వరంగల్ జిల్లా సంక్షిప్త వార్తలు

వరంగల్ జిల్లా సంక్షిప్త వార్తలు

నెట్ వర్క్, వెలుగు: మువ్వన్నెల జెండా మురిసింది. దేశానికి స్వాతంత్య్రం వచ్చి 75 ఏండ్లు పూర్తయిన సందర్భంగా ఉమ్మడి వరంగల్​జిల్లావ్యాప్తంగా త్రివర్ణ పతాకాలు రెపరెపలాడాయి. మంత్రులు, ఎమ్మెల్యేలు, కలెక్టర్లు, వివిధ శాఖల ఉన్నతాధికారులు జాతీయ జెండాలను ఎగురవేశారు. బెస్ట్ ఎంప్లాయీస్​గా సెలక్టయిన ఉద్యోగులు స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా అవార్డులు అందుకున్నారు. ఖిలా వరంగల్​లో ప్రభుత్వ సలహాదారు డా.జీఆర్​రెడ్డి జెండా ఎగిరేశారు. ఎంపీ పసునూరి దయాకర్, జిల్లా కలెక్టర్​ డా.బి.గోపీ, జడ్పీ చైర్  పర్సన్ గండ్ర  జ్యోతి, ఎమ్మెల్యే నరేందర్ పాల్గొన్నారు. 

హనుమకొండ పోలీస్​ హెడ్​క్వార్టర్స్​లో ప్రభుత్వ చీఫ్​విప్​దాస్యం వినయ్ ​భాస్కర్​జెండా ఎగురేశారు. అనంతరం పోలీసుల గౌరవ వందనం స్వీకరించారు. పరకాల ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి, కేయూ వీసీ తాటికొండ రమేశ్​ హైయ్యస్ట్​ బ్లడ్​ డోనర్స్​గా అవార్డు అందుకున్నారు. మేయర్​ సుధారాణి, కలెక్టర్​ రాజీవ్​గాంధీ హనుమంతు, సీపీ డా.తరుణ్​ జోషి, గ్రేటర్​ కమిషనర్​ ప్రావీణ్య పాల్గొన్నారు.  వరంగల్​ సిటీలోని బల్దియా హెడ్ ఆఫీస్​, విద్యాసంస్థలు, వరంగల్​ ఎంజీఎం హాస్పిటల్​, కాళోజీ హెల్త్ యూనివర్సిటీ, కేఎంసీ మెడికల్ కాలేజీల్లో వేడుకలు ఘనంగా జరిగాయి. 

జనగామ జిల్లా కేంద్రంలో జరిగిన వేడుకల్లో రాష్ట్ర పంచాయతీరాజ్​, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్​రావు జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ జిల్లా ప్రజలు, ప్రజా ప్రతినిధులు, అధికారులు, తెలంగాణ ఉద్యమకారులు, మేధావులకు, స్టూడెంట్స్​కు స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. మహబూబాబాద్ ​లోని ఎన్టీఆర్ ​స్టేడియంలో నిర్వహించిన వేడుకలకు మంత్రి సత్యవతి రాథోడ్​ చీఫ్​ గెస్ట్​గా హాజరయ్యారు. ఎంపీ మాలోతు కవిత, ఎమ్మెల్యే శంకర్ నాయక్, జడ్పీ చైర్ పర్సన్ బిందు పాల్గొన్నారు. 

ములుగు కలెక్టరేట్​లో నిర్వహించిన వేడుకల్లో ప్రభుత్వ విప్​ ఎంఎస్​ప్రభాకర్​రావు జాతీయ జెండా ఆవిష్కరించారు. కలెక్టర్​ఎస్​.కృష్ణ ఆదిత్య, ఎస్పీ సంగ్రాంసింగ్ జి పాటిల్​ పాల్గొన్నారు. ఎమ్మెల్యే క్యాంపు ఆఫీసులో ఎమ్మెల్యే సీతక్క జాతీయ జెండా ఎగురవేశారు. భూపాలపల్లి జిల్లా కేంద్రంలోని బీఆర్ అంబేడ్కర్ స్టేడియంలో రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు అనురాగ్ శర్మ జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. 

