
- రద్దీకి అనుగుణంగా రోడ్లను నిర్మించలేకపోతున్న బల్దియా
- మెయిన్ రోడ్లకే రూ. కోట్లు ఖర్చు
- తాజాగా 450 కి.మీ మేర రోడ్ల మెయింటెనెన్స్‌ను ఏజెన్సీలకు అప్పగించేందుకు ప్లాన్
- ట్రాఫిక్‌ను తగ్గించేందుకు కాలనీల మీదుగా వెహికల్ డైవర్షన్స్
మెయిన్ రోడ్లపై ట్రాఫిక్ ఎక్కువవుతుండటంతో రద్దీని తగ్గించేందుకు గత కొన్నిరోజులుగా ట్రాఫిక్ పోలీసులు వెహికల్స్ ను కాలనీ రోడ్లపైకి మళ్లిస్తున్నారు. ఇందుకోసం మెయిన్ రోడ్లపై ఇండికేషన్ బోర్డులను సైతం ఏర్పాటు చేశారు. ఇంటర్నల్ రోడ్లపై వెళ్తే ట్రాఫిక్ జామ్ ఉండదని.. దూరం కూడా తగ్గుతుందని ట్రాఫిక్ పోలీసులు చెబుతుండటంతో వాహనదారులు అటుగా వెళ్తున్నారు. దీంతో కాలనీ రోడ్లపై వెహికల్ మూవ్ మెంట్ పెరుగుతోంది. కానీ వెహికల్స్ రద్దీని తట్టుకునేలా అంతర్గత రోడ్లను మాత్రం బాగు చేయడం లేదు. చాలా చోట్ల అంతర్గత రోడ్లు దెబ్బతిని ఉండటంతో వాహనదారులు ఇబ్బంది పడుతున్నారు. ట్రాఫిక్ ను మళ్లించే ముందు ఆయా రూట్లలో రోడ్లు ఎలా ఉన్నాయో చూసి డైవర్షన్స్ చేయాలని కోరుతున్నారు.
హైదరాబాద్, వెలుగు: గ్రేటర్లో అంతర్గత రోడ్లను రెండేళ్లుగా జీహెచ్ఎంసీ పట్టించుకోవడం లేదు. మెయిన్ రోడ్లపై ట్రాఫిక్ రద్దీని తగ్గించేందుకు అంతర్గత రూట్లలో మీదుగా వెహికల్స్‌ను మళ్లిస్తున్నప్పటికీ అందుకు అనుగుణంగా రోడ్లను నిర్మించడం లేదు. కేవలం మెయిన్ రోడ్ల మెయింటెనెన్స్‌ను ఏజెన్సీలకు ఇస్తున్న బల్దియా మిగతా వాటిని పట్టించుకోవడం లేదు. కాంప్రహెన్సివ్ రోడ్ డెవలప్ మెంట్ ప్రోగ్రామ్(సీఆర్ంఎపీ) కింద 811 కి.మీ మేర రోడ్ల మెయింటెనెన్స్‌ను ఐదేండ్ల పాటు రూ.1850 కోట్లతో 2019లో ఏజెన్సీలకు అప్పగించారు. తాజాగా మరో 450 కి.మీ మేర రోడ్లను మెయింటెనెన్స్ కింద రూ.750 కోట్లతో ఏజెన్సీలకు అప్పగించేందుకు బల్దియా ప్రతిపాదించింది. ఇలా మెయిన్ రోడ్ల కోసం వేలాది రూ. కోట్లు ఖర్చు చేస్తున్న బల్దియా అంతర్గత రోడ్లను ఏమాత్రం పట్టించుకోవడం లేదు. కేవలం సీఆర్ఎంపీ రోడ్లు, వీఐపీలు తిరిగే ప్రాంతాలపైనే ఫోకస్ పెడుతున్నారు. ఇక వీఐపీలు రెగ్యులర్‌గా తిరిగే రోడ్లను ఎప్పటికప్పుడు వేస్తున్నారు. కానీ సాధారణ జనం తిరిగే రూట్లలో రోడ్లను అసలు పట్టించుకోవడం లేదు. అంతర్గత రోడ్లు పూర్తిగా పాడైన కూడా తిరిగి కొత్తగా వేయడం లేదు. జనం నుంచి ఫిర్యాదులు అందుతున్న ప్రాంతాల్లో కూడా రోడ్లు వేయకపోతుండటంపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కొన్ని రోడ్లకు సంబంధించి స్టాండింగ్కమిటీలో అమోదం పొందిన కూడా పనులు స్టార్ట్ చేయడం లేదు. అధికారులు కాంట్రాక్టర్లను ఆదేశించినా కూడా బిల్లులు టైమ్‌కి రాకపోతుండటంతో వారు ముందుకు రావడం లేదు. రోడ్ల నిర్వహణ, కొత్త రోడ్ల ఏర్పాటుకు జీహెచ్ఎంసీ ప్రతి ఏటా బడ్జెట్లో రూ.900 కోట్లను ఖర్చు చేస్తోంది. ఇక సిటీలోని రోడ్ల రీకార్పెటింగ్, మెయింటెనెన్స్ కోసం 2016 నుంచి ఇప్పటి వరకు మొత్తం 3 వేల కోట్లకుపైగా ఖర్చు చేసింది.
