కొత్తగూడ, వెలుగు : అడవి దున్న దాడిలో ఓ మేకల కాపరి చనిపోయాడు. ఈ ఘటన మహబూబాబాద్ జిల్లా కొత్తగూడ మండలంలో జరిగింది. వివరాల్లోకి వెళ్తే... మండలంలోని కార్లాయి గ్రామానికి చెందిన కల్తి గోవింద్(40) మేకలు కాసుకుంటూ జీవిస్తున్నాడు. ఈ క్రమంలోనే ఈ నెల 18న మేకలను తోలుకొని అడవికి వెళ్లాడు. అప్పటి నుంచి ఇంటికి తిరిగి రాలేదు.
దీంతో కుటుంబ సభ్యులు, గ్రామస్తులు రెండు రోజుల పాటు అడవిలో గాలించగా సోమవారం గోవింద్ డెడ్‌బాడీ కనిపించింది. అతడి మృతదేహం పక్కనే అడవి దున్నకు చెందిన దూడ సైతం చనిపోయి కనిపించింది. గోవింద్ అడవిలోకి వెళ్లిన టైంలో దూడ చనిపోయి ఉండడాన్ని గమనించి, దాని వద్దకు వెళ్లిన సమయంలో తల్లి దున్న దాడి చేసి గోవింద్‌ను చంపి ఉంటుందని గ్రామస్తులు అనుమానిస్తున్నారు. పోలీసులకు సమాచారం ఇవ్వడంతో ఎస్సై రాజ్‌కుమార్ ఘటనాస్థలానికి చేరుకొని వివరాలు సేకరించారు. ఈ మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్సై తెలిపారు.
