మాల్స్, సూపర్ మార్కెట్లలో ట్రైబల్ ఉత్పత్తులు

మాల్స్, సూపర్ మార్కెట్లలో ట్రైబల్ ఉత్పత్తులు
  •     గిరిజన కార్పొరేషన్​ను బలోపేతం చేయాలని నిర్ణయం
  •     పబ్లిక్ ప్లేస్ లలోనూ ఔట్ లెట్లు
  •     డిమాండ్ ఉన్నా సమాచారం తెలియట్లేదంటున్న ప్రజలు    

గిరిజన కోఆపరేటివ్ కార్పొరేషన్ (జీసీసీ) ని బలోపేతం చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. గిరిజనులు తయారు చేస్తున్న వస్తువులను అన్ని షాపింగ్ మాల్స్, సూపర్ మార్కెట్లు, టౌన్లు, జిల్లాల్లో దొరికేలా ఆఫీసర్లు కసరత్తు చేస్తున్నారు. ప్రజలకు అందుబాటులోకి తెచ్చేందుకు డీ మార్ట్, మోర్, రిలయన్స్, రత్నదీప్, విజేత వంటి రిటైల్ ఔట్​లెట్లతో పాటు అన్ని సూపర్ మార్కెట్ల మేనేజ్​మెంట్లతో మాట్లాడాలని నిర్ణయించారు. జీసీసీ ఆధ్వర్యంలో తేనె, షాంపూలు, సబ్బులు విక్రయిస్తున్నారు. కెమికల్స్ వాడకుండా అడవుల్లో నుంచి గిరిజనులు ముడిసరుకు తీసుకొచ్చి తయారు చేస్తుండడంతో పబ్లిక్ ఎక్కువగా కొంటున్నారు.

హైదరాబాద్, వెలుగు: గిరిజన కోఆపరేటివ్ కార్పొరేషన్  (జీసీసీ) ని బలోపేతం చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇందులో భాగంగా గిరిజనులు తయారు చేస్తున్న వస్తువులను అన్ని షాపింగ్  మాల్స్, సూపర్ మార్కెట్లలో దొరికేలా ట్రైబల్  శాఖ అధికారులు కసరత్తు చేస్తున్నారు. ప్రస్తుతం కొన్ని చోట్ల మాత్రమే స్టాల్స్, షాప్స్  ఉండగా వాటిని సిటీలు, జిల్లాల్లో దొరికేలా ఏర్పాట్లు చేస్తున్నారు.

డీ మార్ట్, మోర్, రిలయన్స్, రత్నదీప్, విజేత వంటి రిటైల్  ఔట్​లెట్లతో పాటు అన్ని సూపర్ మార్కెట్లలో ఆ ఉత్పత్తులు దొరికేలా ఆయా యాజమాన్యాల ప్రతినిధులతో మాట్లాడాలని నిర్ణయించారు. ఆయా మాల్స్​కు పర్మిషన్లు ఇచ్చే  మున్సిపల్  కార్పొరేషన్లు,  అధికారుల సహాయం తీసుకోవాలని నిర్ణయించారు. ప్రస్తుతం జీసీసీ ఆధ్వర్యంలో తేనె, షాంపూలు, సబ్బులు ప్రధానంగా అమ్ముతున్నారు. వాటిలో గిరి గోల్డ్ పేరుతో అలోవెరా, ఆరెంజ్, బొప్పాయి, పసుపు  ఫ్లేవర్​లో 4  రకాల్లో సబ్బులు ఉండగా కుంకుడుకాయలు, అలోవెరా షాంపూలు, టీఎస్ గిరిజన హనీ పేరుతో తేనె విక్రయిస్తున్నారు.

వాటిలో తేనె, షాంపూలకు ఫుల్  డిమాండ్ ఉందని అధికారులు చెబుతున్నారు. కెమికల్స్  వాడకుండా అడవుల్లో నుంచి గిరిజనులు ముడిసరుకు తీసుకొచ్చి తయారు చేస్తుండడంతో  ఎక్కువగా కొంటున్నారు. ఎంఎన్​సీ కంపెనీల ప్రోడక్టులతో పోలిస్తే వాటి ధరలు కొద్దిగా ఎక్కువగా ఉన్నా క్వాలిటీ బాగుండడంతో పబ్లిక్  తీసుకుంటున్నారని  అధికారులు చెబుతున్నారు. ఈ ఉత్పత్తులు హైదరాబాద్​తో పాటు జిల్లా కేంద్రాల్లో చాలా తక్కువ చోట్ల దొరుకుతున్నాయి. జీసీసీ తయారు చేస్తున్న సబ్బులను వెల్ఫేర్  హాస్టళ్ల స్టూడెంట్స్ కు ప్రభుత్వం సరఫరా చేస్తోంది. వాటికి సంబంధించిన బిల్స్​ను ప్రభుత్వం విడుదల చేయకపోవడంతో ఇబ్బందులు కలుగుతున్నాయని అధికారులు చెబుతున్నారు. 

ఎక్కడ దొరుకుతున్నయి

జీసీసీ ప్రాడక్ట్స్ ఎక్కడ దొరుకతాయని చాలా మంది ఫోన్లలో అడుగుతున్నారని ట్రైబల్  వెల్ఫేర్  అధికారులు చెబుతున్నారు. ఫలానా చోట దొరుకుతాయని చెప్పినా అంత దూరం వెళ్లి కొనలేమని చెబుతున్నారని ఓ అధికారి  తెలిపారు. డిమాండ్  ఉన్నా పబ్లిక్ కు అందుబాటులోకి లేకపోవడంతో కోట్ల టర్నోవర్​ను కోల్పోతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. జీసీసీ వెబ్ సైట్​లో ఆన్​లైన్  పేమెంట్ చేసి కొనుగోలు చేయడానికి బై ఆప్షన్ క్లిక్ చేస్తే నాట్ ఫౌండ్ అని వస్తోందని పలువురు కస్టమర్లు అధికారుల దృష్టికి తీసుకెళుతున్నారు. హైదరాబాద్​లో సెక్రటేరియెట్  దగ్గర, మాసాబ్ ట్యాంక్​లోని సంక్షేమ భవన్ తో పాటు మరికొన్ని ప్రభుత్వ ఆఫీసుల దగ్గర స్టాల్స్ ఏర్పాటు చేసి విక్రయిస్తున్నారు. 

మానిటరింగ్ లేదు

జీసీసీ స్టాల్స్​కు ఆదరణ ఉన్నా గత తొమ్మిదేండ్లుగా సరైన మానిటరింగ్  లేదని అధికారులు చెబుతున్నారు. గత పాలకులు పట్టించుకోలేదని, స్టాల్స్  ఏర్పాటుకు నిర్ణయాలు తీసుకోలేదని తెలిపారు. స్టాక్  అయిపోయిన తర్వాత అధికారుల దృష్టికి తీసుకెళ్లినా, ఆర్డర్స్  పెట్టినా పట్టించుకోలేదన్న ఆరోపణలు ఉన్నాయి. జీసీసీలో పనిచేస్తున్న అధికారులు, ఉద్యోగులపై గత ప్రభుత్వ హయాంలో అవినీతి ఆరోపణలు వచ్చాయి. వారిపై చర్యలు తీసుకొని కొద్ది కాలం విధుల నుంచి పక్కన పెట్టినా ఇప్పుడు మళ్లీ డ్యూటీలో చేరారని అధికార వర్గాల్లో చర్చ జరుగుతోంది. కొత్త ప్రభుత్వం అవినీతి అధికారులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్లు వినిపిస్తున్నాయి.