
జైపూర్(భీమారం), వెలుగు: గుండెపోటు తో చనిపోయిన సీఆర్పీఎఫ్ ట్రైనీ జవాను రామళ్ల సాగర్(28 )కు అధికార లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహించారు. భీమారం మండల కేంద్రానికి చెందిన సాగర్ సీఆర్పీఎఫ్ జవాన్‌గా ఏపీలోని చిత్తూరు జిల్లా కలికిరి సీఆర్పీఎఫ్ ట్రైనింగ్ సెంటర్ లో నాలుగు నెలలుగా శిక్షణ పొందుతున్నాడు. నాలుగు రోజుల క్రితం సెలవులపై ఇంటికి వచ్చి బుధవారం స్నేహితుడి పెండ్లికి వెళ్లి మంచిర్యాలలోని ఓ హోటల్ కు వెళుతున్న సమయంలో గుండెపోటుతో కుప్పకూలి చనిపోయాడు.
గురువారం సాగర్ డెడ్ బాడీకి హైదరాబాద్ కు చెందిన సీఆర్ పీఎఫ్ అసిస్టెంట్ కమాండెంట్ రాకేశ్ దేహరియా, సిబ్బంది అధికార లాంఛనాలతో మండల కేంద్రంలోని గొల్లవాగు ప్రాజెక్ట్ సమీపంలో అంత్యక్రియలు నిర్వహించారు. స్థానిక పోలీసులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.