మార్కెట్లపై తప్పిన సర్కార్​ కంట్రోల్

మార్కెట్లపై తప్పిన సర్కార్​ కంట్రోల్
  • నిండా మునుగుతున్న రైతులు
  • సీజన్​ ప్రారంభంలో ఒక ధర.. పంట చేతికి వచ్చాక మరో ధర
  • క్వింటాల్​ 10 వేలు ఉన్న పత్తిని 8 వేలకు పడగొట్టిన్రు
  • 21,500 వరకు ఉన్న మిర్చి రేట్​ను.. 18 వేలకు దించేసిన్రు
  • తాలు, తేమ పేరిట వడ్ల కొనుగోళ్లలోనూ దోపిడీ
  • మిల్లర్లు, వ్యాపారులతో మార్కెట్​పాలకవర్గాలు, ఆఫీసర్ల కుమ్మక్కు

ఖమ్మం/హనుమకొండ, వెలుగు: రాష్ట్రంలోని వ్యవసాయ మార్కెట్లను వ్యాపారులు శాసిస్తున్నారు. వరి.. పత్తి.. మిర్చి.. పంట ఏదైనా సరే వాళ్లు చెప్పిందే రేటు అన్నట్లుగా పరిస్థితి తయారైంది. సర్కారు పట్టించుకోకపోవడం, మార్కెటింగ్ శాఖ ఆఫీసర్ల అవినీతి వల్ల వ్యాపారులు సిండికేట్ గా మారి, రైతులను నిలువుదోపిడీ చేస్తున్నారు. సీజన్​ మొదట్లో మంచి రేటు ఇవ్వడం.. పంట ఎక్కువగా అమ్మకానికి రాగానే ఒక్కసారిగా రేటు తగ్గించడం కామన్​గా మారింది. ఏదైనా కారణాలతో రెండు, మూడురోజులు మార్కెట్​కు సెలవులొస్తే తిరిగి మొదలైన రోజున రైతులు ఎక్కువగా పంటను తీసుకొస్తారు. ఇదే అదునుగా వ్యాపారులు రేటును కంట్రోల్​ చేస్తున్నారు. రోజుల తేడాలో రేట్లను వేల రూపాయల్లో తగ్గించేస్తున్నారు. మార్కెట్​కు సరుకు తెచ్చిన రైతులకు గిట్టుబాటు ధర వచ్చేలా చూడడంతో పాటు అన్ని విధాలా అండగా నిలవాల్సిన మార్కెట్​ కమిటీ పాలక వర్గాలు, అధికారులు చాలాచోట్ల ట్రేడర్లతో కుమ్మక్కవుతున్నారనే ఆరోపణలు ఉన్నాయి. 

మిల్లర్ల దోపిడీ రూ. 500 కోట్లకు పైనే.. 

రైస్‌‌‌‌‌‌‌‌ మిల్లర్ల దోపిడీ వల్ల  వరి రైతులు ఏటా కోట్లలో నష్టపోతున్నారు. ఎప్పట్లాగే ఈ వానాకాలం సీజన్‌‌‌‌‌‌‌‌లో కూడా కొనుగోలు సెంటర్ల నుంచి వచ్చిన బస్తాలను తప్ప, తాలు, తేమ పేరిట దింపుకోకుండా మిల్లర్లు మొండికేశారు. ప్రతి 40 కిలోల బస్తాకు 2 కిలోల వరకు తరుగు తీశాకే వడ్లు దింపుకున్నారు. అప్పటికే కొనుగోలు కేంద్రాల వద్ద 1 నుంచి 2 కిలోల దాకా తీసిన కటింగ్​కు ఇది అదనం. ఈలెక్కన రైతులు ప్రతి క్వింటాల్‌‌‌‌‌‌‌‌కు 6 నుంచి 8 కిలోల దాకా కోల్పోయారు. ఇలా ఈ వానాకాలం సీజన్​లోనే ఇప్పటివరకు రాష్ట్రవ్యాప్తంగా మిల్లర్లు  రూ.500 కోట్ల నుంచి 800 కోట్ల వరకు రైతులను దోచుకున్నారు. దీనిపై కలెక్టర్లకు, మంత్రులకు రైతులు ఫిర్యాదు చేసినా మిల్లర్లపై ఎలాంటి చర్యలు తీసుకోలేదు. పైగా కొనుగోళ్లలో సర్కారు చేసిన జాప్యం వల్ల ప్రైవేట్​ వ్యాపారులకే ప్రయోజనం చేకూరింది. వానాకాలం సీజన్​లో 1.12 కోట్ల టన్నుల వడ్లు సేకరించాలని టార్గెట్​ పెట్టుకున్న సర్కారు,, ఇప్పటివరకు 60 లక్షల టన్నులు కూడా సేకరించలేకపోయింది. చాలా జిల్లాల్లో కొనుగోళ్లు కూడా పూర్తయ్యాయి. దీనిని బట్టి వేలాది మంది రైతులు తమ వడ్లను  ప్రైవేట్​వ్యాపారులకు నేరుగా అమ్ముకున్నట్లు అర్థమవుతున్నది. క్వింటాల్​కు రూ.2,060 మద్దతు ధర ఉండగా.. ప్రైవేట్​లో రూ.1,400 నుంచి 1,800 లోపే కొనడంతో రైతులు మునిగారు.

