లెటర్ పట్టు.. ట్రాన్స్ఫర్ కొట్టు!..సాధారణ బదిలీల వేళ లెటర్ ప్యాడ్లు అమ్ముకుంటున్న ఉద్యోగ సంఘాల లీడర్లు

లెటర్ పట్టు.. ట్రాన్స్ఫర్ కొట్టు!..సాధారణ బదిలీల వేళ లెటర్ ప్యాడ్లు అమ్ముకుంటున్న ఉద్యోగ సంఘాల లీడర్లు
  • పోస్టును బట్టి రూ. 2 లక్షల నుంచి రూ. 5 లక్షల వసూళ్లు
  • సెన్సస్‌‌‌‌‌‌‌‌ డ్యూటీ ఆర్డర్లను సైతం కొనేస్తున్నారు

హైదరాబాద్, వెలుగు :  రాష్ట్రంలో ఉద్యోగుల బదిలీల ప్రక్రియ కొందరు ఉద్యోగ సంఘాల నేతలకు కాసుల వర్షం కురిపిస్తోంది. ఆయా లీడర్లు తమ లెటర్ ప్యాడ్లను వ్యాపారసరుకుగా మార్చేశారు. నచ్చిన చోటుకు బదిలీ కావాలనే ఉద్యోగుల బలహీనతను ఆసరాగా చేసు కొని సిఫార్సు లేఖల కోసం పోస్టును బట్టి రూ. 2 లక్షల నుంచి రూ. 5 లక్షల దాకా వసూలు చేస్తున్నట్లు తెలుస్తోంది. కేవలం బదిలీ నుంచి తప్పించుకుని  ఓడీ పొందడం కోసమే కాకుండా కోరుకున్న చోట బదిలీల కోసం కూడా  ఉద్యోగ సంఘాల  లెటర్లు వాడుకుంటారు. వాస్తవానికి గుర్తింపు పొందిన యూనియన్లలో ప్రెసిడెంట్ తో పాటు జనరల్​ సెక్రటరీకి ఓడీ సౌకర్యం ఉంటుంది.

కానీ సంఘాల లెటర్లతో ఏదో ఒక పోస్టు క్రియేట్​ చేసుకుని బదిలీ తప్పించుకుంటున్నారు. ఇలా కొన్ని వందల సంఖ్యలో లెటర్లను ఉద్యోగ సంఘాల నేతలు అమ్ముకుంటున్నట్లు జోరుగా చర్చ జరుగుతున్నది. ఈ ‘లెటర్’ దందా ఇప్పుడు హైదరాబాద్​ నుంచి జిల్లాల దాకా వెళ్లింది.  ప్రభుత్వ ఉద్యోగుల హక్కుల కోసం పోరాడాల్సిన సంఘాల నాయకులే.. ఇప్పుడు బదిలీల బ్రోకర్లుగా అవతారమెత్తడం విస్మయం కలిగిస్తోంది. బదిలీ కోరుకునే పోస్టు డిమాండ్, సదరు సీటుకున్న ‘క్రేజ్’ను బట్టి రేట్లు మారుతున్నాయి. సాధారణ పోస్టులకు రూ.2లక్షల నుంచి మొదలుపెట్టి,  ‘కీలక’ పోస్టులకైతే రూ. 5 లక్షల వరకు డిమాండ్ చేస్తున్నట్లు చెప్తున్నారు.  రేటు కుదిరితేనే లెటర్ ప్యాడ్‌‌‌‌‌‌‌‌పై సిఫార్సు ముద్ర పడుతుండటంతో, నిజాయితీగా ఉండే ఉద్యోగులు నష్టపోతున్నారు.

నిబంధనలు బేఖాతర్ !

జాయింట్​ స్టాఫ్​ కౌన్సిల్‌‌‌‌‌‌‌‌లో భాగస్వాములుగా ఉన్న గుర్తింపు పొందిన ఉద్యోగ సంఘాల నేతలకు 'అదర్ డ్యూటీ'  వెసులుబాటు కల్పిస్తూ  ప్రభుత్వం అనుమతిస్తుంది.   జాయింట్ స్టాఫ్ కౌన్సిల్‌‌‌‌‌‌‌‌లో ఉన్న 9 ముఖ్యమైన శాశ్వత ఉద్యోగ సంఘాల్లో  టీఎన్‌‌‌‌‌‌‌‌జీవో  సెంట్రల్ యూనియన్   టీజీవో   కేంద్ర సంఘం   టీజీఎస్‌‌‌‌‌‌‌‌ఏ , పీఆర్‌‌‌‌‌‌‌‌టీయూ, ఎస్టీయూ టీఎస్ , ట్రెసా, తెలంగాణ క్లాస్ ఫోర్   ఉద్యోగుల కేంద్ర సంఘం, టీఎస్‌‌‌‌‌‌‌‌యూటీఎఫ్ , టీఆర్‌‌‌‌‌‌‌‌టీఎఫ్  ఉన్నాయి.  ఈ 9 శాశ్వత సంఘాలతో పాటు మరో 6 సంఘాలకు రొటేషన్ ప్రాతిపదికన కౌన్సిల్‌‌‌‌‌‌‌‌లో సభ్యత్వం ఉంటుంది.

