
రాష్ట్రంలో నిన్నటి వరకు ఎన్నికల ప్రచారాలు, సభలు, సమావేశాలతో బిజీగా గడిపిన నేతలకు ఇపుడు కరోనా టెన్షన్ మొదలైంది. చాలా మంది నేతలు ఇప్పటికే కరోనా బారిన పడి కోలుకోగా మరి కొంత మందికి కరోనా సోకింది. ముఖ్యంగా నాగార్జున సాగర్ బైపోల్ తో చాలా మంది లీడర్లు కరోనా బారిన పడ్డారు. అధికార టీఆర్ఎస్ తో పాటు బీజేపీ, కాంగ్రెస్ నేతలు కరోనా భారిన పడుతున్నారు. సీఎం కేసీఆర్ తో పాటు టీఆర్ఎస్ అభ్యర్థి నోముల భగత్ కు కరోనా వచ్చింది.
కాంగ్రెస్ లో ఇప్పటికే ఎంపీలు రేవంత్ రెడ్డి, కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి, మాజీ ఎంపీ హనుమంత్ రావు కరోనా నుండి కోలుకున్నారు. టీపీసీసీ ప్రెసిడెంట్ ఉత్తమ్ కుమార్ రెడ్డి, మాజీ ఎమ్మెల్సీ రాములు నాయక్ గత వారం రోజులుగా జ్వరంతో బాధపడుతున్నారు. ఉత్తమ్ పీఏ, గన్ మెన్, డ్రైవర్ లకు కరోనా సోకింది. సాగర్ ఎన్నికలో పోటీ చేసిన జానారెడ్డి కి సైతం కరోనా లక్షణాలు ఉన్నట్లు అనుచరులు చెబుతున్నారు. ఎన్నిక ముగిసినప్పటి నుండి జానారెడ్డి ఇంటికే పరిమితమయ్యారు. దీంతో చాలా మంది నేతలు ముందు జాగ్రత్తగా ఐసొలేట్ అవుతున్నారు. బయటికి రావడానికి భయపడుతున్నారు. కొందరు నాయకులు అనుచరులను కూడా కలవడానికి ఇంట్రెస్ట్ చూపడం లేదు. కొందరు నేతలు ఫామ్ హౌస్ లకు వెళ్తే మరికొందరు సొంతూర్లకు వెళ్లారు. మున్సిపల్ ఎన్నికల సమయంలో కాంగ్రెస్ సీనియర్ లీడర్లను కలవడానికి వచ్చే వారు కూడా గాంధీభవన్ కు రావడం లేదు. పలు శాఖలకు సంబంధించిన నాయకులు, రెగ్యూలర్ స్టాఫ్ కూడా కొన్ని రోజులుగా గాంధీభవన్ కు దూరంగా ఉంటున్నారు.