నైట్ కర్ఫ్యూ: పెళ్లి కొడుకు, పూజారిని పరిగెత్తించిన ఐఏఎస్ 

నైట్ కర్ఫ్యూ: పెళ్లి కొడుకు, పూజారిని పరిగెత్తించిన ఐఏఎస్ 

అగర్తల: దేశంలో కరోనా తీవ్రంగా విజృంభిస్తోంది. వైరస్ వ్యాప్తిని అడ్డుకోవడానికి మహారాష్ట్ర, కర్నాటక లాంటి రాష్ట్రాలు లాక్‌డౌన్ విధించడం.. మిగిలిన స్టేట్ గవర్నమెంట్‌‌లు నైట్ కర్ఫ్యూలు, కఠినమైన కొవిడ్ నిబంధలను అమలు చేయడం చూస్తున్నాం. ఈశాన్య రాష్ట్రమైన త్రిపురలో రాత్రి 10 నుంచి ఉదయం 5 గంటల వరకు కర్ఫ్యూ అమలు చేస్తున్నారు.  ఏ వేడుకలు చేసుకున్నా 100 మంది అతిథులకే అనుమతిని ఇస్తున్నారు. అయినా చాలా మంది ఈ నిబంధనలను పట్టించుకోవడం లేదని తెలిసింది. దీంతో పోలీసులు, అధికారులు ఇలాంటి ఇన్స్‌‌పెక్షన్లు చేస్తున్నారు. ఈ క్రమంలో రాత్రి 10 గంటలు దాటాక పెళ్లి వేడుకను కొనసాగించిన  కుటుంబీకులపై ఓ ఐఏఎస్ అధికారి వ్యవహరించిన తీరు హాట్ టాపిక్‌గా మారింది. 

మ్యారేజ్ విషయం తెలుసుకున్న వెస్ట్ త్రిపుర డిస్ట్రిక్ట్ మేజిస్ట్రేట్ శైలేష్ కుమార్ యాదవ్.. అక్కడ ఉన్న వారిని దూకుడుగా బయటకు నెట్టారు. పెళ్లి చేసిన పూజారితోపాటు పెళ్లి కొడుకు, కూతురి బంధువులను బయటకు నెట్టారు. ఆ సమయంలో కొందరు శైలేష్‌‌‌తో వారించగా.. వారిని పోలీసులు అదుపులోకి తీసుకొని కేసులు పెట్టారు. ఈ ఘటనపై సోషల్ మీడియాలో శైలేష్ మీద విమర్శలు వస్తున్నాయి. ఆయన వ్యవహరించిన తీరు సరికాదని స్థానిక ఎమ్మెల్యే కూడా మండిపడ్డారు. దీనిపై సారీ చెప్పిన శైలేష్.. డ్యూటీలో భాగంగానే అలా ప్రవర్తించానన్నారు.