వీటితోపాటు అసలు గుర్తింపు లేని చిన్న చిన్న సంఘాల లీడర్లు సైతం లెటర్ ప్యాడ్లను ఇష్టారాజ్యంగా దుర్వినియోగం చేస్తున్నారని ఉద్యోగులు వాపోతున్నారు. కేవలం కాగితాలకే పరిమితమైన సంఘాల పేరుతో లెటర్ హెడ్లు సృష్టించి, తాము కూడా ప్రభుత్వ పెద్దల వద్ద పనులు చేయించగలమంటూ ఉద్యోగులను నమ్మిస్తూ వసూళ్లకు తెగబడుతున్నారనే వార్తలు వస్తున్నాయి.  నిజానికి బదిలీల నిబంధనల ప్రకారం ఒకే చోట ఆరేళ్లు పూర్తి చేసుకున్న ఏ ఉద్యోగి అయినా కచ్చితంగా ట్రాన్స్​ఫర్​ కావాల్సిందే. ఈ రూల్ ఉద్యోగ సంఘాల నేతలకు కూడా వర్తిస్తుంది.

కానీ, ఈ లీడర్లు మాత్రం తాము సంఘం నేతలమనే ముసుగులో   దశాబ్ద కాలంగా ఒకే చోట, అదీ కీలకమైన సీట్లలో పాతుకుపోతున్నారు. అంతేకాకుండా, నిబంధనల ప్రకారం ఉద్యోగ సంఘాల తరఫున కేవలం ఇద్దరు ముఖ్య నేతలకు (అధ్యక్ష, కార్యదర్శులకు) మాత్రమే ఓడీ (ఆన్ డ్యూటీ) సౌకర్యం ఉంటుంది. అంటే వారు ఆఫీస్ పని చేయకపోయినా డ్యూటీలో ఉన్నట్లు పరిగణిస్తారు. కానీ, క్షేత్రస్థాయిలో మాత్రం నిబంధనలను తుంగలో తొక్కి, సంఘంలోని లూప్‌‌‌‌‌‌‌‌హోల్స్‌‌‌‌‌‌‌‌ను వాడుకుంటూ కార్యవర్గంలోని అందరూ ఓడీ సౌకర్యాన్ని అక్రమంగా అనుభవిస్తూ ఆఫీసులకు ఎగ్గొడుతున్నారు. ఇలా విధులకు ఎగనామం పెడుతూ, బదిలీల వేళ లెటర్ ప్యాడ్ల దందాతో సొమ్ము చేసుకుంటున్న లీడర్ల తీరుపై సాధారణ ఉద్యోగులు అగ్గిమీద గుగ్గిలమవుతున్నారు.

సెన్సస్​ డ్యూటీ లెటర్​ కావాలా.. కొంత ఇచ్చుకో

 బదిలీల ప్రక్రియలో సరికొత్త ‘సెన్సస్’ దందా వెలుగుచూస్తోంది. ఎలాగైనా బదిలీల గండం నుంచి గట్టెక్కేందుకు కొందరు ఉద్యోగులు అడ్డదారులు తొక్కుతున్నారు. జనాభా లెక్కల సేకరణ (సెన్సస్‌‌‌‌‌‌‌‌) విధుల్లో ఉన్న సిబ్బందిని బదిలీ చేయవద్దంటూ ఆర్థిక శాఖ ఇచ్చిన నిబంధనను ఆసరా చేసుకుని.. విచ్చలవిడిగా నకిలీ సెన్సస్ డ్యూటీ ఉత్తర్వులను సృష్టిస్తున్నారు. ఇందులో కూడా రూ.50 వేల నుంచి రూ.లక్ష దాకా ముట్టజెప్పుకుంటున్నట్లు తెలిసింది.

