జూన్ రెండో వారంలో టీచర్ల బదిలీలు, ప్రమోషన్లు

జూన్ రెండో వారంలో టీచర్ల బదిలీలు, ప్రమోషన్లు
  • ఎన్నికల కోడ్ పూర్తికాగానే ప్రారంభం
  • పండిట్, పీఈటీలకూ ప్రమోషన్లు ఇచ్చేలా చర్యలు 
  • 60 వేల మంది టీచర్లు ట్రాన్స్​ఫర్​ అయ్యే చాన్స్ 

హైదరాబాద్, వెలుగు: వివిధ కారణాలతో ఆగిపోయిన టీచర్ల బదిలీలు, ప్రమోషన్ల ప్రక్రియను జూన్ రెండో వారంలో నిర్వహించాలని సర్కారు భావిస్తున్నది. దీనికి సంబంధించిన ఏర్పాట్లను ప్రారంభించింది. ఈ క్రమంలోనే పెండింగ్​లో ఉన్న పండిట్, పీఈటీలకూ బదిలీలు, ప్రమోషన్లు ఇవ్వాలని యోచిస్తోంది. లోక్ సభ, ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్  పూర్తవగానే.. టీచర్ల బదిలీలు, ప్రమోషన్ల ప్రక్రియను ప్రారంభించనున్నది. 

రాష్ట్రంలో నిరుడు టీచర్ల బదిలీలు, ప్రమోషన్ల ప్రక్రి య ప్రారంభమైంది. అయితే  టీచర్ల ప్రమోషన్లకు టెట్ ఉండాలని ఎన్​సీటీఈ నిబంధనను అమలు చేయాలని కోరుతూ కొందరు టీచర్లు హైకోర్టును ఆశ్రయించారు. కోర్టు వారికి అనుకూలంగా మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వడంతో, అప్పట్లో బదిలీలు, ప్రమోషన్ల ప్రక్రియ ఆగిపోయింది. తాజాగా టీచర్లకు టెట్  అర్హతతో సంబంధం లేకుండానే ప్రమోషన్లు ఇవ్వాలని హైకోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. దీనికితోడు పండిట్, పీఈటీల అప్​గ్రెడేషన్  ప్రక్రియనూ పూర్తి చేసేందుకు అధికారులు కసరత్తు చేస్తున్నారు. 

టీచర్ల ప్రమోషన్ల ప్రక్రియకు సానుకూలంగా హైకోర్టు తీర్పు ఇచ్చిన నేపథ్యంలో అనుమతి కోసం ఎన్నికల కమిషన్​కు విద్యా శాఖ అధికారులు లేఖ రాశారు. దీనిపై ఇంకా క్లారిటీ లేదు. అయితే జూన్ 4, 5వ తేదీల్లో ఎన్నికల కౌంటింగ్  నేపథ్యంలో  టీచర్లంతా ఆ విధుల్లో ఉంటారు. దీంతో కౌంటింగ్  ప్రక్రియ పూర్తయిన తర్వాతే బదిలీలు, ప్రమోషన్లు చేపట్టాలని ప్రభుత్వం నిర్ణయించింది. 

19 వేల మందికి ప్రమోషన్లు! 

నిరుడు 1250 మంది హెడ్మాస్టర్  ప్రమోషన్లు నిర్వహించారు. అన్నీ కలిపితే సుమారు 19 వేల మంది వరకు ప్రమోషన్లు పొందే అవకాశం ఉందని అధికారులు చెప్తున్నారు. దీంట్లో పండిట్, పీఈటీలు సుమారు 10,440 మంది, పీజీహెచ్ఎంలు 800, పీఎస్ హెచ్ఎంలు 2,200, స్కూల్ అసిస్టెంట్లు 5,800 ఉన్నారని తెలిపారు. అంతా సక్రమంగా జరిగితే కేవలం 20 రోజుల్లోనే ప్రక్రియ పూర్తిచేసేందుకు స్కూల్ ఎడ్యుకేషన్ అధికారులు షెడ్యూల్  రూపొందిస్తున్నారు. 

బదిలీల కోసం 60 వేల మంది 

రెండేండ్ల సర్వీస్  పూర్తి చేసుకున్న వారందరికీ అప్పట్లో అవకాశం ఇచ్చారు. దీంతో రెండేండ్ల సర్వీస్​ పూర్తయిన టీచర్లంతా బదిలీల కోసం దరఖాస్తు చేసుకున్నారు. ఇప్పటికే 12,500 మంది హెడ్మాస్టర్లు, టీచర్లకు బదిలీలు పూర్తయ్యాయి. ఇంకా 60 వేల మంది ట్రాన్స్ ఫర్  చేసుకునేందుకు రెడీగా ఉన్నారు. వారిలో సుమారు 40 మంది బదిలీ అయ్యే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు.