సూర్యగ్రహణంతో అయ్యప్ప భక్తుల ఇబ్బందులు

సూర్యగ్రహణంతో అయ్యప్ప భక్తుల ఇబ్బందులు

శబరిమల అయ్యప్ప మండల పూజలు రేపు(గురువారం) సాయంత్రానికి ముగియనుండటంతో అయ్యప్ప స్వాముల రద్దీ భారీగా పెరిగిపోయింది. దీంతో పాటు రేపు సూర్యగ్రహణం కావడంతో శబరిమల అయ్యప్ప ఆలయ ద్వారాలు ఇవాళ(బుధవారం) సాయంత్రం మూసుకోనున్నాయి. ఈ క్రమంలో సన్నిధానం నుంచి పంబ వరకూ భక్తులు లక్షలాదిగా స్వామి దర్శనం కోసం ఎదురు చూస్తున్నారు. మరోవైపు ఎరుమేలి వరకూ ట్రాఫిక్ నిలిచిపోయింది. 55 కిలోమీటర్ల దూరం వరకూ వాహనాలు నిలిచిపోగా…ప్రయాణానికి 13 నుంచి 14 గంటల సమయం పడుతోంది. దీంతో భక్తులు తమ వాహనాలను వదిలేసి, ఆలయానికి నడిచి వెళ్లేందుకు రెడీ అవుతున్నారు.

ఇప్పటికే  కొండపై భక్తుల రద్దీ విపరీతంగా ఉండటంతో, వీరిని ఎక్కడికక్కడ నిలువరిస్తున్నారు పోలీసులు. నీలక్కల్ పార్కింగ్ నుంచి పంబ వరకూ కేరళ ఆర్టీసీ నడుపుతున్న ప్రత్యేక బస్సులు ఎక్కడి కక్కడే నిలిచిపోయాయి. మంగళవారం ఉదయం 10 గంటలకు నీలక్కల్ చేరుకున్న వాహనాలను రాత్రి 10 గంటల తర్వాత అనుమతించారు. ఆ తర్వాత ఈ తెల్లవారుజాము నుంచి వాహనాలను అనుమతించలేదు. ఇప్పటివరకూ మండల పూజకు 25 లక్షల మంది వరకూ భక్తులు హాజరు కాగా, మరో 3 లక్షల మంది భక్తులు వేచి చూస్తున్నారు. వీరికి మండల పూజ ముగిసేలోగా… దర్శనం కల్పించడం సాధ్యం కాదంటున్నారు ట్రావెన్ కోర్ దేవస్థానం బోర్డు అధికారులు.