మేడ్చల్ జిల్లాలో విషాదం.. ఈతకు వెళ్లి ఆరుగురు మృతి

మేడ్చల్ జిల్లాలో విషాదం..  ఈతకు వెళ్లి ఆరుగురు మృతి

మేడ్చల్ జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. జవహర్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని మల్కారం చెరువులో ఈతకు వెళ్లిన ఆరుగురు చనిపోయారు. ఇందులో ఐదుగురు చిన్నారులు, ఒక పెద్ద వయస్కుడు ఉన్నాడు. వీరంతా అంబర్ పేట్ నుంచి ఓ ఫంక్షన్ కోసం మల్కారానికి వచ్చినట్లు స్థానికులు తెలిపారు.  

తనతోపాటు వచ్చిన చిన్నారులు ఈత కోసం చెరువులోకి దిగి బయటకు రాలేక మునిగిపోతుంటే ఆ వ్యక్తి గుర్తించాడు. వారిని రక్షించేందుకు ప్రయత్నించాడు. ఈక్రమంలో ఆ వ్యక్తి సైతం నీట మునిగి చనిపోయాడు. లోతు తక్కువగా ఉందని భావించి.. చెరువులోకి దిగిన వారంతా మునిగిపోయినట్లు తెలుస్తోంది. స్థానికులు సమాచారం ఇవ్వడంతో వెంటనే పోలీసులు చెరువు వద్దకు చేరుకున్నారు. స్థానికుల సహకారంతో మృతదేహాలను బయటకు తీశారు. ప్రత్యక్ష సాక్షులతో మాట్లాడి ప్రమాదానికి సంబంధించిన వివరాలపై ఆరా తీశారు.