హెల్మెట్ లేదని ట్రాక్టర్ డ్రైవర్ కి చలానా

హెల్మెట్ లేదని ట్రాక్టర్ డ్రైవర్ కి చలానా
  • పొరబాటున వచ్చింది.. క్యాన్సిల్ చేస్తాం
  • ఉత్తర ప్రదేశ్ ట్రాఫిక్ పోలీసుల వివరణ

హపూర్: ఉత్తరప్రదేశ్ లో ట్రాఫిక్ పోలీసులు ఓ రైతును కంగారుపెట్టేశారు. హపూర్ జిల్లా గర్ముక్తేశ్వర్ కు చెందిన ఓ వ్యక్తి ఇంటికి చలానా వచ్చింది. డ్రైవింగ్ లైసెన్స్, హెల్మెట్ లేకుండా బైక్ నడిపాడంటూ రూ.3 వేల ఫైన్ కట్టాలని అందులో ఉంది. అది చూసి అతడు షాక్ అయ్యాడు. అసలు విషయమేంటంటే అతడికి అసలు బైక్ లేదు. ఉన్నదల్లా ఓ ట్రాక్టర్ మాత్రమే. కానీ, తన ట్రాక్టర్ రిజిస్ట్రేషన్ నంబర్ తో చలానా ఇంటికి వచ్చింది. దానిని చూసి కంగారు పడిన ఆ రైతు ట్రాఫిక్ పోలీసుల వద్దకు పరిగెత్తాడు.

తన డ్రైవింగ్ లైసెన్స్, ట్రాక్టర్ పేపర్లు అన్నీ తీసుకుని వెళ్లి ట్రాఫిక్ పోలీసులకు చూపించాడు. అవన్నీ పరిశీలించి.. పొరబాటు జరిగిందని ఒప్పుకున్నారు. టైపింగ్ తప్పు వల్ల ఆ చలానా వచ్చిందని చల్లాగా చెప్పారు ట్రాఫిక్ పోలీసులు. ఆ చలానాను క్యాన్సిల్ చేస్తామని, కంగారు పడొద్దని చెప్పి పంపించేశారు.