
- రోడ్డు ప్రమాదంలో మామ, అల్లుడు మృతి
- మరో ఇద్దరికి తీవ్ర గాయాలు
- పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్‌లో విషాదం
సుల్తానాబాద్, వెలుగు: రోడ్డు ప్రమాదంలో మామ, అల్లుడు చనిపోవడంతో పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ పట్టణంలో విషాదం చోటుచేసుకుంది. ఎస్సై శ్రావణ్‌కుమార్ తెలిపిన వివరాల ప్రకారం.. సుల్తానాబాద్ మండలం సుద్దాల గ్రామ శివారులో మంగళవారం తెల్లవారుజామున జరిగిన రోడ్డు ప్రమాదంలో సుల్తానాబాద్ పట్టణానికి చెందిన ముత్యం రాకేశ్(29), పూదరి రోహిత్ కుమార్ అలియాస్ అభి(24) చనిపోగా, మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు.
సుల్తానాబాద్ సివిల్ ఆసుపత్రిలో సెక్యూరిటీ గార్డుగా పని చేసే ఔట్ సోర్సింగ్ ఉద్యోగి రాకేశ్, స్థానిక ప్రైవేట్ స్కూల్ లో పని చేసే రోహిత్ కుమార్, సుగ్లాంపల్లికి చెందిన పాపని ఆదర్శ్(22) కలిసి సుద్దాల గ్రామానికి బైక్ పై వెళ్లి తిరిగి వస్తున్నారు. వీరి బైక్‌ను సుల్తానాబాద్ మండలం అల్లీపూర్ గ్రామానికి చెందిన గసిగంటి రఘు బైక్ పై వస్తూ ఢీకొనడంతో ఈ ప్రమాదం జరిగింది.
నలుగురు తీవ్రంగా గాయపడగా, సుల్తానాబాద్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి ప్రాథమిక చికిత్స జరిపించారు. అనంతరం కరీంనగర్ ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకువెళ్లగా, అప్పటికే రాకేశ్, రోహిత్ కుమార్ చనిపోయారు. గాయపడిన రఘు కరీంనగర్ లో చికిత్స పొందుతుండగా, ఆదర్శ్ ను హైదరాబాద్ కు తరలించారు.
రాకేశ్‌కు రోహిత్ మేనల్లుడు కావడంతో ఇరు కుటుంబాల్లో విషాదం నెలకొంది. ఘటనా స్థలాన్ని సీఐ సుబ్బారెడ్డి, ఎస్సై శ్రావణ్ కుమార్ సందర్శించారు. రాకేశ్ తల్లి రాజేశ్వరి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు.