ఎమర్జెన్సీ పోరాటయోధుల గుర్తింపునకు కృషి : నల్లు ఇంద్రసేనారెడ్డి

ఎమర్జెన్సీ పోరాటయోధుల గుర్తింపునకు కృషి : నల్లు ఇంద్రసేనారెడ్డి

జగిత్యాల టౌన్, వెలుగు:  ఎమర్జెన్సీకి వ్యతిరేకంగా పోరాడిన వారిని స్వాతంత్రయోధులుగా గుర్తించేలా కృషి చేస్తానని త్రిపుర గవర్నర్ నల్లు ఇంద్రసేనారెడ్డి అన్నారు. శుక్రవారం భారత సురక్ష సమితి రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఏసీఎస్ రాజు ఆధ్వర్యంలో ఇంద్రసేనారెడ్డికి పౌరసన్మానం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా గవర్నర్ మాట్లాడుతూ 1975-–77 కాలంలో దేశంలో అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం ఎమర్జెన్సీని విధించిందన్నారు.  

ప్రతిపక్ష నాయకులను అరెస్టు చేసి జైళ్లలో పెట్టారన్నారు. పత్రికలు, మీడియా సంస్థలపై ఉక్కుపాదం మోపి ప్రజాస్వామ్య గొంతు నులిమారన్నారు. ప్రజాస్వామ్య పరిరక్షణకు నాడు ఎంతోమంది యువకులు, విద్యార్థులు ఉద్యమించారని, పోలీస్ కాల్పుల్లో కొంతమంది చనిపోయారన్నారు. ఎమర్జెన్సీ వ్యతిరేక ఉద్యమంలో పాల్గొన్నవారు ఆర్థికపరంగా ఆరోగ్యపరంగా ఇబ్బందుల్లో ఉన్నారని.. అలాంటి వారిని స్వాతంత్ర యోధులుగా గుర్తించి అన్ని రాయితీలు కల్పించేలా తన వంతు కృషి చేస్తానని తెలిపారు.

లోక్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌నాయక్ జయప్రకాష్ నారాయణ నాయకత్వంలో తాను కూడా విద్యార్థి నాయకుడిగా ఉద్యమంలో పాల్గొన్నానని గుర్తుచేసుకున్నారు. తనతో పాటు కలిసి పనిచేసిన వారు ఈ ప్రాంతంలో చాలా మంది ఉన్నారని వారిని ఆత్మీయుడిగా కలిసేందుకు ఇక్కడికి వచ్చానని తెలిపారు. కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యేలు గుజ్జుల రామకృష్ణారెడ్డి, కాసిపేట లింగయ్య. బీజేపీ లీడర్లు రవీందర్ రెడ్డి, భారత సురక్ష సమితి లీడర్లు భూపతి రెడ్డి, అర్జున్ రావు, సంపూర్ణచారి, కాశీనాథం, గంగాధర్ పాల్గొన్నారు.