ఎవరెస్ట్ యమ రష్

ఎవరెస్ట్ యమ రష్

హైదరాబాద్ లో బాగా ట్రాఫిక్ ఉండే ప్లేస్‌ ఏది? అని అడిగితే.. ఒక్కొక్కరూ ఒక్కో ఏరియా పేరు చెబుతారు. ఒకరు అమీర్ పేట అంటే.. ఇంకొకరు గచ్చిబౌలి అంటారు. మరొకరు మెహిదీపట్నం అంటారు. ఎవరి ట్రాఫిక్ కష్టాలు వారివి. అయితే.. ప్రపంచంలో అత్యంత ట్రాఫిక్ జామ్ ఉండే ప్రదేశం ఏంటి? అని అడిగితే.. ఇప్పుడు చాలామంది ఎవరెస్ట్ , హిమాలయాలు అని చెబుతున్నారు. ఎందుకంటే..ఎవరెస్ట్ ఎక్కడానికి బారులు తీరిన జనాన్ని చూసి. అవును..ఎవరెస్ట్ పర్వతం ఎక్కడానికి 320 మంది లైన్లో నిల్చున్న ​ఫొటోలు ఈ కొత్త ప్రాబ్లమ్‌‌ను బయటకు తెచ్చాయి. అసలు ఎందుకు ఎవరెస్ట్ మీద ట్రాఫిక్ పెరిగింది? అంతమంది ఎవరెస్ట్ ఎక్కడానికి ఎందుకు ఉత్సాహం చూపుతున్నారు? అక్కడి అందమా? దాని గొప్పతనమా? ఏంది కథ?

29,029 ఫీట్ల ఎత్తైన పర్వతం. ఒక్కో అడుగు ముందుకు పడుతున్న కొద్దీ ఆక్సిజన్ తగ్గుతూ, మంచు తుపాన్లు స్వాగతమిచ్చే ప్రమాదకరమైన పర్వతం అది. మరోవైపు ఎముకలు కొరికే చలి. అక్కడికెళ్లడం ప్రాణాలతో చెలగాటమే అని తెలిసినా.. అదెక్కడం ఓ ఘనత. అదేమంత సేఫ్ ప్లేస్ కాదు.. అమాంతం ఎక్కేయడానికి చిన్నపాటి గుట్ట కూడా కాదు. ఆ పర్వతాన్ని అధిరోహించడమంటే..ప్రాణాలు పణంగా పెట్టడమే. సాహసంతో సావాసం చేయడమే. నెలల తరబడి శ్రమిం చాలి. రోజులో.. గంటల తరబడి శరీరానికి పని చెప్పాలి.

అడుగు అడుగుకు ఆక్సిజన్ అందక ఊపిరి ఆగిపోతుందేమో అనిపిస్తుంది. కానీ.. అడుగు ముందుకే పడుతుంది. అంతటి ప్రమాదకరమైన, సాహసోపేతమైన ఎవరెస్ట్ పర్వతాన్నిఅధిరోహించడానికి ఎందుకు 320 మంది ‘క్యూ’ కట్టారు.?  ఒకరి వెనుక ఒకరు చీమలు బారులు తీరినట్టు పర్వతారోహణకు బయల్దేరారు? ఆ ప్రయత్నంలో పదహారుమంది ప్రాణాలు విడిచారెందుకని? అసలు ఎవరెస్ట్ పర్వతం మీద ఎందుకు ట్రాఫిక్ జామ్ అయింది?

ఎడ్మండ్ హిల్లరీ, టెన్సిం గ్ నార్వేలు ప్రపంచంలో తొలిసారి ఎవరెస్ట్ అధిరోహించిన తర్వాత అందరి దృష్టి ఎవరెస్ట్​ అధిరోహణ మీదకు మళ్లింది. అప్పటి వరకు ఎవరెస్ట్​ ఎక్క డం అంటే అసాధ్యం అనుకున్న వాళ్లంతా ఎవరెస్ట్​ ఎక్కే మార్గాల గురిం చి అన్వేషించడం మొదలుపెట్టారు. అలా రోజురోజుకు ఎవరెస్ట్​ ఎక్కడం పట్ల ఆసక్తి పెరుగుతూనే ఉంది.ఆ ఆసక్తే  పర్వతారోహకుల సంఖ్య పెరగడానికి కూడా కారణమయింది. ఈ క్రమంలో ఈ ఏడాది పదహారు మంది చనిపోయారు. ఒక్కసారిగా వాతావరణం మారిపోవడం,ఆక్సిజన్ సిలిండర్లు అయిపోయి, శ్వాస అందలేదు. కొందరు అదుపు తప్పి పడిపోవడం..ఇంతమంది ప్రాణాలు గాల్లో కలిసిపోవడానికి కారణమయ్యాయి .

