సిటీలో మెయిన్​రోడ్లు మినహా ఎక్కడా కనిపించని ట్రాఫిక్ ​పోలీసులు

సిటీలో మెయిన్​రోడ్లు మినహా ఎక్కడా కనిపించని ట్రాఫిక్ ​పోలీసులు
  • సిటీలోని అన్ని ప్రాంతాల్లో పొద్దున, సాయంత్రం ఇదే సమస్య
  • కిలోమీటర్ల మేర నిలిచిపోతున్న వాహనాలు
  • తీవ్ర ఇబ్బందులు పడుతున్న పిల్లలు, తల్లిదండ్రులు

హైదరాబాద్, వెలుగు:గ్రేటర్​లోని స్కూళ్ల వద్ద ఉదయం, సాయంత్రం వేళల్లో భారీగా ట్రాఫిక్ జామ్ అవుతోంది. ముఖ్యంగా సాయంత్రం టైంలో కొన్నిచోట్ల తల్లిదండ్రుల వాహనాలు, స్కూల్​వ్యాన్లు తప్ప ఇతర వాహనాలు వెళ్లే పరిస్థితి ఉండడం లేదు. కంట్రోల్​చేయాల్సిన ట్రాఫిక్​పోలీసులు మెయిన్​రోడ్లపై ఉన్న స్కూళ్ల వద్ద మాత్రమే ఉంటున్నారు. మిగిలిన చోట్ల అంతా క్లియర్​అయ్యేవరకు ఇబ్బందులు తప్పడం లేదు. అటుగా వెళ్లలేక చాలా మంది ఇతర మార్గాల్లో ప్రయాణిస్తున్నారు. లాక్​డౌన్​తర్వాత స్కూళ్ల యాజమాన్యాలు బస్సుల సంఖ్యను తగ్గించాయి. 

పిల్లల పికప్, డ్రాపింగ్​కోసం మినీ వెహికల్స్ ను వాడుతున్నాయి. వీటికితోడు తల్లిదండ్రులే సొంత వెహికల్స్​లో పొద్దున స్కూల్​వద్ద దింపి, సాయంత్రం వచ్చి తీసుకెళ్తున్నారు. దీంతో స్కూళ్ల వద్దకు వచ్చే వెహికల్స్ సంఖ్య పెరిగిపోయింది. అబిడ్స్, బంజారాహిల్స్ రోడ్ నం.10, బేగంపేట, నానల్​నగర్, సికింద్రాబాద్, అమీర్ పేట, కూకట్ పల్లి ఇలా అన్ని ప్రాంతాల్లో సాయంత్రం పూట కిలోమీటర్ల మేర వాహనాలు నిలుస్తున్నాయి. గల్లీల్లోని స్కూళ్ల ఎఫెక్ట్ ​మెయిన్ ​రోడ్లపై కూడా పడుతోంది. 

తరచూ రోడ్లపైనే గొడవలు

అబిడ్స్‌‌లోని ఓ స్కూల్ పరిసర ప్రాంతాల్లో రోజూ భారీగా ట్రాఫిక్ జామ్ అవుతోంది. ఇటు ఎల్బీస్టేడియం నుంచి వచ్చే రూట్‌‌తో పాటు అటు హైదరాబాద్ కలెక్టరేట్ వరకు వాహనాలు నిలుస్తున్నాయి. అబిడ్స్ ​జీపీవో నుంచి నాంపల్లి వైపు వన్ వే కావడంతో ఇతర రూట్లలోకి వెళ్లే అవకాశం లేదు. అలాగే లంగర్ హౌస్ నుంచి నానల్ నగర్ వచ్చే మార్గంలో మెయిన్ రోడ్డుపై ఓ స్కూల్ ఉంది. దీంతోపాటు పక్కనే సాలార్ జంగ్ కాలనీలో మరో స్కూల్ ఉంది. ఈ రెండింటితో మెయిన్ రోడ్డుపై భారీగా ట్రాఫిక్ జామ్ అవుతోంది. సాయంత్రం పూట సాలార్ జంగ్ కాలనీలో నుంచి విద్యార్థులను ఇండ్లకు పంపేందుకు ఏకంగా రోడ్డునే క్లోజ్ చేస్తున్నారు. 
బంజారాహిల్స్‌‌ రోడ్డు నం.7లోని ఓ స్కూల్ వదిలిన టైంలో రోడ్డు నంబర్–10లో కిలోమీటర్ మేర ట్రాఫిక్ నిలుస్తోంది. ఇక్కడ ఒక్కోసారి ట్రాఫిక్ పోలీసులు కూడా ఉండడం లేదు. ఆ టైంలో వాహనదారుల మధ్య గొడవలు జరుగుతున్నాయి. సిటిలోని వేర్వేరు చోట్ల ఇదే పరిస్థితి కనిపిస్తోంది.

మినీ వెహికల్స్ ఎక్కువైనయ్

కరోనా టైంలో బడులు బంద్‌‌ అవడం, తర్వాత కొన్నాళ్లు ఆన్‌‌లైన్‌‌ క్లాసులు కొనసాగడంతో స్కూళ్ల యాజమాన్యాలు బస్సుల కిస్తీలు కట్టలేక అమ్మేశాయి. 
పరిస్థితులు మామూలు అయ్యాక చాలా వరకు స్కూళ్లు అన్నీ మినీ వెహికల్స్ తీసుకున్నాయి. వాటిలో పంపడం ఇష్టం లేని తల్లిదండ్రులు సొంత వెహికల్స్​లో దింపుతున్నారు. అటు మినీ వ్యాన్లు, ఇటు తల్లిదండ్రుల వాహనాలు పెరిగిపోయి అన్నిచోట్ల రద్దీ పెరుగుతోంది. 

చాలా ఇబ్బందిగా ఉంటోంది

బడులు ఎప్పుడూ నడిచేవే. నెలకి ఒకటి, రెండు సార్లు ట్రాఫిక్​ ఇబ్బందులు వస్తే పర్లేదు. కానీ సిటీలోని స్కూళ్ల ముందు ప్రతిరోజు ట్రాఫిక్ ​సమస్య తలెత్తుతోంది. వాహనాలు నిలిపేందుకు ప్లేస్ లేక పిల్లల కోసం తల్లిదండ్రులు, వాహనదారులు రోడ్లపైనే ఆపుతున్నారు. ముఖ్యంగా సాయంత్రం పూట ట్రాఫిక్​ సమస్య లేకుండా చూడాలి. బడులు వదిలే టైంలో అబిడ్స్, జగదీశ్​మార్కెట్ లోకి వెళ్లాలంటే చాలా ఇబ్బందిగా ఉంటోంది. 

– రాఘవేందర్, వాహనదారుడు