తల్లి కడుపు కోతకు ఏడాది..ఇంకా అందని ప్రభుత్వ సాయం

తల్లి కడుపు కోతకు ఏడాది..ఇంకా అందని ప్రభుత్వ సాయం
  • ఆ త‌ల్లి గ‌ర్భశోకానికి ఏడాది. .ప్రభుత్వ సాయం కోసం ఎదురుచూపులు 

మేడ్చల్ జిల్లా: విద్యుత్ శాఖ అధికారుల నిర్ల‌క్ష్యానికి గురై బాలుడు మృతి చెందిన ఘ‌ట‌న‌కు ఏడాది పూర్తైంది. ప్రమాదం జరిగిన స‌మ‌యంలో ప్ర‌భుత్వం ఇస్తామ‌న్న ఎక్స్‌గ్రేషియా ఇంత‌వ‌ర‌కు జాడ‌లేదు. బాధిత కుటుంబం కాళ్ల‌కు చెప్పులు అరిగేలా అధికారుల చుట్టూ తిరుగుతున్నా ప‌ట్టించుకున్న పాపాన‌పోలేదు. ఓవైపు కుటుంబం పెద్ద దిక్కు భ‌ర్త‌.. మ‌రోవైపు క‌న్న‌కొడుకు మృతితో ఆ త‌ల్లి మ‌తిస్థిమితం కోల్పోయింది. దీంతో ఆ కుటుంబం తీవ్ర ఆర్ధిక క‌ష్టాల్లో మునిగిపోయింది. ప్ర‌భుత్వ ఎక్స్‌గేషియా కోసం కోటి క‌ళ్ల‌తో ఎదురుచూస్తోంది. వివరాలిలా ఉన్నాయి.
మేడ్చ‌ల్ జిల్లా జ‌వ‌హ‌ర్‌న‌గ‌ర్ మున్సిప‌ల్ కార్పొరేష‌న్ ప‌రిధిలో గత ఏడాది నవంబర్ 7వ తేదీన 8 సంవత్సరాల వయసున్న నిఖిల్ అనే బాలుడు ఆడుకుంటూ వెళ్లి పొరపాటున ట్రాన్స్‌ఫార్మ‌ర్‌ను త‌గిలాడు. తీవ్ర‌గాయాల‌తో అప‌స్మార‌క స్థితిలో వెళ్లగా హుటాహుటిన ఆస్పత్రికి తరలించారు. నిఖిల్ 9 రోజుల పాటు ఆస్పత్రిలో మృత్యువుతో పోరాడి తుదిశ్వాస విడిచాడు. ప్రతిరోజు క‌ళ్ల‌ముందు స‌ర‌దాగా ఆడుకున్న ఆ బాలుడు మృతిచెంద‌డంతో త‌ల్లి మ‌రియ షాక్‌కు గురైంది. ఆ త‌ర్వాత అనారోగ్యానికి గురై మ‌తిస్థిమితం కోల్పోయింది. దీంతో బాలుడు  నిఖిల్ మృతికి కార‌ణ‌మైన విద్యుత్ శాఖ అధికారుల‌పై బాధిత కుటుంబం, స్థానికులు అగ్గిమీద గుగ్గిలం అయ్యారు. విద్యుత్ శాఖ నిర్ల‌క్ష్యంపై ఆందోళ‌న చేప‌ట్టేందుకు సిద్ధ‌మ‌య్యారు. అనేక‌సార్లు ప్రమాదకరంగా ఉన్న టాన్స్‌ఫార్మ‌ర్‌పై స్థానికులు ఫిర్యాదు చేసినా ప‌ట్టించుకోలేదని, ఆ నిర్లక్ష్యానికి బాలుడి ప్రాణం మూల్యం చెల్లించుకోవాల్సి రావడం ఆగ్రహానికి గురిచేసింది. ప్రతిరోజు సరదాగా నవ్విస్తూ తిరిగి 8ఏళ్ల  కన్నకొడుకు మృతి చెందాడన్న బాధతో తల్లి మతి స్థిమితం కోల్పోవడంతో స్థానికుల ఆగ్రహం కట్టలు తెంచుకుంది. చిన్నారి నిఖిల్ మృతికి కార‌ణ‌మైన అధికారుల‌పై చ‌ర్య‌లు తీసుకోవాల‌ని... బాధిత కుటుంబానికి న్యాయం చేయాల‌ని డిమాండ్ చేస్తూ ఆందోళన చేపట్టారు. విషయం తెలుసుకున్న మేయర్ కావ్య బాధిత కుటుంబాన్ని ప‌రామ‌ర్శించేందుకు వెళ్లిన జ‌వ‌హ‌ర్‌న‌గ‌ర్ కు వచ్చి బాధిత కుటుంబాన్ని అన్ని ర‌కాలుగా ఆదుకుంటామ‌ని హామీ ఇచ్చారు. 15 రోజుల్లో 10 ల‌క్ష‌లు ఇస్తామ‌ని చెప్పారు. అంతేకాదు ఇద్ద‌రు పిల్ల‌లకు ప్ర‌భుత్వం త‌రుపున చ‌దివించేలా చూస్తామ‌ని భ‌రోసా క‌ల్పించారు. కుటుంబంలో ఒక‌రికి ఉద్యోగం కూడా క‌ల్పిస్తామని మేయ‌ర్ కావ్య‌ హామీ ఇవ్వడంతో ఆందోళ‌న‌ను విర‌మించిన స్థానికులు చనిపోయిన బాలుడు నిఖిల్ అంత్య‌క్రియ‌లు జ‌రిపించారు. 
మేయర్ హామీలతో బాధిత కుటుంబానికి నిరాశ
మేయ‌ర్ కావ్య ఇచ్చిన హామీలపై ఎన్నో ఆశ‌లు పెట్టుకున్న బాధిత కుటుంబానికి నిరాశే మిగిలింది. ఘటన జరిగి ఏడాది పూర్తయినా ఇప్ప‌టివ‌ర‌కు ఇస్తాన‌న్న ఎక్స్‌గ్రేషియా అందించలేదు. బాలుడి త‌ల్లి ఆరోగ్యం మ‌రింత దిగ‌జారుతుండడంతో ఆర్థిక క‌ష్టాల్లో కూరుకుపోయింది మ‌రియ కుటుంబం. ఎన్నోసార్లు అధికారులు చుట్టూ తిరిగినా ఏ ఒక్క అధికారి కూడా ప‌ట్టించుకున్న పాపాన‌పోలేద‌ని స్థానికులు ఆవేద‌న వ్య‌క్తం చేస్తున్నారు. ఇప్ప‌టికైనా ప్ర‌భుత్వం త‌రుపున జ‌వ‌హ‌ర్‌న‌గ‌ర్ మేయ‌ర్ కావ్య ఇచ్చిన హామీలు నెరవేర్చాలని.. ప్రభుత్వంతో ఇప్పిస్తాన‌న్న ఎక్స్‌గ్రేషియాను బాధిత కుటుంబానికి అందించాల‌ని బంధువులు, స్థానికులు కోరుతున్నారు.