మన్యంలో.. మామిడి పండగ

V6 Velugu Posted on May 03, 2021

గిరిజనులు అడవి తల్లిని దేవతలా పూజిస్తరు. అడవిలోని చెట్లు ఇచ్చే పండ్లను ప్రసాదంగా తింటరు. ప్రకృతి ఒడిలో హాయిగా సేదతీరే గిరిజనులు ప్రకృతినే ఆరాధిస్తరు. అందుకే,  ఏ సీజన్‌‌కు తగ్గట్లు ఆ సీజన్‌‌లో పండుగలు చేసుకుని ప్రకృతికి దండం పెట్టుకుంటరు.  అట్లనే మామిడికాయలు కాసే ఈ సీజన్‌‌లో మామిడికాయ పండుగ (మ్యాంగో ఫెస్ట్‌‌)ను సంబురంగా చేసుకుంటరు కొండమీది గిరిజనులు. మామిడిపంట చేతికి రాంగనే పండ్లను దేవతకు పెట్టి, ఆ  తర్వాతే వాళ్లు తింటరు. అప్పటి వరకు మామిడికాయలు ముట్టరు వాళ్లు.     

ఎండాకాలంల మామిడికాయలు మస్తు కాస్తయ్‌‌. చెట్టుకు కాయ చూడంగనే టక్కున కోసి తింటం. కానీ, తూర్పు భద్రాచలం ఏజెన్సీలోని గిరిజనులు మాత్రం అట్లకాదు. మామిడికాయల పండుగ చేసినంకనే వాటిని తింటరు. దానికోసం ఏటా జాతర జరుపుతరు గిరిజనులు. పూజలు చేసి ఆడి, పాడి సంబురాలు చేసుకుంటరు. మామిడికాయలు వచ్చే సీజన్‌‌లో గ్రామంలోని పూజారి, పెద్దలు అందరూ కలిసి ఒక రోజును ఖాయం చేస్తరు. ఆ రోజున పండుగ జరుపుకుంటరు. పండుగ జరపాలనుకున్న రోజు నుంచి ఊళ్లోని ఆడవాళ్లు బయటికి రాకుండ ఇంట్లనే ఉంటరట.
ఇదీ పద్ధతి
గిరిజనులు గ్రామదేవతగా కొలిచే గంగానమ్మను కొడిశ, మామిడి, వేగిస, బూరుగు ఇలా ఏదో ఒక చెట్టుకింద నిలుపుతరు. పండుగ ముందురోజు ఊళ్లోని పూజారి తన ఇంట్లో ఒక మూలన తునికి ఆకుల్లో పసుపు వేసి పూజ చేస్తడు. పొద్దున కొబ్బరికాయలు, పసుపు, కుంకుమ, సాంబ్రాణి (గుగ్గిలం), మసిబొగ్గులు, సామ నూకలు, జొన్న నూకలు, కోళ్లు, పందులను తీసుకుని ఊళ్లోని మగవాళ్లంతా దేవత దగ్గరికి వెళ్తరు. దాంతోపాటు ఆ ఏడాది కాసిన మామిడికాయలను మూటగట్టి అమ్మ దగ్గర పెడతరు. వాటిని దేవతకు నైవేద్యంగా పెడతడు పూజారి. ఆ టైంలోనే పిల్లలు, పెద్దలు కలిసి డోలు, సన్నాయి, అందెలు వాయిస్తూ  డాన్సులు చేస్తరు. గంగానమ్మ దేవత ముందు పసుపు, నూకలపిండి, మసిబొగ్గు పిండితో రెండు రకాల ముగ్గులు వేస్తరు.  కోడిని బలిచ్చేందుకు చతురస్రాకారంలో గీతలతో మూలలు కలుపుతూ ఒక ముగ్గేస్తరు. పందిని బలిచ్చేందుకు చతురస్రాకారంలో నిలువు, అడ్డం 6 గీతలుగా మరొక ముగ్గు వేస్తరు. ఆ తర్వాత జొన్న నూకలతో అన్నం వండి సాంబ్రాణి ధూపంతో సారా, కల్లు, నీళ్లను దేవతకు నైవేద్యంగా పెడతరు. మామిడి కాయలు ముక్కలుగా కోసి వాటిని ముగ్గుల మధ్య పెట్టి మామిడి పంట బాగా రావాలని మొక్కుకుని వండిన జొన్న అన్నాన్ని పందులకు, కోళ్ల(బలిచ్చే) కు నైవేద్యంగా పెడతరు. ఆ ప్రసాదాన్ని అవి తింటేనే దేవత అనుగ్రహించిందనేది గిరిజనుల నమ్మకం. పొద్దున మొత్తం పూజలు చేసిన గిరిజనులు రాత్రి అయ్యేసరికి సంబురాలు షురూ చేస్తరు. పాటలు పాడుతూ.. దానికి తగ్గట్లుగా నృత్యం చేస్తరు.  అంతవరకు ఇళ్లలో ఉన్న ఆడవాళ్లు బయటికి వచ్చి ‘గిల్లకాయల బోధి’ అనే సాధనంతో శబ్దం చేస్తరు. ఆ శబ్దానికి తగ్గట్లు పురుషులు డోలు, సన్నాయి, అందెలు వాయిస్తరు. కోడి, పందిని ఊళ్లోని వాళ్లంతా సమానంగా పంచుకుని ప్రసాదంగా వండుకుని తింటరు. 
రెండోరోజు..
గ్రామానికి పట్టిన చీడ, పీడ, దుష్టశక్తులు పోతాయనే నమ్మకంతో మామిడికాయ పండుగ రెండోరోజున గిరిజనులు ఒక ఆట ఆడతరు. ఇద్దరు వ్యక్తులు వేటగాళ్లలాగా, మరో ఇద్దరు అడవిలోని మృగాల్లా వేషాలు వేసుకుంటరు. ఆ తర్వాత రెండు మంచాలను జత చేసి వాటిపై గుడ్డలు కప్పి  దానిమీద ఒక చెంబుపెట్టి మృగాల వేషాలు వేసుకున్నోళ్లు వాటి మధ్య తిరుగుతుంటే, వేటగాళ్లలా వేషాలు వేసుకున్నోళ్లు చెక్క తుపాకీలు, బాణాలతో ఆ ఇద్దర్ని చంపినట్లు  చేస్తారు. అంటే మృగాలను గ్రామం నుంచి తరిమేసినట్లు అర్థం. ఇలా చేశాక వేషగాళ్లు గ్రామంలోకి వచ్చి డబ్బులు వసూలు చేసి విందు చేసుకుంటరు. ఇది మామిడికాయలు సీజన్‌‌ కావడంతో  అశ్వారావుపేట, దమ్మపేట మండలాల్లోని కొండరెడ్ల గ్రామాల ఆదివాసీలు ఈ ఉత్సవాలను జరుపుకుంటున్నరు.
 

Tagged , tribals traditionals, tribals mango fest, mango fest in forest, tribals lifestyle

Latest Videos

Subscribe Now

More News