కరీంనగర్‌ ‌‌‌లో దళిత యువకుడిపై ట్రైనీ ఎస్సై దాడి

కరీంనగర్‌ ‌‌‌లో దళిత యువకుడిపై ట్రైనీ ఎస్సై దాడి
  • దెబ్బతిన్న బాధితుడి కర్ణభేరి
  • నేషనల్ ఎస్సీ కమిషన్‌‌‌‌కు ఫిర్యాదు
  • రిపోర్ట్‌‌‌‌ ఇవ్వాలని అడిషనల్‌‌‌‌ డీజీపీ, సీపీకి నోటీసులు 

కరీంనగర్, వెలుగు : ట్రైనీ ఎస్సై, ఇద్దరు కానిస్టేబుళ్ల దాడిలో ఓ దళిత యువకుడు తీవ్రంగా గాయపడ్డాడు. బాధితులు రాష్ట్ర హ్యూమన్‌‌‌‌ రైట్స్‌‌‌‌ కమిషన్‌‌‌‌తో పాటు నేషనల్‌‌‌‌ ఎస్సీ కమిషన్‌‌‌‌కు ఫిర్యాదు చేశాడు. స్పందించిన నేషనల్‌‌‌‌ ఎస్సీ కమిషన్‌‌‌‌ ఘటనపై 20 రోజుల్లో రిపోర్ట్‌‌‌‌ ఇవ్వాలని పోలీసులను ఆదేశించింది. వివరాల్లోకి వెళ్తే... కరీంనగర్‌‌‌‌ జిల్లా సైదాపూర్ మండలం గొల్లగూడెం గ్రామానికి చెందిన బత్తుల మహేందర్‌‌‌‌ కూల్‌‌‌‌డ్రింక్స్‌‌‌‌ సప్లై చేస్తూ జీవిస్తున్నాడు. ఈ నెల 8న సాయంత్రం మొలంగూర్‌‌‌‌ నుంచి సైదాపూర్‌‌‌‌కు టీవీఎస్‌‌‌‌ చాంప్‌‌‌‌పై వస్తుండగా సోమారం గ్రామశివారులో డ్రంక్‌‌‌‌ అండ్‌‌‌‌ డ్రైవ్‌‌‌‌ టెస్ట్‌‌‌‌ కోసం పోలీసులు ఆపారు. టెస్ట్‌‌‌‌ చేసి చలాన్‌‌‌‌ వేసిన తర్వాత అతడి వివరాలు రాసుకున్నారు. అనంతరం ట్రైనీ ఎస్సై భార్గవ్‌‌‌‌.. మహేందర్‌‌‌‌ సెల్‌‌‌‌ఫోన్‌‌‌‌ లాక్కొని, పక్కన నిలబడాలని సూచించాడు.

అయితే తన భార్య కాలు విరిగి ఇంట్లో ఉందని, ఆమె ఫోన్‌‌‌‌ చేస్తుందని మహేందర్‌‌‌‌ ఎస్సైకి చెప్పాడు. దీంతో ఆగ్రహానికి గురైన ఎస్సై బూతులు తిడుతూ, ఫోన్‌‌‌‌ను పగులగొట్టాడు. తర్వాత కానిస్టేబుల్‌‌‌‌ ఆకాశ్‌‌‌‌రెడ్డి, మరో కానిస్టేబుల్‌‌‌‌ కలిసి తన కులం అడిగి, బూతులు తిట్టారని బాధితుడు చెప్పాడు. పోలీసుల దాడి చేయడంతో తన కర్ణభేరి పగిలినట్లు రిపోర్టుల్లో తేలిందని ఆవేదన వ్యక్తం చేశారు. అదే రోజు రాత్రి తనను స్టేషన్‌‌‌‌కు తీసుకెళ్లి తనదే తప్పు అని బలవంతంగా లెటర్‌‌‌‌ రాయించుకున్నారని, ఈ విషయం బయటకు చెబితే ‘నువ్వే మా మీద దాడి చేశావని కేసు ఫైల్‌‌‌‌ చేస్తాం’ అని బెదిరించారని వాపోయాడు.

ఈ విషయంపై 14న కరీంనగర్‌‌‌‌ సీపీకి ఫిర్యాదు చేయడంతో ఆయన ఎంక్వైరీ చేయాలని హుజూరాబాద్ ఏసీపీ శ్రీనివాస్‌‌‌‌కు సూచించారని, ఏసీపీ తనను పిలిచి వాంగ్మూలం తీసుకున్న రెండు రోజులకే ట్రాన్స్‌‌‌‌ఫర్‌‌‌‌ అయ్యారని మహేందర్ వెల్లడించాడు. అనంతరం బాధితుడు మహేందర్‌‌‌‌ నేషనల్‌‌‌‌ ఎస్సీ కమిషన్‌‌‌‌కు ఫిర్యాదు చేశాడు. స్పందించిన కమిషన్‌‌‌‌ రాష్ట్ర లా అండ్‌‌‌‌ ఆర్డర్‌‌‌‌ అడిషనల్‌‌‌‌ డీజీపీ, కరీంనగర్ సీపీకి సోమవారం నోటీసులు జారీ చేసింది. మహేందర్ ఇచ్చిన ఫిర్యాదుపై పోలీసులు ఇప్పటివరకు తీసుకున్న చర్యలపై 20 రోజుల్లో రిపోర్ట్‌‌‌‌ ఇవ్వాలని ఆదేశించింది. సమాధానం ఇవ్వకపోతే.. కమిషన్‌‌‌‌ ఎదుట స్వయంగా హాజరు అయ్యేందుకు సమన్లు జారీ చేస్తామని హెచ్చరించింది.