బీజేపీ ప్రచారాన్ని అడ్డుకున్న టీఆర్ఎస్​

బీజేపీ ప్రచారాన్ని అడ్డుకున్న టీఆర్ఎస్​

యాదాద్రి, వెలుగు: బీజేపీ ఎన్నికల ప్రచారాన్ని యాదాద్రి జిల్లా చౌటుప్పల్​మండలంలో టీఆర్ఎస్​ కార్యకర్తలు అడ్డుకున్నారు. కోమటిరెడ్డి రాజగోపాల్​రెడ్డి గో బ్యాక్​ అంటూ టీఆర్​ఎస్ కార్యకర్తలు జెండాలు చూపిస్తూ నినాదాలు చేశారు. ప్రతిగా బీజేపీ కార్యకర్తలు నినాదాలు చేశారు. ఇదే సమయంలో గుర్తు తెలియని కొందరు వ్యక్తులు రాళ్లు విసరడంతో బీజేపీ కార్యకర్తలలో ఇద్దరికి గాయాలయ్యాయి. యాదాద్రి జిల్లా చౌటుప్పల్​ మండలం పంతంగిలో రోడ్డు షో ముగిసిన అనంతరం మంత్రి మల్లారెడ్డి ఇన్​చార్జీగా ఉన్న సైదాబాద్​లో ప్రచారం నిర్వహించడానికి బీజేపీ అభ్యర్థి కోమటిరెడ్డి రాజగోపాల్​రెడ్డి వెళ్లారు. రాజగోపాల్​రెడ్డి ప్రసంగిస్తుండగా ఓ టీఆర్ఎస్​ కార్యకర్త చెప్పులు చూపించడం, మరికొందరూ గో బ్యాక్​ అంటూ నినాదాలు చేశారు.. దీంతో బీజేపీ కార్యకర్తలు ప్రతిగా నినాదాలు చేశారు. పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో పోలీసులు రంగంలోకి దిగి ఇరు పార్టీల కార్యకర్తలను నిలువరించారు.

తర్వాత మంత్రి మల్లారెడ్డి ఇన్​చార్జీగా ఉన్న ఆరెగూడెంలో ప్రచారం నిర్వహించడానికి రాజగోపాల్​రెడ్డి వెళ్లి.. ప్రసంగించడం మొదలు పెట్టగానే.. టీఆర్​ఎస్​ కార్యకర్తలు పార్టీ జెండాలు ఊపుతూ గ్యో బ్యాక్​ అంటూ నినాదాలు చేశారు. దీంతో కోమటిరెడ్డి రాజగోపాల్​రెడ్డి 'మీ ప్రచారం మీరు చేసుకున్నారు. మా ప్రచారం మేము చేసుకుంటాం' అని కామెంట్​ చేశారు. టీఆర్​ఎస్​ కార్యకర్తలు నినాదాలు ఆపకపోవడంతో బీజేపీ కార్యకర్తలు కూడా ప్రతి నినాదాలు చేశారు. అదే సమయంలో కొందరు వ్యక్తులు రాళ్లను ప్రయోగించడంతో కొందరికి గాయాలయ్యాయి. గాయాలు కావడం,  కొందరు వ్యక్తులు అసభ్య పదజాలంతో దూషించడం మొదలుపెట్టారు. దీంతో పరిస్థితి అదుపుతప్పింది. కోమటిరెడ్డి రాజగోపాల్​రెడ్డి కిందికి వచ్చే ప్రయత్నం చేయగా బీజేపీ కార్యకర్తలు ఆయనను అపేశారు. రెండు పార్టీల కార్యకర్తలు ఒకరి వైపు మరొకరు దూసుకొచ్చే ప్రయత్నాలు చేయడంతో పోలీసులు రంగంలోకి దిగి కార్యకర్తలను చెదరగొట్టారు. రెండు పార్టీల కార్యకర్తల మధ్యలో పోలీసులు మోహరించి పరిస్థితి అదుపుతప్పకుండా కంట్రోల్​ చేశారు.