పత్తి రేటు పడగొట్టిన్రు

సీజన్​ ప్రారంభంలో క్వింటాల్​ పత్తికి10 వేల వరకు పెట్టిన ట్రేడర్లు.. మార్కెట్​ కు పత్తి దిగుబడులు పెరగడంతో రేటు తగ్గించారు. ఖమ్మం, వరంగల్​లోని ఏనుమాముల, ఆదిలాబాద్​ లాంటి ప్రధాన మార్కెట్లలో అడ్తిదారులే ఖరీదుదారుల అవతారం ఎత్తారు. వ్యాపారులంతా సిండికేట్​గా మారి పత్తి ధరను రోజూ రూ.100 నుంచి200 చొప్పున పడగొడ్తూ వచ్చారు. దీంతో ప్రస్తుతం రాష్ట్రంలోని అన్ని మార్కెట్లలో కాటన్​ రేటు రూ.8 వేల నుంచి 7,500 మధ్యే ఉంది. ఈ ఏడాది ఎకరానికి రూ.35 వేల నుంచి  50 వేల వరకు పెట్టుబడి పెట్టాల్సి వచ్చింది. ఆ తర్వాత భారీ వర్షాలు, తెగుళ్ల కారణంగా దిగుబడులు  తగ్గిపోయాయి. ఎకరాకు కనీసం 14 నుంచి 15 క్వింటాళ్లు రావాల్సిన చోట 7 నుంచి 8 క్వింటాళ్లకు మించి రాలేదు. వచ్చిన పంటనైనా మంచి రేటుకు అమ్ముకుందామన్న రైతులను వ్యాపారులు దగా చేస్తున్నారు. వాస్తవానికి అంతర్జాతీయ మార్కెట్​లో పత్తి బేళ్లకు డిమాండ్​ బాగానే ఉంది. 165 కిలోలు ఉండే బేల్​ ధర రూ.63 వేలకు పైగా ఉంది.  అంటే వ్యాపారులకు క్వింటా పత్తికి రూ.15,300కు పైగానే దక్కుతోంది. కానీ వ్యాపారులు డిమాండ్​ తగ్గుతోందని చెప్తూ రైతులకు 8 వేల లోపే కట్టిస్తున్నారు. 

