
రోషన్ కనకాల హీరోగా రవికాంత్ పేరేపు తెరకెక్కించిన ‘బబుల్‌గమ్’ చిత్రం డిసెంబర్ 29న ప్రేక్షకుల ముందుకు వస్తోంది. ఈ నేపథ్యంలో శుక్రవారం ట్రైలర్‌ను లాంచ్ చేశారు. ‘సంగీత ప్రపంచంలో తనదైన ముద్ర వేసుకోవాలని ప్రయత్నిస్తున్న యువకుడిగా రోషన్ కనిపించాడు. మానస రాకతో తన జీవితం మలుపు తిరుగుతుంది. కానీ ఆ ప్రేమ విఫలం అవడంతో తన టాలెంట్ ఏమిటో ప్రపంచానికి చాటాలనుకుంటాడు. ‘నా నసీబ్‌లో ఏం రాసి పెట్టుందో నాకు తెల్వదు... కానీ నచ్చినట్లు మార్చుకుంటా.. కావాల్సింది లాక్కొని తెచ్చుకుంటా.. అదీ ఇజ్జత్ అయినా... ఔకాత్ అయినా’ అనే డైలాగ్ ఆకట్టుకుంది. ఇక ట్రైలర్ లాంచ్ ఈవెంట్‌కు హీరో రానా, దర్శకులు రాఘవేంద్రరావు, అనిల్ రావిపూడి ముఖ్యఅతిథులుగా హాజరై.. యూత్‌కి కావాల్సిన అన్ని ఎలిమెంట్స్ ఉన్న ఈ సినిమా సక్సెస్ సాధించాలని విష్ చేశారు.
రోషన్ మాట్లాడుతూ ‘ఇది చలికాలం కదా అని కొంచెం వెచ్చగా ఉండేలా మా దర్శకుడు రవికాంత్ ఫైర్ లాంటి ట్రైలర్‌ని ఇచ్చాడు. ఎవరికైనా జీవితంలో ఏదో ఒక సందర్భంలో రివేంజ్ తీర్చుకోవాలనిపిస్తుంది. ఇందులోని హీరో క్యారెక్టర్ కూడా అంతే. ‘చెవులు మూసుకున్నా వినపడేలా, కళ్లు మూసుకున్నా కనపడేలా’ రివేంజ్ తీర్చుకుంటానంటాడు’ అని చెప్పాడు. అవకాశం కల్పించిన దర్శక నిర్మాతలకు హీరోయిన్ మానస చౌదరి థాంక్స్ చెప్పింది. దర్శకుడు రవికాంత్ మాట్లాడుతూ ‘ట్రైలర్ కంటే సినిమా ఇరవై రెట్లు హై ఇస్తుంది. అందరికీ క్రేజీగా నచ్చుతుంది. రోషన్, మానస అద్భుతంగా నటించారు. వంశీ గారికి, స్క్రిప్ట్ లో గైడ్ చేసిన అబ్బూరి రవి గారికి థాంక్స్. బబుల్‌గమ్ అంటుకుంటే తీసేయాలనిపిస్తుంది. కానీ ఈ బబుల్‌గమ్ ఎదురెళ్లి అంటించుకోవాలనిపిస్తుంది’ అని చెప్పాడు. సుమ, రాజీవ్ కనకాల, సహ నిర్మాత వివేక్ కూచిభొట్ల, సంగీత దర్శకుడు శ్రీచరణ్ పాకాల తదితరులు పాల్గొన్నారు.