క్వాలిటీ లేకుండా నిర్మాణం..
సిటీలో వేస్తున్న అంతర్గత రోడ్లు న్యాణతగా ఉండటం లేదు. క్వాలిటీ కంట్రోల్‌పై కూడా అధికారులు దృష్టి పెట్డకపోవడంతో కాంట్రాక్టర్లు ఇష్టానుసారంగా రోడ్లను వేస్తున్నారు. దీంతో వేసిన కొన్నాళ్లకే రోడ్లపై గుంతలు ఏర్పడుతున్నాయి. కాంట్రాక్టర్లకు సకాలంలో బిల్లులు రాకపోవడం కూడా రోడ్ల నాణ్యతపై ప్రభావం చూపుతోంది. నెలల తరబడి బిల్లులు ఇవ్వకపోతుండంతో కాంట్రాక్టర్లు క్వాలిటీ పై దృష్టిపెట్టకుండానే పనులు పూర్తి చేస్తున్నారు. ఇదే కారణంతో అధికారులు సైతం కాంట్రాక్టర్లపై చర్యలు తీసుకోవట్లేదనే విమర్శలు వస్తున్నాయి. క్వాలిటీపై దృష్టి పెడితే కొన్నాళ్ల పాటు రోడ్లు ఎక్కువ సర్వీసు ఇచ్చే అవకాశముంది. అదేవిధంగా కొత్తగా వేస్తున్న రోడ్లను ఏదో ఒక పని పేరుతో తవ్వేస్తుండటంతో అవి మరింత కరాబవుతున్నాయి.
ప్రమాదాల బారిన పడుతూ..
జనాల నుంచి అన్ని రకాల ట్యాక్స్‌లను వసూలు చేస్తున్న బల్దియా జనానికి కావాల్సిన సదుపాయాలను కల్పించడంతో విఫలమైతోంది. గ్రేటర్ లోని కాలనీలు, బస్తీల్లో రోడ్లు వేయడం, రిపేర్లు చేపట్టడం లేదు. అంతర్గత రోడ్లు కరాబు అవుతుండటంతో బైక్‌లపై వెళ్లేవారు గాయాలపాలవుతున్నారు. కొన్నిచోట్ల రోడ్లపై మ్యాన్ హోల్స్ మూతలు సగం విరిగి ఉంటుండటంతో వెహికల్స్ఆ గుంతలో పడుతున్నాయి. అయితే మెయిన్ రోడ్లపై యాక్సిడెంట్లు జరిగితే వెంటనే అక్కడ గుంతలను పూడ్చటం చేస్తున్నప్పటికీ అంతర్గత రోడ్లను మాత్రం పట్టించుకోవడం లేదు. ప్రస్తుతం కాలనీల రోడ్లపై ట్రాఫిక్ మళ్లిస్తుండటంతో మరిన్ని ప్రమాదాలు అవుతున్నాయి.