ లారీని ఢీకొట్టిందని సుమేర్ పుర్ పోలీసు స్టేషన్ ఇంచార్జ్ రామేశ్వర్ భాటియా తెలిపారు. ప్రమాదంలో ఆరుగురు చనిపోగా 20 మంది గాయపడ్డారని.. వెంటనే ఆస్పత్రికి తరలించి చికిత్స అందించే ఏర్పాట్లు చేశామన్నారు. క్షతగాత్రుల్లో కొందరి పరిస్థితి విషమంగా ఉందని వివరించారు. 
రాజస్థాన్ ప్రమాదంపై భారత ఉపరాష్ట్రపతి  జగదీప్ ధన్ ఖర్, ప్రధాని నరేంద్ర మోడీ విచారం వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు సానుభూతి తెలిపారు. గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని  ప్రార్థించారు.