
- ఓఆర్ఆర్,పీవీ ఎక్స్ ప్రెస్ వేపై ఎయిర్ పోర్టు వెహికల్స్ కే అనుమతి
- నైట్ పార్టీలకు అర్ధరాత్రి ఒంటిగంట దాకనే పర్మిషన్
- డ్రంకన్ డ్రైవింగ్ తనిఖీలకు 190 స్పెషల్ టీమ్స్
హైదరాబాద్, వెలుగు: న్యూఇయర్ వేడుకలకు గ్రేటర్ హైదరాబాద్ పోలీసులు పకడ్బందీ ఏర్పాట్లు చేశారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా హైదరాబాద్, సైబరాబాద్, రాచకొండ కమిషనరేట్ల పరిధిలో భద్రత పెంచారు. స్టాటిక్, మొబైల్, స్పీడ్ కంట్రోల్, పెట్రోలింగ్, షీ టీమ్స్ సహా బ్లూ కోల్ట్ సిబ్బందిని రంగంలోకి దించారు. డిసెంబర్ 31న నైట్ పార్టీలకు అర్ధరాత్రి ఒంటిగంట వరకే పర్మిషన్ ఇచ్చారు. ఈవెంట్స్ జరిగే ప్రాంతాల్లో సీసీటీవీ కెమెరాలు ఏర్పాటు చేయాలని నిర్వాహకులను ఆదేశించారు. ముఖ్యంగా బంజారాహిల్స్, జూబ్లీహిల్స్, హైటెక్ సిటీలోని పబ్స్‌పై ఫోకస్ పెట్టిన పోలీసులు.. ఈవెంట్లలో సెలబ్రెటీల షో ఉంటే ముందుగానే సమాచారం ఇవ్వాలని చెప్పారు. ఔట్ డోర్ డీజేలపై నిషేధం విధించారు. మూడు కమిషనరేట్ల పరిధిలో ట్రాఫిక్ ఆంక్షలు పెట్టారు. హైదరాబాద్ కమిషనరేట్ పరిధిలో బేగంపేట్, లంగర్‌హౌస్ ఫ్లైఓవర్లు మినహా మిగతావన్నీ మూసేస్తారు. పీవీ ఎక్స్‌ప్రెస్ వేపై ఎయిర్‌పోర్ట్‌కు వెళ్లే వాహనాలను మాత్రమే అనుమతిస్తారు. ట్యాంక్ బండ్, ఎన్టీఆర్ మార్గ్, నెక్లెస్ రోడ్ లో వాహనాలను అనుమతించరు. ఈ ఆంక్షలు శనివారం రాత్రి 10 గంటల నుంచి అర్ధరాత్రి 2 గంటల వరకు అమల్లో ఉంటాయి. సైబరాబాద్, రాచకొండ కమిషనరేట్ల పరిధిలో ఓఆర్‌ఆర్, పీవీ ఎక్స్‌ప్రెస్ వేపై ఎయిర్ పోర్టుకు వెళ్లే వెహికల్స్ ను మాత్రమే అనుమతిస్తారు. సైబరాబాద్ లో శనివారం రాత్రి 10 గంటల నుంచి ఆదివారం తెల్లవారుజామున 5 గంటల వరకు, రాచకొండలో శనివారం రాత్రి 11 గంటల నుంచి ఆదివారం తెల్లవారుజామున 5 గంటల వరకు ఆంక్షలు అమల్లో ఉంటాయి.
రంగంలోకి స్పెషల్ టీమ్స్..
డ్రంకన్ డ్రైవ్ తనిఖీల కోసం స్టాటిక్, మొబైల్, స్పీడ్ కంట్రోల్ టీమ్స్ ఏర్పాటు చేశారు. పబ్స్, హోటళ్ల రూట్లలో స్టాటిక్ టీమ్ చెక్ పాయింట్లు పెట్టారు. డ్రంకన్ డ్రైవ్ ఎక్కువగా జరిగే ఏరియాల్లో మొబైల్ టీమ్స్‌తో రోమింగ్ ఏర్పాట్లు చేశారు. మూడు కమిషనరేట్లలో కలిపి 190 స్పెషల్ టీమ్స్ ను రంగంలోకి దించారు. ఓవర్ స్పీడ్ నియంత్రణకు స్పీడ్ కంట్రోల్ టీమ్స్ ఏర్పాటు చేశారు. ఈవెంట్స్ జరిగే ప్రాంతాల్లో క్యాబ్స్ అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవాలని నిర్వాహకులకు సూచించారు. మద్యం మత్తులో ఉన్న వారిని క్యాబ్స్‌లో తరలించాలని చెప్పారు.
రాత్రి 2 దాకా మెట్రో
న్యూ ఇయర్ సందర్భంగా శనివారం రాత్రి 2 గంటల వరకు మెట్రో రైళ్లు నడుపుతామని హైదరాబాద్ మెట్రో రైల్ లిమిటెడ్(హెచ్‌ఎంఆర్‌ఎల్) ఎండీ ఎన్వీఎస్ రెడ్డి ప్రకటించారు. చివరి రైళ్లు స్టేషన్ల నుంచి ఒంటి గంటకు బయలుదేరి 2 గంటల వరకు గమ్యస్థానాలకు చేరుకుంటాయని ఆయన పేర్కొన్నారు. ప్రయాణికులు రైళ్లు, స్టేషన్లలో మద్యం తాగి దుర్భాషలాడకుండా మైట్రో రైల్ పోలీసులు, సెక్యూరిటీ వింగ్‌ల నిఘా ఉంచుతామని తెలిపారు. ప్యాసింజర్లు అధికారులకు సహకరించాలని, అవాంఛనీయ సంఘటనలకు ఆస్కారం ఇవ్వకుండా బాధ్యతాయుతంగా ప్రయాణించాలని ఎల్‌అండ్‌టీ ఎంఆర్‌హెచ్‌ఎల్ ఎండీ కేవీబీ రెడ్డి కోరారు.
దుర్గం చెరువు ఫ్లైఓవర్ పై నో సెలబ్రేషన్స్..
మాదాపూర్ డివిజన్‌లో 60 స్పెషల్ ఈవెంట్స్‌కు పర్మిషన్ ఇచ్చాం. దుర్గం చెరువు ఫ్లైఓవర్ మినహా మిగతా ఫ్లైఓవర్లు మూసివేస్తాం. దుర్గం చెరువు ఫ్లైఓవర్ పై వాహనాలు, సెలబ్రేషన్స్‌కు అనుమతి లేదు.
–శిల్పవల్లి, డీసీపీ, మాదాపూర్