కామంచికల్​ సెంటర్​లో టీఆర్ఎస్, ​సీపీఐ ఫైటింగ్

కామంచికల్​ సెంటర్​లో టీఆర్ఎస్, ​సీపీఐ ఫైటింగ్
  • సీపీఐ కౌన్సిల్​ మెంబర్​ను అడ్డుకున్న టీఆర్ఎస్ ​నాయకులు
  • ఘర్షణలో తలలు పగలగొట్టుకున్న ఇరు పార్టీల లీడర్లు
  • ఖమ్మం రూరల్​ మండలంలో ఘటన 

ఖమ్మం రూరల్, వెలుగు : పాలేరు నియోజవకర్గం ఖమ్మం రూరల్​ మండలంలోని కామంచికల్లులో శుక్రవారం టీఆర్ఎస్, సీపీఐ కార్యకర్తల మధ్య ఘర్షణ చోటు చేసుకుంది. రెండు పార్టీల కార్యకర్తలు కొట్టుకోవడంతో పలువురికి తలలు పలిగాయి. గురువారం రాత్రి పాలేరు ఎమ్మెల్యే కందాల ఉపేందర్​రెడ్డి సమక్షంలో సీపీఐకి చెందిన సర్పంచ్ మేదరమెట్ల వెంకటరమణ, వార్డు మెంబర్లు, పలు సీపీఐ కుటుంబాలు టీఆర్ఎస్ లో చేరాయి. ఈ నేపథ్యంలోనే  గ్రామంలో ఘర్షణ వాతావరణం చోటు చేసుకుంది. శుక్రవారం జానబాద్​తండాకు చెందిన సీపీఐ నాయకుడు మరణించగా సీపీఐ కౌన్సిల్​ సభ్యులు పుచ్చకాయల కమలాకర్ ​గ్రామానికి వెళ్లి నివాళులర్పించి తిరుగు ప్రయాణమయ్యారు. కామంచికల్లుకు చేరుకునే క్రమంలో టీఆర్ఎస్ నాయకులు కమలాకర్ వెళ్తున్న కారును అడ్డగించారు.

‘కామంచికల్లులో నీకేం పని. మా గ్రామంలో నీ పెత్తనమేంది?’ అని ప్రశ్నించారు. ఈ క్రమంలో ఘర్షణ చోటు చేసుకుంది. అప్పటికే అక్కడకు చేరుకున్న సీపీఐ నాయకులు టీఆర్ఎస్​ లీడర్లతో వాదనకు దిగారు. కొద్దిసేపటి తర్వాత అక్కడి నుంచి వెళ్లిపోయిన కమలాకర్​ గుడూరుపాడుకు చెందిన పార్టీ నాయకులకు విషయం చెప్పాడు. దీంతో సీపీఐ నాయకులు పెద్ద సంఖ్యలో గూడూరుపాడు నుంచి కామంచికల్లు సెంటర్‌కు చేరుకున్నారు. అక్కడే ఉన్న టీఆర్ఎస్ నాయకులతో గొడవ పడ్డారు. ఈ క్రమంలో ఇరువర్గాలు ఒకరిపై ఒకరు దాడి చేసుకోవడంతో టీఆర్ఎస్‌కు చెందిన ఇద్దరికి, సీపీఐకి చెందిన ఐదుగురి తలలు పగిలాయి. ఇరువర్గాల నాయకులు ఒకరిపై ఒకరు పోలీసులకు ఫిర్యాదు చేసుకున్నారు.