గంటల కొద్ది..

320 మంది ఎవరెస్ట్ ఎక్కడానికి క్యూలో నిలబడడం ప్రపంచంలోనే చర్చనీయాంశమైంది. ఆ క్యూ లైన్ ను నిర్మల్ పూర్జ అనే వ్యక్తి ఫొటో తీసి సోషల్ మీడియాలో ‘ఎవరెస్ట్ మీద ట్రాఫిక్ జామ్’ అంటూ పోస్ట్ చేశాడు. దీంతో ఎవరెస్ట్ ఎక్కడానికి ఎంతమంది ఉత్సాహం చూపుతున్నారో చూసి ప్రపంచం నివ్వెరపోయింది. అయితే..ఏటా పర్వతారోహకుల మరణాలు పెరుగుతున్నా.. పర్వతం ఎక్కే విషయంలో మాత్రం ఆసక్తి తగ్గడం లేదు. వందలమంది ఒకేసారి ఎవరెస్ట్ ఎక్కేందుకు ఎగబడడంతో చాలామంది కొన్ని గంటలసేపు క్యూలైన్లో వేచి ఉండాల్సి వచ్చింది.

ఎందుకు చనిపోయారు?

ఎవరెస్ట్ ఎక్కాలంటే.. అన్నీ సీజన్లు అనుకూలమైనవి కాదు. ప్రత్యేక సమయాల్లో మాత్రమే ఎవరెస్ట్ ఎక్కేందుకు సరైందని చెప్తారు. పరీక్షలు చేసిన పిదపనే అనుమతిస్తారు. దీనికి తోడు.. అక్కడ ఎప్పుడు వాతావరణం మారిపోతుందో ఊహించడం ఎవరి తరం కాదు. వాతావరణం అనుకూలించినప్పుడే తొందరగా ఎక్కే ప్రయత్నం చేస్తుంటారు. అయితే.. ఇప్పటి వరకు అలా చాలాసార్లు వాతావరణం అనుకూలంగా ఉన్నప్పుడే పర్వతాన్ని ఎక్కిన సందర్భాలు చాలానే ఉన్నాయి. కానీ.. ఈ ఏడాది ఒకేసారి 320 మంది గంటలపాటు వేచి చూడాల్సి వచ్చింది. అలా చూస్తు -న్నప్పుడు వాతావరణంలో జరిగిన మార్పులు మరణాలకు కారణమయ్యాయి.

దీనికి తోడు వారు తీసుకెళ్లిన ఆక్సిజన్ సిలిండర్లలో ఆక్సిజన్ అయిపోయింది. మామూలుగా అయితే.. ఎన్ని గంటల్లో ఎక్కుతారు. ఎంతసేపట్లో దిగుతారు.. ఆ సమయాన్నిబట్టి ఒక్క సిలిండర్ ఎంతసేపు వస్తుంది అని లెక్కలు వేసి ఎక్కడం మొదలుపెడతారు. మధ్యలో చాలాసేపు ఆగడం వల్ల ఆక్సిజన్ సరిపోక పదుల సంఖ్యలో అధిరోహకులు చనిపోయారు. గతేడాది మొత్తంగా ఎవరెస్ట్ ఎక్కిన వారి సంఖ్య 807. ఈ ఏడాది ఇప్పటికే 381కు పైగా ఎవరెస్ట్ అధిరోహించడానికి నేపాల్ ప్రభుత్వం అనుమతినిచ్చింది. ఏడాది చివరి వరకు ఈ సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉంది.పోయినేడాది కంటే ఎక్కువ మంది ఎవరెస్ట్ అధిరోహించే ఛాన్సులూ ఉన్నాయి. ఎవరెస్ట్ మీద ఇంతలా ట్రాఫిక్ జామవడం ఇది తొలి సారి కాదు. 2012లో కూడా ఇలా ఎవరెస్ట్ ఎక్కడానికి చాలామంది పోటీపడడంతో ట్రాఫిక్ జామ్ అయింది. పర్వతారోహకులు, సాహసికులు,ఎవరెస్ట్ ఎక్కడమే ఆశయంగా పెట్టుకున్నవారు రోజురోజుకు పెరగడంతో ఈసారి ఎవరెస్ట్ మీద రద్దీ బాగా పెరిగిం ది.

మనోడూ ఉన్నాడు

ఎవరెస్ట్ ఎక్కేవారికి తెలంగాణ అడ్వెంచర్ క్లబ్ ఆధ్వర్యంలో ఎంపికలు జరిగాయి.ఆ సెలక్షన్స్ కి 360 మంది ఔత్సాహికులు వచ్చారు. అంతమందిలో నెంబర్ వన్ గా నిలిచాడు అంగోత్ తుకారం. రంగారెడ్డి జిల్లా యాచారం మండలంలోని తక్కళ్లపల్లి తండాకు చెందిన తుకారాం చిన్నప్పటి నుంచే ఎవరెస్ట్ ఎక్కడం లక్ష్యంగా పెట్టుకున్నాడు. ఎవరెస్ట్ ఎక్కాలంటే బీఎంసీ అనే బేసిక్ కోర్సు చేసి ఉండాలి. ఆ కోర్సు సర్టిఫికెట్ అందుకున్న తొలి దక్షిణ భారత యువకుడు తుకారాం . అతి చిన్న వయసులో ఎవరెస్ట్ ఎక్కిన తొలి గిరిజన యువకుడిగా తుకారాం ఈ ఏడాది ఎవరెస్ట్ అధిరోహించి చరిత్ర సృష్టించాడు. ఈ ఏడాది ఏప్రిల్ 5న సాహసయాత్ర ప్రారంభించిన తుకారాం యాభై రోజుల పాటు కష్టించి ఎవ రెస్ట్ పర్వతాన్ని అధిరోహించాడు. ఈనెల 22న ఎవరెస్ట్ శిఖరం ముద్దాడి అక్కడ తెలంగాణ కీర్తి పతాకాన్ని , జాతీయ పతాకాన్ని ఎగురవేశాడు. అయితే.. మూడు రోజుల క్రితమే తుకారాం ఎవరెస్ట్ అధిరోహించాడు. కానీ.. అక్కడ వాతావరణం ప్రతికూలంగా ఉండడంతో బేస్ క్యాం పు వద్దే విశ్రాంతి తీసుకున్నాడు. తన కళ్ల ముందే సహచర పర్వతారోహకులు ప్రాణాలు విడుస్తున్నా.. మొక్కవోని స్థైర్యం తో, ధైర్యం తో తుకారాం శిఖరం అంచులకు చేరాడు.

కమ్యూనికేషన్ లేకుంట అయింది !

ఎవరూ వెళ్లడానికి సాహసం చేయలేని సౌత్ పోల్ మార్గం గుండా ఎవరెస్ట్ ఎక్కాడు. ఈ రూట్ చాలా ప్రమాదకరం. మల్లి మస్తాన్ బాబు కూడా ఇదే మార్గం గుండా వెళ్లాడు. ప్రాణాలు కోల్పోయాడు. వెళ్లడమే కానీ.. తిరిగి వస్తామా? అన్నంత ప్రమాదకరంగా ఈ మార్గం ఉంటుంది. నాతోపాటు వచ్చిన ముగ్గురు నా కళ్ల ముందే ప్రాణాలు కోల్పోయా రు. వాతావరణం క్షణక్షణానికి మారుతున్నది. మంచు తుపాన్ వచ్చి మేం వేసుకున్న టెంట్లన్నీ చెదిరిపోయాయి . మా వాకీటాకీలు మంచులో కూరుకుపోయాయి . కమ్యూనికేషన్ లేకుంట అయింది. నోరు తెరవడానికి కూడా ధైర్యం చేయలేనంత చలి. సిలిండర్‌‌‌‌లో ఆక్సిజన్‌‌‌‌ అయిపోయినా కొద్ది శ్వాస తీసుకోవడం చాలా ఇబ్బందైంది. పైననేమో గాలి ఉండదు. తిరిగి వస్తానన్న నమ్మకం లేకుండె . కానీ.. రావాలన్నకసి మాత్రం ఉంది. అందుకేనేమో.. అలాంటి పరిస్థితుల్లో కూడా ఎవరెస్ట్ ఎక్కి ప్రాణాలతో తిరిగి వచ్చిన.

-అంగోత్ తుకారాం, ఎవరెస్ట్​ అధిరోహకుడు