బతుకమ్మ ఆడుతూ గుండెపోటుతో కుప్పకూలిన మహిళ.. ఆసుపత్రికి తీసుకెళుతుండగా దారిలోనే..

బతుకమ్మ ఆడుతూ గుండెపోటుతో కుప్పకూలిన మహిళ.. ఆసుపత్రికి తీసుకెళుతుండగా దారిలోనే..

మహబూబాబాద్: మహబూబాబాద్ జిల్లాలో విషాద ఘటన జరిగింది. బతుకమ్మ ఆడుతూ శెట్టి మౌనిక అనే మహిళ గుండెపోటుతో చనిపోయింది. కొత్తగూడ మండలం ఎంచగూడెం గ్రామంలో ఆదివారం రాత్రి పండుగ పూట ఈ విషాదం జరగడంతో గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. ఊరిలోని ఒక ఆలయ ప్రాంగణంలో కుటుంబ సభ్యులతో ఎంగిలిపూల బతుకమ్మ సంబరాల్లో పాల్గొని పాటలు పాడుతూ కోలాటాలు వేస్తూ... బతుకమ్మల చుట్టూ తిరుగుతూ ఒక్కసారిగా మౌనిక కుప్పకూలిపోయింది. ఆమెను హుటాహుటిన ఆసుపత్రికి తరలించేందుకు ప్రయత్నించగా, పరిస్థితి విషమించి ఆసుపత్రికి వెళ్లే లోపు దారిలోనే ఆమె ప్రాణాలు కోల్పోయింది. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

గుండెపోటు వస్తే ఛాతినొప్పి, చెమటలు పట్టడం, ఊపిరి ఆడకపోవడం వంటి లక్షణాలు కనిపిస్తాయి. ఇది మనందరికి తెలుసు.. అయితే ఎటువంటి లక్షణాలు లేని హార్ట్ అటాక్  కూడా ఉందని బాంబ్ పేల్చారు డాక్టర్లు. హార్ట్ అటాక్ లు ఐదు రకాలుగా ఉంటాయని..వాటిలో ఒక రకం హార్ట్ అటాక్ ఎటువంటి సింప్టమ్స్ లేకుండానే  వస్తుందని..ఇది చాలా డేంజర్ అని హెచ్చరిస్తున్నారు. 

సైలెంట్ హార్ట్ అటాక్ సాధారణ గుండెపోటుకు కారణమయ్యే అవే కారణాల వల్ల వస్తుంది. గుండె కండరాలకు రక్తాన్ని సరఫరా చేసే ధమనులు (కరోనరీ ధమనులు) అడ్డుపడటం వల్ల గుండె కండరాలకు తగినంత ఆక్సిజన్ అందకపోవడం వల్ల ఇది జరుగుతుంది. ఈ అడ్డంకి సాధారణంగా ధమనులలో కొవ్వు ,కొలెస్ట్రాల్ నిక్షేపాలు (ప్లాక్) పేరుకుపోవడం వల్ల ఏర్పడుతుంది. ఈ ప్లాక్ విరిగిపోయి రక్తం గడ్డకట్టడానికి దారితీసినప్పుడు, అది రక్త ప్రవాహాన్ని పూర్తిగా అడ్డుకుంటుంది. ఫలితంగా గుండెపోటు వస్తుందంటున్నారు డాక్టర్లు.