దాడి ఘటన బాధ్యులను వదలం

జనగామ, వెలుగు: బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్​చేపట్టిన ప్రజా సంగ్రామ యాత్రలో 500 మంది బౌన్సర్లు ఉన్నారని, గుండాలతో ఆయన సంగ్రామ యాత్ర చేస్తున్నాడని మంత్రి ఎర్రబెల్లి దయాకర్​రావు ఆరోపించారు. సోమవారం దేవరుప్పులలో దాడి ఘటనలో గాయపడిన పార్టీ కార్యకర్తలను జనగామ జిల్లా హాస్పిటల్​లో ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డి, జడ్పీ చైర్మన్​ సంపత్​రెడ్డిలతో కలిసి పరామర్శించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ టీఆర్ఎస్ కార్యకర్తలపై జరిగిన దాడిని ఖండిస్తున్నామన్నారు. సీఎం కేసీఆర్, ఆయన కుటుంబంపైన , తనపైనా ఇష్టానుసారంగా మాట్లాడటమే ఉద్రిక్తతకు దారితీసిందన్నారు. ఒకరిద్దరు అలా మాట్లాడవద్దని అనడంతో బీజేపీ గూండాలు టీఆర్ఎస్ కార్యకర్తలపై కర్రలు, రాడ్లు,  రాళ్లతో దాడి చేశారన్నారు. ఘటనపై సమగ్ర విచారణ జరిపి, బాధ్యులను విడిచిపెట్టమన్నారు. 

కేసీఆర్​ గడీలు బద్దలు కొడతాం

జనగామ, వెలుగు: కేసీఆర్​గడీలు బద్దలు కొట్టి..  కల్వకుంట్ల రాజ్యాంగాన్ని బొందపెట్టి ప్రజాస్వామ్య తెలంగాణ నిర్మాణం జరిగే వరకు పోరాటం చేద్దామని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్​ పిలుపునిచ్చారు. మూడో విడత ప్రజా సంగ్రామ యాత్రలో భాగంగా జనగామ జిల్లా దేవరుప్పులలో బండి సంజయ్​ పాదయాత్ర సోమవారం ప్రారంభమైంది. తొలుత సాయి ప్రశాంతి హైస్కూల్ లో జెండా ఎగురవేశారు. అనంతరం ధర్మాపురం రోడ్డులో జాతీయ జెండా ఎగరేసి మాట్లాడారు. జిల్లాలో తొలి రోజు 14.5 కిలోమీటర్ల మేర పాదయాత్ర సాగింది. దేవరుప్పుల, దేవరుప్పుల తండా, బోడ తండా, ధర్మాపురం, మైలారం గ్రామాలలో పాదయాత్ర కొనసాగింది. బండి సంజయ్​ మాట్లాడుతూ హర్ ఘర్ తిరంగా పేరుతో దేశవ్యాప్తంగా జాతీయ జెండా కార్యక్రమం చేపట్టాం. గత పాలకులు జాతీయ జెండాను కొంతమందికే పరిమితం చేశారు. ప్రధాని మోడీ నిబంధనలు సడలించి ప్రతి ఒక్కరూ జాతీయ జెండా ఎగరేసే అవకాశాన్ని కల్పించారు. దేశం కోసం, ధర్మం కోసం, సమాజం కోసం పాటుపడాలి అని అన్నారు.  ఇండియా-–పాకిస్తాన్ క్రికెట్​మ్యాచ్ అప్పుడే దేశభక్తి గురించి ఆలోచిస్తే, అది దేశ భక్తి కాదని, నిరంతరం దేశభక్తి భావంతో ఉండాలన్నారు. దేవరుప్పల పౌరుషాల గడ్డ అని, నిజాం పాలకులకు వ్యతిరేకంగా పోరాడిన అడ్డా ఇది అని పేర్కొన్నారు. దొడ్డి కొమురయ్య, చాకలి ఐలమ్మ, షేక్ బందగీ, తానూ నాయక్ లు ఈ పోరు గడ్డకు చెందిన వారేనని, వారికి కమ్యూనిస్టుల సిద్ధాంతాలు తెలియవన్నారు. తెలంగాణ ఉద్యమంలో కేసీఆర్ కూడా జేఏసీ సభలకు వెళ్లి ఫొటోలకు ఫోజులిచ్చి.. అంతా తానే చేసినట్లు ఉద్యమాన్ని హైజాక్ చేశాడని విమర్శించారు.

