ఉప్పల్.. పోటా పోటీ! .. ట్రయాంగిల్ ఫైట్

ఉప్పల్.. పోటా పోటీ! .. ట్రయాంగిల్ ఫైట్

ఒక‌ప్పుడు శివారు ప్రాంతమైన ఉప్పల్.. నేడు సిటీకి ప్రధాన ద్వారంగా ఉంది.  ఈ సెగ్మెంట్ వరంగల్ హైవేను ఆనుకొని ఉండగా.. రియల్ ఎస్టేట్, ఐటీకి కేరాఫ్ అడ్రస్‌గా నిలిచింది. జాతీయ, అంతర్జాతీయ సంస్థలు ఉండడంతో వాటి చుట్టూ సిటీ విస్తరించింది. ఉప్పల్‌ సెగ్మెంట్​లో  10 జీహెచ్ఎంసీ డివిజన్లు ఉండగా..  గ్రేటర్‌లో మొదటి డివిజన్ కాప్రా. ఆ తర్వాత ఏఎస్‌రావు నగర్, చర్లపల్లి, మీర్‌పేట్‌ హెచ్​బీ కాలనీ, మల్లాపూర్, నాచారం, చిలుకా నగర్, హబ్సిగూడ, రామంతాపూర్, ఉప్పల్ ఉన్నాయి. 2020లో  గ్రేటర్ ఎన్నికల్లో 10 డివిజన్లలో ఆరింటిని బీఆర్ఎస్​ గెలుచుకుంది. రెండు డివిజన్లలో కాంగ్రెస్, మరో రెండు డివిజన్లలో బీజేపీ గెలుపొందింది. ​

అసెంబ్లీ టికెట్లు ఆశించిన కొందరు కార్పొరేటర్లు పార్టీ మారారు. ప్రధానంగా సెగ్మెంట్​లో త్రిముఖ పోటీ నెలకొంది. బీఆర్ఎస్, బీజేపీ అభ్యర్థులకు ఇంతకుముందే పోటీ చేసిన అనుభవం ఉంది. కాంగ్రెస్ అభ్యర్థి ఈసారి కొత్తగా బరిలోకి దిగారు. 2018లో బీఆర్ఎస్ ఎమ్మెల్యేగా భేతి సుభాశ్​రెడ్డి గెలిచారు. ఐదేళ్ల కాలంలో పెద్దగా ఆయన చేసిందేమీ లేదు. దీంతో ఆ పార్టీపై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత పెరిగింది. ఈసారి పార్టీ అధిష్టానం అభ్యర్థిని మార్చింది. 

బండారి లక్ష్మారెడ్డికి టికెట్ ఇచ్చి పోటీలో నిలిపింది. కాంగ్రెస్ నుంచి పరమేశ్వర్ రెడ్డికి టికెట్ దక్కింది. బీజేపీ నుంచి మాజీ ఎమ్మెల్యే ఎన్వీఎస్ఎస్ ప్రభాకర్ మరోసారి బరిలోకి దిగారు. దీంతో ఈసారి ఉప్పల్ నుంచి మూడు పార్టీల మధ్య పోటా పోటీ ఉండనుంది. కింది స్థాయి లీడర్లతో పాటు పెద్ద లీడర్లు కూడా రోజుకో పార్టీ మారుతుండగా..  చివరకు గెలుపెవరిది అనే క్లారిటీ లేదు. 

సెటిలర్లు, రెడ్డి సామాజికవర్గ ఓట్లే కీలకం 

సెగ్మెంట్​లో  ఆంధ్ర సెటిలర్లు 40 వేలు, రెడ్డి సామాజిక వర్గానికి చెందిన ఓట్లు మరో 40వేలు ఉంటాయి. గత ఎన్నికల్లో సెటిలర్ల ఓట్లు, రెడ్డి సామాజికవర్గానికి చెందిన ఓట్లు బీఆర్ఎస్ అభ్యర్థి గెలుపులో కీలకంగా మారాయి. ఈసారి మాత్రం పరిస్థితులు అందుకు భిన్నంగా ఉన్నాయని రాజకీయ 
విశ్లేషకులు పేర్కొంటున్నారు. గత ఎన్నికల్లో మహాకూటమి నుంచి టీడీపీ అభ్యర్థి పోటీ చేయగా.. సీమాంధ్ర సెటిలర్ల ఓట్లు బీఆర్ఎస్, టీడీపీ వైపు చీలాయి. దీంతో బీఆర్ఎస్  గెలుపొందింది. ఈసారి సీమాంధ్ర సెటిలర్ల ఓట్లు కాంగ్రెస్​కు కలిసివచ్చే చాన్స్ ఉంది. ఆంధ్ర సెటిలర్లు, రెడ్డి సామాజికవర్గానికి చెందిన ఓటర్లను తమ వైపు లాక్కునేందుకు  బీఆర్ఎస్, కాంగ్రెస్ పోటాపోటీగా ప్రయత్నాలు చేస్తున్నాయి. 

కార్పొరేటర్ ఎవరో తెలియని పరిస్థితి..

ఉప్పల్ సెగ్మెంట్​లో సమస్యలు భారీగానే ఉన్నాయి. డ్రైనేజీ వ్యవ‌స్థ స‌క్రమంగా లేదు. తాగునీరు, అధ్వానంగా రోడ్లు, పారిశుద్ధ్య లోపం ఇక్కడ ప్రధాన సమస్యలుగా కనిపిస్తున్నాయి. నాణ్యతలేని పైపులైన్లు, తీవ్రమైన ట్రాఫిక్‌, శిథిలమైన భ‌వ‌నాలు, ఉప్పల్ భ‌గాయ‌త్ ప్లాట్ల పంపిణీతో పాటు మ‌రికొన్ని ప్రాబ్లమ్స్ నెలకొన్నాయి.  డివిజన్లలో  కార్పొరేటర్ ఎవ‌రో కూడా స్థానికులకు తెలియ‌దంటే ప‌రిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. మహిళా కార్పొరేటర్ల స్థానంలో భర్తల పెత్తనమే ఎక్కువగా నడుస్తోంది.  అభివృద్ధి పనులపై సమీక్షా సమావేశాలు నిర్వహించినా చర్చించి వదిలేయడమే తప్ప పరిష్కరించడం లేదని స్థానికులు విమర్శిస్తున్నారు. 

ఈ సెగ్మెంట్ మీదుగా రింగ్​ రోడ్​ , వరంగల్‌ హైవే వెళ్తుండడంతో ట్రాఫిక్‌ జామ్‌ ఎక్కువగా ఉంటుంది.  ఉప్పల్ నుంచి నారపల్లి రోడ్డు పూర్తిగా డ్యామేజ్​గా ఉంది. నేషనల్ హైవేపై ఫ్లైఓవర్ నిర్మిస్తున్నప్పటికీ స్లోగా పనులు సాగుతున్నాయి. దీంతో వాహనదారులు ఇబ్బంది పడుతున్నారు. సెగ్మెంట్​లో చాలామందికి సంక్షేమ పథకాలు అందకపోవడంతో  బీఆర్ఎస్ పై తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. 

దళిత బంధు కేవలం తన అనుచరులకు మాత్రమే ఇచ్చాడని ఎమ్మెల్యే సుభాష్​ రెడ్డిపై ఆరోపణలు వెల్లువెత్తాయి. నిరుద్యోగులు కూడా ఎక్కువగా ఉండటం.. అధికారపార్టీకి వ్యతిరేకంగా మారగా.. దాన్ని తమకు అనుకూలంగా మలుచుకునేందుకు కాంగ్రెస్, బీజేపీ ముమ్మర ప్రయత్నాలు చేస్తున్నాయి.   

సెగ్మెంట్​లో అధికార పార్టీ అభ్యర్థిని మార్చింది. ప్రస్తుత ఎమ్మెల్యే భేతి సుభాశ్​రెడ్డికి ఇవ్వలేదు. 2014లో కాంగ్రెస్ నుంచి పోటీ చేసి ఓడిపోయిన బండారి లక్ష్మారెడ్డికి టికెట్ ఇచ్చింది. ఇది ఎంత వరకు కలిసొస్తుందోనని సొంత పార్టీ నేతలే చర్చించుకుంటున్నారు. అధికార పార్టీ నుంచి ముగ్గురు టికెట్ ఆశించారు.  వారు క్యాండిడేట్​కు మద్దతు తెలుపుతున్నట్లు కనిపించడం లేదు.  

ఇది అధికార పార్టీకి పెద్ద తలనొప్పిగా మారింది. మాజీ ఎమ్మెల్యే ఎన్వీఎస్​ఎస్​ ప్రభాకర్ మూడోసారి బరిలోకి దిగారు. గతంలో ఎమ్మెల్యేగా పనిచేసిన అనుభవం ఉండటంతో పాటు 2018లో ఓడిపోయిన సెంటిమెంట్ కలిసొస్తుందని ఆ పార్టీ నేతలు అంటున్నారు. కాంగ్రెస్ అభ్యర్థి పరమేశ్వర్ రెడ్డి తొలిసారిగా పోటీ చేస్తున్నారు. ఉప్పల్ డివిజన్​కు ప్రస్తుతం ఆయన భార్య రజిత కార్పొరేటర్​గా ఉన్నారు. మొత్తంగా గెలుపుపై అభ్యర్థులు ఎవరి ధీమాలో వారు ఉన్నారు.