ప్రభుత్వ పనితీరు ఆధారంగానే ప్రజల తీర్పు

ప్రభుత్వ పనితీరు ఆధారంగానే ప్రజల తీర్పు

త్రిపురలో బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్రం అపూర్వమైన అభివృద్ధిని సాధించిందని బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా  ప్రశంసించారు. రెండు రోజుల పర్యటన నిమిత్తం రాష్ట్రానికి వచ్చిన నడ్డా త్రిపుర సీఎం మాణిక్ సాహా, మాజీ సీఎం బిప్లబ్ దేబ్‌తో కలిసి పలు కార్యక్రమాల్లో పాల్గొన్నారు. మహిళల సాధికారత నుండి రాష్ట్ర ప్రజల సమగ్రాభివృద్ధి వరకు రాష్ట్రంలో అపూర్వమైన పురోగతి సాధించామని చెప్పారు. పారిశ్రామిక, ఆర్థిక, విద్య, ఆరోగ్య సంరక్షణ తదితర రంగాల్లో ప్రభుత్వ పనితీరు ఆధారంగా ప్రజలు తమ పార్టీకి అనుకూలంగా ఉన్నారని అన్నారు.  

త్రిపురను సీపీఎం 35 ఏండ్లు పాలించినా మహిళా సాధికారత కోసం ఏమీ చేయలేదని జేపీ నడ్డా ఆరోపించారు. గిరిజనులను విస్మరించి యువకులను దోపిడీ చేసిందన్నారు.సమాజంలోని అన్ని వర్గాలను ఏకతాటిపైకి తీసుకురావడానికి బీజేపీ ప్రజలతో కలిసి పనిచేస్తోందని నడ్డా అన్నారు. బీజేపీ ప్రభుత్వం ముందస్తు ప్రణాళికతో రాష్ట్ర ఆదాయం 30 శాతం పెరిగిందన్నారు. తేయాకు తోటలో పనిచేసిన భూమిలేని కూలీలకు భూమిపై యాజమాన్య హక్కు కల్పించామన్నారు. గ్రామాలకు రోడ్డు కనెక్టివిటీ ఉండే విధంగా 6 జాతీయ రహదారుల పనులు వేగంగా సాగుతున్నాయని జేపీ నడ్డా స్పష్టం చేశారు.