కేసీఆర్​లా నటించడం రాదు

కేసీఆర్ లా నాకు నటించడం, జీవించడం రాదు. ఉన్నది ఉన్నట్టు ముక్కుసూటిగా చెప్తానని సంజయ్​పేర్కొన్నారు. ట్విట్టర్​ టిల్లు కేటీఆర్.. స్వాతంత్య్రానికి ముందు, తర్వాత కూడా తెలంగాణలో పరిస్థితులు ఒకేలా ఉన్నాయని సంజయ్ అన్నారు. ఒక కుటుంబానికి కొమ్ము కాయడం కోసమా తెలంగాణ రాష్ట్రం సాధించుకున్నది?  కేసీఆర్ పాలనను తరిమి కొట్టేందుకు ప్రతి ఒక్కరూ సిద్ధం కావాలని సంజయ్​పిలుపునిచ్చారు. భాగ్యలక్ష్మీ అమ్మవారి ఆశీస్సులతో సాగుతున్న ప్రజాసంగ్రామ యాత్రలతో కేసీఆర్​గజగజ వణుకుతున్నడని బండి సంజయ్​ పేర్కొన్నారు. 

300 ఎకరాలకు కేసీఆర్​ కరెంట్​ వాడకుంటుండు

రైతులకు కరెంట్​ఎప్పుడు వస్తదో ఎప్పుడు రాదో తెలియదు కానీ, కేసీఆర్​ ఫాంహౌజ్​లోని 300  ఎకరాలకు ఫ్రీ కరెంట్​వాడుకుంటున్నారని విమర్శించారు. ఫ్రీ కరెంట్​ తీసుకునేందుకు కేసీఆర్​ఏమైనా పేదోడివా అని ప్రశ్నించారు. 30 గ్రామాలకు వాడే కరెంట్​ను ఒక్క కేసీఆర్​ వాడుకుంటూ దోచుకుంటుండని అన్నారు.  

యాత్రకు జన నీరాజనం

బండి సంగ్రామ యాత్ర తొలిరోజు 14.5 కిలోమీటర్లు సాగగా అడుగడుగునా జనం నీరాజనం పట్టారు. దేవరుప్పుల దాడి ఘటనపై డీజీపీతో బండి సంజయ్​సీరియస్​గా మాట్లాడారు. లంచ్​ తర్వాత ధర్మాపురం, మైలారం గ్రామాలలో యాత్ర కొనసాగింది. ధర్మాపురం గ్రామంలోని డబుల్ బెడ్ రూమ్ ఇండ్లను బండి సంజయ్​ పరిశీలించారు. పోరాటయోధుడు ఠాను నాయక్ ఇంటిని సందర్శించారు. పాదయాత్రలో పార్టీ జిల్లా అధ్యక్షుడు ఆరుట్ల దశమంత్​ రెడ్డి, సంగప్ప, రాణి రుద్రమ,  ఎన్​వీ సుభాష్​, ధర్మారావు, ఈఈరావు పద్మ, కొండేటి శ్రీధర్​ పాల్గొన్నారు.

పాలకుర్తికి రూ.వందల కోట్లు ఇచ్చాం..

