
నల్గొండ అర్బన్, వెలుగు: పురిటి నొప్పులతో హాస్పిటల్‌కు వచ్చిన మహిళ కడుపులోనే శిశువు చనిపోగా, మహిళ పరిస్థితి విషమంగా మారింది. దీనికి డాక్టర్ల నిర్లక్ష్యమే కారణమంటూ మహిళ కుటుంబ సభ్యులు ఆందోళనకు దిగారు. ఈ ఘటన నల్గొండ జిల్లా ప్రభుత్వ హాస్పిటల్‌లో జరిగింది.
వివరాల్లోకి వెళ్తే.. నల్గొండ జిల్లా గుర్రంపోడు మండల కేంద్రానికి చెందిన కడమంచి రేణుకకు పురిటినొప్పులు రావడంతో బుధవారం ఉదయం నల్గొండ ప్రభుత్వ హాస్పిటల్‌కు తీసుకొచ్చారు. పరీక్షించిన డాక్టర్లు డెలివరీకి మరో వారం రోజులు పడుతుందని చెప్పడంతో వారు హాస్పిటల్ బయటకువచ్చారు. ఈ సమయంలో రేణుకకు మరోసారి నొప్పులు రావడంతో కుటుంబ సభ్యులు తిరిగి హాస్పిటల్‌కు తీసుకెళ్లారు.
రేణుకను మరోసారి పరీక్షించిన డాక్టర్లు శిశువు గర్భంలోనే చనిపోయిందని, రెండు రోజుల కిందే చనిపోయి ఉంటుందని చెప్పి కాన్పు చేసి మృత శిశువును బయటకు తీశారు. దీంతో డాక్టర్ల నిర్లక్ష్యం కారణంగానే శిశువు చనిపోయిందంటూ మహిళ బంధువులు హాస్పిటల్ ఎదుట ఆందోళనకు దిగారు. డాక్టర్లపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
విషయం తెలుసుకున్న టూటౌన్ పోలీసులు హాస్పిటల్ వద్దకు చేరుకొని నచ్చజెప్పడంతో ఆందోళన విరమించారు. కాగా, ఈ విషయంపై హాస్పిటల్ సూపరింటెండెంట్ అరుణకుమారి మాట్లాడుతూ.. మహిళ బంధువులు చేస్తున్న ఆరోపణల్లో నిజం లేదన్నారు. శిశువు రెండు రోజుల కిందే గర్భంలోనే చనిపోయిందని చెప్పిన తర్వాతే, డెలివరీ చేశామని తెలిపారు.