
వాహనదారుల నుంచి నెగిటివ్ రెస్పాన్స్
హైదరాబాద్, వెలుగు : ట్రాఫిక్ పోలీసుల ట్రయల్ రన్స్ వాహనదారులకు కష్టాలు తెచ్చిపెడుతున్నాయి. నిరంతరం రద్దీగా ఉండే రోడ్లు నరకం చూపిస్తున్నాయి. ఇరుకైన రోడ్లలో డైవర్షన్స్ తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తున్నాయి. ఇలా జూబ్లీహిల్స్‌లో పోలీసులు నిర్వహిస్తున్న ట్రయల్ రన్ ఫెయిల్యూర్ దిశగా సాగుతోంది. సిగ్నల్స్ ఎత్తివేత, జంక్షన్స్ క్లోజ్, ట్రాఫిక్ డైవర్షన్స్‌పై వాహనదారులు తీవ్ర అసహనం వ్యక్తం చేస్తున్నారు. డెస్టినేషన్ దూరం పెరగడం, ట్రాఫిక్‌లో చిక్కుకోవడంతో ట్రయల్స్ ఫెయిల్యూర్‌పై పోలీసులకు సలహాలు, సూచనలు చేస్తున్నారు.
మరింత ట్రాఫిక్ జామ్
జూబ్లీహిల్స్ రోడ్ నం.45, సీవీఆర్ జంక్షన్, చెక్‌పోస్ట్, బంజారాహిల్స్ రోడ్ నం.12 రూట్‌లో ట్రాఫిక్ జామ్ సమస్యలను పరిష్కరించేందుకు ట్రయల్ రన్ నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. గత నెల 25 నుంచి ఈ ట్రయల్ ప్రారంభమైంది. ఈ రూట్లలో ట్రాఫిక్ మూవ్‌మెంట్స్‌పై నెల రోజుల పాటు స్టడీ చేయనున్నారు. ట్రయల్స్ ఫలితాలను సీపీ సీవీ ఆనంద్ పర్యవేక్షిస్తున్నారు. కాగా ట్రాఫిక్ సమస్యల పరిష్కారంలో భాగంగా రద్దీ ఎక్కువగా ఉండే సీవీఆర్ జంక్షన్, జర్నలిస్ట్ కాలనీ, రోడ్ నం.45 సిగ్నల్స్‌ను మూసి వేశారు. సీవీఆర్ జంక్షన్ నుంచి సినీ నటుడు మోహన్‌బాబు ఇంటి ముందు యూటర్న్, అక్కడి నుంచి జర్నలిస్ట్ కాలనీ మీదుగా కేబుల్ బ్రిడ్జి వైపు డైవర్ట్ చేశారు. ట్రాఫిక్ సమస్యను తీర్చేందుకు ఏర్పాటు చేసిన యూటర్న్‌లు, వన్ వేలు మరింత ట్రాఫిక్ జామ్ చేస్తున్నాయి. దీంతో పాటు అడ్డదిడ్డంగా ఏర్పాటు చేసిన బారికేడ్లు, రోడ్ల మూసివేత వాహనదారులకు తిప్పలు తెచ్చిపెడుతున్నాయి.
రోడ్ల విస్తరణ లేకనే ..
జంక్షన్స్ క్లోజ్ చేయడంతో రోడ్ నం.39, బీవీబీ స్కూల్, రోడ్ నెం.45లో హార్ట్ కప్ కాఫీ జంక్షన్, జోజోజ్ రెస్టారెంట్ వద్ద ఏర్పాటు చేసిన యూ టర్న్స్‌లో ట్రాఫిక్ స్లోగా మూవ్ అవుతోంది. ఈ క్రమంలోనే హార్ట్ కప్ జంక్షన్ వద్ద భారీగా ట్రాఫిక్ జామ్ అవుతోంది. రోడ్ల విస్తరణ లేకపోవడమే ఇందుకు కారణం. ఓ వైపు ట్రాఫిక్ జామ్ మరో వైపు దూరం పెరగడంతో వాహనదారులు అసహనం వ్యక్తం చేస్తున్నారు. ట్రయల్ రన్స్ ప్రారంభం నుంచే ఫెయిల్యూర్‌గా సాగుతోంది. ఇందుకు కారణాలను పోలీసులు పరిశీలిస్తున్నారు. వాహనదారుల నుంచి ఫీడ్ బ్యాక్ తీసుకుంటున్నారు. వాటి ఆధారంగా యాక్షన్ ప్లాన్ సిద్దం చేస్తున్నారు. అవసరమైన ప్రాంతాల్లో రోడ్ల వైడెనింగ్చేసేందుకు జీహెచ్‌ఎంసీకి లెటర్స్ రాశారు.
ఆ రూట్లలో నరకం
జూబ్లీహిల్స్ చెక్‌పోస్ట్ నుంచి టీఆర్‌ఎస్ భవన్, బంజారాహిల్స్ వెళ్లే రూట్‌లో ట్రాఫిక్ ఎక్కడా ఆగకుండా వస్తోంది. కానీ టీఆర్‌ఎస్ భవన్ వద్ద యూ టర్న్ తీసుకునే సమయంలో భారీగా జామ్ అవుతోంది. దీని ప్రభావం ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్, పెన్షన్ ఆఫీస్, పంజాగుట్ట ట్రాఫిక్‌పై పడుతోంది. ఫిల్మ్‌నగర్, సీవీఆర్ జంక్షన్ వైపు నుంచి జూబ్లీహిల్స్ చెక్‌పోస్ట్ వెళ్లే ట్రాఫిక్‌ను రోడ్ నం.45 మీదుగా కేబుల్ బ్రిడ్జి రూట్‌లో డైవర్ట్ చేశారు. కానీ ఈ రూట్‌లో ఎప్పటిలాగే ట్రాఫిక్ జామ్ అవుతోంది. ఇరుకుగా ఉన్న రోడ్డులో యూటర్న్‌లు ఏర్పాటు చేయడంతో సమస్య ఏర్పడింది. దీంతో పాటు ఫీనిక్స్ రోడ్ క్లోజ్ చేయడంతో ట్రాఫిక్ అంతా సినీ నటుడు బాలకృష్ణ ఇంటి వద్ద ఉన్న జంక్షన్ మీదుగా జూబ్లీహిల్స్ చెక్‌పోస్ట్ చేరుకోవాల్సి వస్తోంది. దీంతో బంజారాహిల్స్ రోడ్ నం.12, ఫిల్మ్‌నగర్, జర్నలిస్ట్ కాలనీ నుంచి ట్రావెల్ చేసే వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. సిగ్నల్ ఫ్రీ జంక్షన్ చేసినప్పటికీ ట్రాఫిక్ జామ్ సమస్య సాధారణమైపోయింది.
ట్రాఫిక్ సమస్య తీరలే.. దూరం పెరిగింది
హైటెక్ సిటీలో జాబ్ చేస్తున్నా. రోజూ బంజారాహిల్స్ రోడ్ నం.12, కేబుల్ బ్రిడ్జ్ మీదుగా వెళ్లేవాణ్ని. ఈ మధ్య ట్రాఫిక్ పోలీసులు డైవర్షన్ చేశారు. ట్రాఫిక్ జామ్ సమస్య అలాగే ఉంది. పైగా దూరం పెరిగింది. రోజుకు 2 నుంచి 3 కి.మీ. ఎక్కువ దూరం తిరగాల్సి వస్తోంది.
- అంజికుమార్, ప్రైవేట్ ఎంప్లాయ్, ఖైరతాబాద్