 పాలకుర్తి, వెలుగు: పాలకుర్తి ప్రజలు బీజేపీకి ఓటు వేయకపోయినా కేంద్రంలోని మోడీ సర్కార్​ఈ నియోజకవర్గానికి రూ.వందల కోట్ల నిధులిచ్చిందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్ కుమార్ పేర్కొన్నారు. 2018 నుంచి ఏయే పథకానికి ఎన్ని నిధులిచ్చిందనే వివరాలను గణాంకాలతో సహా వివరించారు. ఒకవేళ తాను చెప్పిన లెక్కలు తప్పయితే తనపై కేసు పెట్టుకోవాలంటూ టీఆర్ఎస్ నేతలకు, మంత్రి ఎర్రబెల్లికి సవాల్ విసిరారు. ఉపాధి కూలీలకు మొత్తం రూ.126 కోట్ల 7 లక్షలు, వాటిల్లో మౌలిక సదుపాయాల కల్పనకు, మెటీరియల్​ఖర్చు రూ.85 కోట్ల 57 లక్షలు, మొక్కల పెంపకం కోసం ఖర్చు చేసిన నిధులు రూ.39 కోట్ల 84 లక్షలు, పీఎం కిసాన్ సమ్మన్ నిధి ద్వారా రూ.100 కోట్లు, పీఎం సడక్​యోజన ద్వారా రూ.45 కోట్ల 89 లక్షలు ఇచ్చినట్లు వివరించారు.

విద్యార్థులకు ఆర్థిక సాయం 

మహబూబాబాద్​ అర్బన్​, వెలుగు: మహబూబాబాద్​మండలం పర్వతగిరి హైస్కూల్​లో స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా కెనరా బ్యాంకు మహబూబాబాద్ శాఖ ఆధ్వర్యంలో  ‘విద్యా జ్యోతి పథకం’  కింద విద్యార్థులకు ఆర్థిక సాయం అందజేశారు.  8, 9, 10 తరగతులకు చెందిన స్టూడెంట్స్​భూక్యా సంధ్య, గుగులోత్ కల్యాణి, గుగులోత్ వనిత లకు ఒక్కొక్కరికి రూ.5వేల చొప్పున, 5, 6, 7 తరగతులకు చెందిన బాదావత్ అంజలి, భూక్యా సింధు, భూక్యా జీవనలకు రూ.2500 చొప్పున ఉపకార వేతనాలు అందజేశారు. బ్యాంకు మేనేజర్ భూక్యా శోభన్, బ్యాంకు పీవోలు సతీశ్, రాజు, హెచ్ ఎం రాందాస్ పాల్గొన్నారు.

బీజేపీ కార్యకర్తలకు పరామర్శ

జనగామ, వెలుగు: దేవరుప్పులలో బీజేపీ, టీఆర్ఎస్ కార్యకర్తలకు మధ్య జరిగిన ఘర్షణల్లో గాయపడిన బీజేపీ కార్యకర్తలను గుజ్జుల ప్రేమేందర్​రెడ్డి, మాజీ ఎమ్మెల్యే ఎన్​వీఎస్​ప్రభాకర్ సోమవారం పరామర్శించారు. జనగామ హాస్పిటల్​లో చికిత్స పొందుతున్న గుండాల సర్పంచ్ మల్లేశ్, జనగామ కు చెందిన కార్తీక్ ను పరామర్శించారు. 

‘ఎర్రబెల్లి’ విస్నూర్​ దొరగా మారిండు

పాలకుర్తి, వెలుగు: పాలకుర్తి నుంచి మూడు సార్లు గెలవగానే మంత్రి ఎర్రబెల్లి దయాకర్​రావు విస్నూర్​ దొర రామచంద్రారెడ్డిలాగా మారిండని, ఆనాడు దేశ్​ముఖ్​లకు పట్టిన గతే ఆయనకు పడుతుందని బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధులు రాణిరుద్రమ, సంగప్ప పేర్కొన్నారు. ఎర్రబెల్లి టీఆర్ఎస్​కార్యకర్తల చేత బీజేపీ శ్రేణులపై దాడులు చేయించాడని, ఈ దాడులను ఖండిస్తున్నామన్నారు. ప్రతి పక్షాలకు ప్రజలను కలిసే హక్కులేదా అని ప్రశ్నించారు. ప్రజా సంగ్రామ యాత్రకు ప్రజల్లో వస్తున్న ఆదరణను చూసి ఓర్వలేకనే దాడులకు పురిగొల్పుతున్నారని ఆరోపించారు. 