వాస్తవానికి జనగణనకు అనుమతిస్తూ ఈ ఏడాది జనవరి 22నే ప్రభుత్వం గెజిట్‌‌‌‌‌‌‌‌ నోటిఫికేషన్‌‌‌‌‌‌‌‌ జారీ చేసింది. ఆ తర్వాత ఉద్యోగులను కేటాయించి, మార్చి, ఏప్రిల్‌‌‌‌‌‌‌‌ నెలల్లో కేంద్ర ప్రభుత్వ జనాభా లెక్కల సేకరణ విభాగం ఆధ్వర్యంలో దశలవారీగా శిక్షణ కూడా పూర్తి చేశారు. ఇదంతా సజావుగా సాగిపోయిన తర్వాత, గత నెల 21న ఆర్థిక శాఖ సాధారణ బదిలీలకు అనుమతిస్తూ జీవో జారీ చేసింది. అప్పటికే ఏప్రిల్ 26 నుంచి రాష్ట్రంలో ప్రజల స్వీయ నమోదు జనగణన కూడా ప్రారంభమైంది.

అయితే, బదిలీల ఉత్తర్వులు వెలువడగానే కొందరు ఉద్యోగుల్లో వణుకు మొదలైంది. లూప్‌‌‌‌‌‌‌‌హోల్స్‌‌‌‌‌‌‌‌ వెతికే పనిలో పడ్డ సదరు ఉద్యోగులు.. కలెక్టరేట్లు, మున్సిపల్ కార్యాలయాల్లోని తమకు అనుకూలమైన విభాగాల ద్వారా ‘బ్యాక్ డేట్’తో సెన్సస్ డ్యూటీ ఆర్డర్లు తెచ్చుకుంటున్నారు.  నిబంధనల ప్రకారం.. హెచ్‌‌‌‌‌‌‌‌ఓడీగా ఉంటూ రోజువారీ పరిపాలన బాధ్యతలు చూసే కాలేజీ ప్రిన్సిపాల్స్‌‌‌‌‌‌‌‌, ఎంపీడీఓ లాంటి ఉన్నత స్థాయి ఉద్యోగులకు సెన్సస్‌‌‌‌‌‌‌‌ డ్యూటీలు వేయకూడదు.

కానీ, విచిత్రంగా ఇప్పుడు అలాంటి హోదాల్లో ఉన్నవారు సైతం తాము జనగణన విధుల్లో ఉన్నామంటూ ఇప్పటికప్పుడు ఉత్తర్వులు పుట్టించి అధికారుల ముందు పెడుతుండటం గమనార్హం. సాధారణంగా ఒక ఉద్యోగికి సెన్సస్‌‌‌‌‌‌‌‌ డ్యూటీ వేస్తే, ఆ సమాచారాన్ని ఉన్నతాధికారికి పంపి, సదరు ఉద్యోగిని రిలీవ్‌‌‌‌‌‌‌‌ చేయాలని కలెక్టరేట్‌‌‌‌‌‌‌‌ లేదా మున్సిపల్‌‌‌‌‌‌‌‌ కమిషనర్‌‌‌‌‌‌‌‌ కోరాల్సి ఉంటుంది. కానీ ఇక్కడ సీన్ రివర్స్ అయింది. ఉద్యోగులే నేరుగా తమకు సెన్సస్‌‌‌‌‌‌‌‌ డ్యూటీ ఆర్డర్ వచ్చిందంటూ, తమ పైఅధికారులకు లేఖలు ఇస్తూ.. బదిలీల జాబితా నుంచి తమ పేరును తొలగించాలని డిమాండ్ చేస్తున్నారు. 

 అనర్హులకు ఫోకల్​ పోస్టులు

ఈ సిఫార్సు భాగోతం ఏ స్థాయికి వెళ్లిందంటే.. తెల్లవారుజాము నుంచే ఉద్యోగ సంఘాల నేతల ఇండ్ల వద్ద క్యూ కడుతున్నారు. లేఖల కోసం లీడర్ల ఇండ్ల ముందు పైరవీకారుల సందడి కనిపిస్తోంది. టోకెన్ల పద్ధతిలో లోపలికి పిలిపించుకుని మరీ డీలింగ్స్ మాట్లాడుకుంటున్నారనే గుసగుసలు వినిపిస్తున్నాయి. నిజాయితీగా పని చేస్తూ, జెన్యూన్ కారణాలతో బదిలీ కోరుకునే సాధారణ ఉద్యోగులు మాత్రం డబ్బులు ఇచ్చుకోలేక, లీడర్ల చుట్టూ తిరగలేక తీవ్ర అన్యాయానికి గురవుతున్నామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

మరోవైపు ఈ సిఫార్సు లేఖల దందాపై ఉన్నతాధికారులకు, ప్రభుత్వ పెద్దలకు కూడా ఫిర్యాదులు అందినట్లు సమాచారం. ప్రధానంగా  జెన్యూన్ మెడికల్ గ్రౌండ్స్ ఉన్నవారు, భార్యాభర్తల (స్పౌజ్) కేటగిరీ కింద బదిలీ కోరుకునే వారు కూడా ఈ లెటర్ ప్యాడ్ల దందాను చూసి ఆందోళన చెందుతున్నారు.