హుజూరాబాద్‍ టీఆర్ఎస్ ​ఇన్​చార్జిలకు ఇంటిపోరు

హుజూరాబాద్‍ టీఆర్ఎస్ ​ఇన్​చార్జిలకు ఇంటిపోరు

వరంగల్‍ రూరల్‍, వెలుగు: ‘హుజూరాబాద్ నియోజకవర్గ అభివృద్ధి బాధ్యత నాదే.. 50 ఏండ్లలో జరగని డెవలప్‍మెంట్‍ ఏంటో మూడేండ్లలో చూపిస్తా.’ – ఇది మంత్రి గంగుల కమలాకర్‍ హామీ. 

‘కమలాపూర్ అభివృద్ధి నాదే.. సీఎం దూతగా చెబుతున్నా.. హుజూరాబాద్‍ ఎలక్షన్‍ అయ్యేదాక నేనే మీ ఎమ్మెల్యేను.. మీ ఊరికి ఏం కావాలో చెప్పండి.. మీకు ఏ స్కీం కావాలో అడగండి.. అవి చేయకపోతే నా కారుకు అడ్డుపడండి.’ – ఇది పరకాల ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి మాట. 

మంత్రి కొప్పుల ఈశ్వర్, వర్ధన్నపేట ఎమ్మెల్యే అరూరి రమేశ్, నర్సంపేట ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్‍రెడ్డి తదితర టీఆర్ఎస్​ ఇన్​చార్జిలు.. ప్రభుత్వ పెద్దల​తరఫున హుజూరాబాద్​ నియోజకవర్గ ప్రజలకు ఇస్తున్న హామీలు అన్నీ ఇన్నీ కావు. ఇలా ముందు, వెనుక చూడకుండా ఇస్తున్న హామీలు, వాగ్దానాలు, చేస్తున్న శాంక్షన్లు, చేపడుతున్న పనులే ఇప్పుడు వారికి సొంత నియోజకవర్గాల్లో సరికొత్త తలనొప్పిని తెచ్చిపెడుతున్నాయి.

హైకమాండ్ ఆదేశాలతో..

తెలంగాణ ఉద్యమకారుడు, సీనియర్‍ మంత్రి ఈటల రాజేందర్‍ టీఆర్‍ఎస్‍ పార్టీకి గుడ్‍బై చెప్పడంతో త్వరలో హుజూరాబాద్‍ బై ఎలక్షన్‍ జరగనున్నాయి. ఈ నేపథ్యంలో ఎట్టి పరిస్థితుల్లోనూ ఈటల మళ్లీ అక్కడి నుంచి గెలవకుండా అధికార పార్టీ అన్ని ప్రయత్నాలు చేస్తోంది. ఇందుకోసం మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలను రంగంలోకి దింపింది. ఉమ్మడి కరీంనగర్‍, వరంగల్‍ జిల్లాలకు చెందినవారిని మండలానికి ఇద్దరు చొప్పున ఇన్​చార్జిలుగా వేసింది. వీరిలో ప్రధానంగా ఉమ్మడి కరీంనగర్‍ నుంచి  మంత్రులు గంగుల కమలాకర్‍, కొప్పుల ఈశ్వర్‍, ఎమ్మెల్యేలు సతీశ్​బాబు, కోరుకంటి చందర్, సుంకె రవిశంకర్, ఎమ్మెల్సీ నారదాసు, వరంగల్‍ నుంచి పరకాల, వర్ధన్నపేట, నర్సంపేట ఎమ్మెల్యేలు చల్లా ధర్మారెడ్డి, అరూరి రమేశ్‍, పెద్ది సుదర్శన్‍రెడ్డితో పాటు  ప్రభుత్వ చీఫ్ విప్‍ వినయ్‍భాస్కర్‍, తూర్పు ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్‍ ఉన్నారు. కొద్దిరోజులుగా వీరంతా సొంత నియోజకవర్గాల కంటే హుజూరాబాద్​లో తమకు ఇన్​చార్జి ఇచ్చిన మండలాల్లోనే ఎక్కువ అందుబాటులో ఉంటున్నారు. హైకమాండ్​ ఆదేశాల మేరకు ఊరూరా బీటీ రోడ్లు, వాడవాడలా సీసీ రోడ్లు, కమ్యూనిటీ హాళ్లు, పంచాయతీలకు కొత్త బిల్డింగులు శాంక్షన్​ చేయిస్తున్నారు. ఆ పనులను ఇన్​చార్జిలే దగ్గరుండి మరీ చేయిస్తున్నారు. గ్రామాల్లో తిరుగుతూ కల్యాణలక్ష్మి, సీఎం రిలీఫ్​ ఫండ్‍ చెక్కులను స్వయంగా అందజేస్తున్నారు. యాదవులకు గొర్ల యూనిట్లు, యువతకు ఉపాధి స్కీములు ఇప్పించేందుకు కృషి చేస్తున్నారు. ప్రతి ఇంటి నుంచి ఏదో ఒక స్కీము కోసం కొత్త అప్లికేషన్లు తీసుకుంటున్నారు. త్వరలోనే డబుల్​బెడ్​ రూం ఇండ్లు పూర్తిచేసి అందజేస్తామని హామీ ఇస్తున్నారు. పార్టీ కేడర్‍కు డబ్బులు, కాంట్రాక్ట్ లు, పదవులు ఇప్పిస్తామని చెప్పడమే కాకుండా చేతనైనంత చేసి పెడ్తున్నారు. 