ఎర్రబెల్లి డైరెక్షన్ లోనే దాడులు

హనుమకొండ సిటీ, వెలుగు: సీఎం కేసీఆర్​ప్రోద్బలం, మంత్రి ఎర్రబెల్లి డైరెక్షన్​లోనే బీజేపీ చీఫ్​బండి సంజయ్​ చేపట్టిన ప్రజా సంగ్రామ యాత్రపై దాడులు జరుగుతున్నాయని ఆ పార్టీ జిల్లా అధ్యక్షురాలు రావు పద్మ మండిపడ్డారు. ఈ మేరకు సోమవారం ఆమె ఒక ప్రకటన విడుదల చేశారు. దేవరుప్పులలో బీజేపీ నాయకులపై దాడిని ఖండిస్తున్నామన్నారు.  

రాక్షసత్వాన్ని బొందపెట్టే రోజులొస్తయ్​

బీజేపీ కార్యకర్తల రక్తాన్ని కళ్ల చూసిన టీఆర్ఎస్​ నేతల రాక్షసత్వాన్ని బొందపెట్టే రోజులు ముందున్నాయని బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి ఏనుగుల రాకేశ్​ రెడ్డి అన్నారు. బండి సంజయ్​ ప్రజాసంగ్రామ యాత్రపై జరిగిన దాడిని ఆయన ఒక ప్రకటనలో తీవ్రంగా ఖండించారు. 

కిడ్నాప్​ అయిన బాలిక ఆచూకీ లభ్యం

కాజీపేట, వెలుగు: గత నెల 6న కాజీపేటలో కిడ్నాప్ అయిన 14 ఏండ్ల బాలిక ఆచూకీ కనుగొని తల్లిదండ్రులకు అప్పగించినట్లు కాజీపేట సీఐ మహేందర్ రెడ్డి సోమవారం ఓ ప్రకటనలో తెలిపారు. ఈ కేసులో బాలికను కిడ్నాప్ చేసిన ఆమె అక్క భర్త భూపెల్లి మధును అరెస్ట్ చేసి నిందితుడిపై కిడ్నాప్, అత్యాచారం కేసులు నమోదు చేసినట్లు చెప్పారు. న్యాయమూర్తి ఆదేశాల ప్రకారం అతడిని ఖమ్మం జైలుకి తరలించినట్లు తెలిపారు. సీఐ వివరాల ప్రకారం.. జనగామ జిల్లా పెంబర్తికి 
చెందిన రైల్వే ఉద్యోగి భూపెల్లి మధు జులై 6న కాజీపేటలోని స్కూల్ నుంచి బాలికను కిడ్నాప్ చేసి సికింద్రాబాద్ కి అక్కడ నుంచి వికారాబాద్ జిల్లా తాండూర్ కి తీసుకెళ్లి అక్కడే ఉంచినట్లు ఎంక్వైరీలో తెలిసిందన్నారు. బాలిక కోసం పోలీసులు వెతుకుతుండగా నిందితుడు సోమవారం యాద్రాద్రి జిల్లా ఆలేరుకు బాలికను తీసుకొని వచ్చినట్లు సమాచారం మేరకు అదుపులోకి తీసుకున్నామన్నారు. నిందితుడికి, బాలిక అక్క అయిన అతని భార్యకు ఉన్న విభేదాల కారణంగానే ఆమెను కిడ్నాప్​చేసినట్లు తెలిసిందన్నారు.

జ్యోతిష్యుడికి ప్రశంసా పత్రం

వరంగల్ సిటీ, వెలుగు: వరంగల్ రామన్నపేటకు చెందిన ప్రముఖ జ్యోతిషుడు, వాస్తు కన్సల్టెంట్​ డా.కె.సుమన్​ శర్మ ఉత్తమ జ్యోతిష్యుడిగా ప్రశంసా పత్రం అందుకున్నారు. జ్యోతిష్యంలో డాక్టరేట్​ పట్టా పొందిన ఆయన రెండు దశాబ్దాలుగా వివిధ వాస్తు అంశాల మీద పరిశోధనలు నిర్వహించారు. ఆయన సేవలను గుర్తించి ప్రశంసాపత్రం అందజేశారు.