మిర్చి రేటును 3 వేలు తగ్గించిన్రు

రాష్ట్రంలో ఉమ్మడి ఖమ్మం, వరంగల్ జిల్లాల్లో తేజ రకం మిర్చి ఎక్కువగా పండిస్తారు. ఖమ్మం, ఎనుమాముల మార్కెట్లకు వారం నుంచి మిర్చి రావడం మొదలైంది. మొదట్లో డ్రై మిర్చీ క్వింటాల్​కు రూ.21,500 వరకు రేటు ఉండగా.. గురువారం ఖమ్మం మార్కెట్లో జెండా పాట రేటు రూ.19,800కు తగ్గింది. రైతుల నుంచి రూ. 18 వేలకే వ్యాపారులు మిర్చి కొన్నారు. వరంగల్ మార్కెట్లోనూ ఇదే పరిస్థితి. ఏపీలోని గుంటూరు మార్కెట్లో మాత్రం గురువారం క్వింటాల్​ తేజ రకం మిర్చికి రూ. 23 వేలు రేటు వచ్చింది.  ఖమ్మం, వరంగల్ జిల్లాల్లో సాగయ్యే తేజ రకం మిర్చికి అంతర్జాతీయంగా మంచి డిమాండ్​ ఉంది. చైనా, థాయిలాండ్​, బంగ్లాదేశ్​, ఆస్ట్రేలియా, ఉగాండా తదితర దేశాలకు డ్రై మిర్చి ఎగుమతి అవుతుంది. విదేశీ ఆర్డర్లున్నా ఇక్కడి ట్రేడర్లు సిండికేట్​అయి క్వింటాలుకు రూ. 3 వేలు తగ్గించి కొంటున్నారనే ఆరోపణలు వస్తున్నాయి. గతేడాది మిర్చికి తామర పురుగు సోకి రైతులు నష్టపోయారు. ఈ ఏడాది కూడా దిగుబడి తగ్గడం, ట్రేడర్లు రేటు తగ్గించడంతో రైతులు నష్టపోతున్నారు. 

రాజకీయ పునరావాస కేంద్రాలుగా మార్కెట్​ కమిటీలు గిట్టుబాటు విషయంలో రైతులకు అండగా నిలవాల్సిన మార్కెట్ కమిటీలు అధికార పార్టీకి రాజకీయ పునరావాస కేంద్రాలుగా మారాయి.  రైతుల సమస్యలపై, మార్కెటింగ్​సమస్యలపై ఎలాంటి అవగాహన లేని రాజకీయ నిరుద్యోగులు, ఎమ్మెల్యేల అనుచరులతో చాలా మార్కెట్ కమిటీల్లోని పదవులు నిండిపోతున్నాయి. ఇలా వచ్చిన పదవులను ఆదాయ వనరుగా మార్చుకునే క్రమంలో లీడర్లు అవినీతి, అక్రమాలకు పాల్పడుతున్నారనే ఆరోపణలున్నాయి.  

కూలి ఖర్చులకే సరిపోయినయ్​

ఖమ్మం జిల్లా కామేపల్లి మండలం పండితాపురానికి చెందిన కౌలు రైతు గుగులోత్ బావుసింగ్ ఐదెకరాలు కౌలు తీసుకొని మిర్చి సాగు చేసిండు. ఎకరానికి లక్ష చొప్పున పెట్టుబడి పెట్టిండు. ఇటీవల 2 క్వింటాళ్ల మిర్చి మార్కెట్​కు తీస్కపోతే రూ.19,200 చొప్పున అమ్ముడుపోయింది. అవి కూలి ఖర్చులకే సరిపోయినయని బాధపడుతున్నడు.  

వడ్లకు రూ.14 వందలే పెట్టిన్రు

నాకున్న  నాలుగెక రాల పొలంలో సాంబ మసూరి వడ్లు పండించిన. 130 బస్తాల వడ్లు వచ్చినయ్​. లింగగిరి సొసైటీ లో కొనుగోలు సెంటర్​ పెడ్తరని చూస్తే బాగా లేట్​ చేసిన్రు.  మిల్లుకు కొంటవోతే.. తేమ ఉందని క్వింటాల్​రూ.1,400 చొప్పున కట్టిచ్చిన్రు. దీంతో నిండా మునిగినం.
- రణపంగు కిషోర్,   లక్కవరం, హుజూర్ నగర్, సూర్యాపేట జిల్లా

కూలి పైసలు ఎల్లలే..

నాకున్న పదెకరాల్లో పత్తి వేసిన. 40 క్వింటాళ్ల  దిగుబడి వచ్చింది. ఈ నెల మొదటి వారంలో 18 క్వింటాళ్ల పత్తిని వ్యాపారులకు అమ్మితే క్వింటాలుకు రూ.9,100 ఇచ్చిన్రు. బుధవారం 22 క్వింటాళ్లను అదే వ్యాపారికి అమ్మితే వెయ్యి తగ్గించి క్వింటాల్​కు రూ.8,100 మాత్రమే ఇచ్చిన్రు. అందులో పత్తి ఏరిన కూలీలకే రూ.లక్ష ఇయ్యాల్సి వచ్చింది. ఈసారి పెట్టుబడులకు నిండా మునిగినం. 
- అబ్దుల్ షఫీ, అమ్మాపూర్, మహబూబ్​నగర్​జిల్లా