ఆన్లైన్ బెట్టింగులకు కుటుంబం బలి

ఆన్లైన్ బెట్టింగులకు కుటుంబం బలి
  • భార్యాపిల్లల్ని కాల్చి చంపి కానిస్టేబుల్ ఆత్మహత్య
  • ఆన్​లైన్ బెట్టింగులతో అప్పులపాలు
  • ఎకరం అమ్మినా తీరని అప్పు
  • మృతుడు కలెక్టర్ దగ్గర గన్​మ్యాన్
  • సిద్దిపేట జిల్లా రామునిపట్లలో విషాదం 

సిద్దిపేట, వెలుగు : భార్యాపిల్లలను కాల్చి చంపి, ఓ కానిస్టేబుల్ తానూ ఆత్మహత్య చేసుకున్నాడు. ఆన్​లైన్​ బెట్టింగ్​లతో అప్పుల పాలై ఈ దారుణానికి పాల్పడినట్టు తెలుస్తున్నది. ఈ విషాద ఘటన సిద్దిపేట జిల్లా చిన్నకోడూరు మండలం రామునిపట్లలో శుక్రవారం జరిగింది. గ్రామానికి చెందిన ఆకుల నరేశ్​(35) 2013లో ఏఆర్ కానిస్టేబుల్ గా ఎంపికయ్యాడు. సిద్దిపేటలో డ్యూటీ చేస్తున్నాడు. కొంతకాలంగా సిద్దిపేట కలెక్టర్ ప్రశాంత్ జీవన్ పాటిల్ దగ్గర పర్సనల్ సెక్యూరిటీ ఆఫీసర్ (గన్​మ్యాన్)గా విధులు నిర్వర్తిస్తున్నాడు. నరేశ్ కు 2015లో కోహెడ మండలం ఎర్రగుంటపల్లి గ్రామానికి చెందిన చైతన్య (30)తో పెండ్లి అయింది. వీళ్లకు ఇద్దరు పిల్లలు రేవంత్ (6), రిషిత (5) ఉన్నారు. చైతన్య సిద్దిపేటలోని ఓ ప్రైవేట్ స్కూల్ లో టీచర్ గా పని చేస్తుండగా, పిల్లలు అదే స్కూల్ లో చదువుకుంటున్నారు. 

నరేశ్ కుటుంబం ఇన్ని రోజులు సిద్దిపేటలోనే ఉండగా, రెండు నెలల కింద స్వగ్రామమైన రామునిపట్లకు షిఫ్ట్ అయ్యారు. రెండ్రోజుల కిందనే తాను జాబ్ మానేస్తున్నట్టు స్కూల్ యాజమాన్యానికి చైతన్య చెప్పింది. నరేశ్ కుటుంబం ఒక ఇంట్లో.. ఆయన తల్లిదండ్రులు, తమ్ముళ్లు గ్రామంలోనే మరొక ఇంట్లో ఉంటున్నారు. 

డ్యూటీకి వెళ్లి తిరిగొచ్చి.. 

శుక్రవారం ఉదయం నరేశ్​ డ్యూటీకి వెళ్లాడు. కలెక్టర్ లీవ్​లో ఉండడంతో ఉదయం 9 గంటలకు తిరిగి ఇంటికి వచ్చాడు. కొద్దిసేపటి తర్వాత నరేశ్​ఇంట్లోంచి కాల్పుల శబ్దం వినిపించడంతో స్థానికులు వెళ్లి చూశారు. మెయిన్ డోర్ లోపలి నుంచి గడియ పెట్టి ఉండడంతో స్థానికులు పోలీసులకు సమాచారమిచ్చారు. వారు వచ్చి తలుపులు పగులకొట్టి చూడగా.. నరేశ్, అతని భార్యా పిల్లలు రక్తపు మడుగులో పడి ఉన్నారు. నరేశ్ మొదట తన భార్యా పిల్లలను పిస్టల్​తో కణత దగ్గర కాల్చి చంపి, తర్వాత అదే పిస్టల్​తో తానూ కాల్చుకొని ఆత్మహత్య చేసుకుని ఉంటాడని పోలీసులు భావిస్తున్నారు. కలెక్టర్ గన్​మెన్​గా పని చేస్తున్న నరేశ్ ​దగ్గర షార్ట్ వెపన్ ఉంది. శుక్రవారం కలెక్టర్ లేకపోవడంతో రిలీవర్​కు ఇవ్వకుండా వెపన్​తోనే ఇంటికి వచ్చాడు. 

ఎకరం భూమి అమ్మినా అప్పులు తీరలె..

ఆన్​లైన్ బెట్టింగ్​లకు అలవాటుపడిన నరేశ్..​ భారీగా అప్పులు చేసినట్టు తెలుస్తోంది. అప్పులు ఎక్కువై ఆర్థికంగా ఇబ్బందులు కావడంతోనే సిద్దిపేట నుంచి సొంతూరికి మకాం మార్చాడని చెబుతున్నారు. అప్పులు ఇచ్చినోళ్ల నుంచి ఒత్తిడి పెరగడంతో ఇటీవల ఎకరం పొలం అమ్మాడు. వచ్చిన రూ.40 లక్షలతో అప్పులు కట్టాడు. అయినా ఇంకా అప్పులు ఉండడంతో మరికొంత భూమి అమ్మాలని నిర్ణయించుకున్నాడు. అయితే అందుకు తల్లిదండ్రులు, తమ్ముళ్లు ఒప్పుకోలేదని.. దీంతో వారి మధ్య గొడవలు జరుగుతున్నాయని తెలుస్తోంది. శుక్రవారం కూడా అప్పుల విషయంలోనే భార్యతో నరేశ్ గొడవ పడ్డాడని, క్షణికావేశంలో ఈ ఘాతుకానికి పాల్పడి ఉంటాడని అనుమానిస్తున్నారు. 

స్కూల్ డ్రెస్సులో పిల్లలు..

శుక్రవారం స్కూల్​కు వెళ్లేందుకు రెడీ అయిన రేవంత్, రిషిత.. తన తండ్రి చేతిలో ప్రాణాలు కోల్పోయారు. స్కూల్ బస్సు వచ్చే టైమ్​కే నరేశ్ ఇంటికి వచ్చాడని, రాగానే భార్యతో గొడవపడి.. అందరినీ కాల్చి చంపాడని స్థానికులు అంటున్నారు. స్కూల్ డ్రెస్సులోనే ఇద్దరు చిన్నారులు రక్తపు మడుగులో పడి ఉన్నారు. ఘటన జరిగినప్పుడు నరేశ్ తల్లిదండ్రులు పొలానికి వెళ్లారు. ఘటనా స్థలాన్ని సిద్దిపేట సీపీ శ్వేత పరిశీలించారు. నరేశ్​కు ఆర్థిక సమస్యలు ఉన్నట్టు తెలిసిందని చెప్పారు.