ప్రతిపక్షాలు, పబ్లిక్​ నుంచి విమర్శలు

హుజూరాబాద్‍లో ఎన్నికల ఇన్​చార్జిలుగా డెవలప్​మెంట్​వర్క్స్, స్కీంల శాంక్షన్, పనులను స్పీడప్​ చేస్తున్న మంత్రులు, ఎమ్మెల్యేలకు ఇప్పుడు కొత్త టెన్షన్​పట్టుకుంది. గత ఆరేడేండ్లుగా వాళ్ల  సొంత నియోజకవర్గాల్లో పబ్లిక్​కు ఇచ్చిన ఎన్నో హామీలు ఇంకా నెరవేరలేదు. ఆయాచోట్ల కీలకమైన ప్రాజెక్టులతో పాటు డబుల్​బెడ్​రూం ఇండ్లు కంప్లీట్​కాలేదు. కల్యాణిలక్ష్మి, సీఎం రిలీఫ్​ఫండ్​ చెక్కులు, గొర్రెల యూనిట్లు, ఉపాధి స్కీముల గ్రౌండింగ్​పనులు పెండింగ్​లో పడ్డాయి. లోకల్‍ ఎమ్మెల్యేలుగా సీఎం నుంచి బడ్జెట్​ తెచ్చి వీటిని కంప్లీట్​చేయడంలో ఫెయిల్​ అయిన వీళ్లంతా ఇప్పుడు హుజూరాబాద్​నియోజకవర్గంలో ఉరికురికి పనులు చేయడంపై విమర్శలు వస్తున్నాయి. ఇప్పటికే ఈ అంశంపై ఆయా నియోజకవర్గాల్లో ప్రతిపక్షాలు, పబ్లిక్‍ ప్రశ్నిస్తున్నారు. ఓట్లు వేసి గెలిపించిన సొంత నియోజకవర్గాల్లోని పట్టణాలు, గ్రామాల అభివృద్ధిని వదిలేసి వేరేచోట జెట్‍ స్పీడ్‍తో పనులు చేయించడమేమిటంటూ సోషల్‍ మీడియాలో పంచ్‍లు వేస్తున్నారు. దీంతో ఎమ్మెల్యేలు ఆలోచనలో పడ్డారు. కేవలం ఎన్నికలున్నచోటే డెవలప్​మెంట్​వర్క్స్, స్కీములు శాంక్షన్​ చేస్తున్న హైకమాండ్​ తీరు వల్ల తాము సొంత నియోజకవర్గ ప్రజలకు సమాధానం చెప్పుకోలేని పరిస్థితి వచ్చిందని తల పట్టుకుంటున్నారు. 

సొంత నియోజకవర్గాల్లో వెక్కిరిస్తున్న పనులు 

మంత్రి గంగుల కమలాకర్ ప్రాతినిధ్యం వహిస్తున్న కరీంనగర్​ నియోజకవర్గంలో1,400 డబుల్ బెడ్ రూం ఇండ్లు మంజూరు కాగా..  ఇప్పటివరకు కేవలం 207 పూర్తయ్యాయి. బీసీ సంక్షేమ శాఖ మంత్రిగా తన ఇలాఖాలోనే కార్పొరేషన్ లోన్లు ఇప్పించుకోలేని దుస్థితి. గత నాలుగేండ్లుగా 2,906 మంది దరఖాస్తు చేసుకుని ఎదురుచూస్తుంటే కేవలం 300 మందికి మాత్రమే నామమాత్రంగా రూ.50 వేలిచ్చి చేతులు దులుపుకొన్నారు. మానేరు తీరంలో డంపింగ్​యార్డు సమస్య పరిష్కారం కావట్లేదు. లోయర్ మానేరు డ్యాంలో  కేసీఆర్ ఐలాండ్ నిర్మాణం, మానేరు రివర్ ఫ్రంట్ అడుగు ముందుకు పడలేదు. హుజూరాబాద్​ రోడ్లను తళతళలాడిస్తామన్న గంగుల, కరీంనగర్ ​రోడ్లను ఎందుకు మెరిపించలేకపోతున్నారని జనం సెటైర్లు వేస్తున్నారు. మంత్రి కొప్పు ల ఈశ్వర్ ప్రాతినిధ్యం వహిస్తున్న ధర్మపురి నియోజకవర్గంలో మేడారం రిజర్వాయర్‍కు తూము ఏర్పాటు, డి83బి కెనాల్​కు అనుసంధానం పనులు పెండింగ్​లో పడ్డాయి. స్తంభం పెల్లి, వెల్గటూర్ లిఫ్ట్ ఇరిగేషన్ నాలుగేళ్ల క్రితం మంజూరైనా పనులు కాలేదు. ధర్మపురి ఆలయం, కోటిలింగాల అభివృద్ధి హామీలకే పరిమితమయ్యాయి. ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్న పరకాలలో సివిల్ హాస్పిటల్‍ను 100 బెడ్ల తో అప్​గ్రేడ్​ చేస్తామని మరిచిపోయారు. కాకతీయ మెగా టెక్స్​టైల్ పార్క్ ఏర్పాటు అటే పోయింది. పరకాల టౌన్​లో ఇప్పటివరకు ఏ ఒక్కరికీ డబుల్ బెడ్ రూమ్ ఇల్లు ఇవ్వలేదు. ఎమ్మెల్యే అరూరి రమేశ్‍ ప్రాతినిధ్యం వహిస్తున్న వర్ధన్నపేటలో  సీహెచ్‍సీ 100 బెడ్లకు అప్‍గ్రేడ్‍ అతీగతీ లేదు. టౌన్‍లో డిగ్రీ కాలేజీ ఏర్పాటు కలగానే మిగిలింది. మున్సిపాలిటీని 30 కోట్లతో డెవలప్ చేస్తామని చెప్పినా.. కేవలం 5 కోట్ల పనులు మాత్రమే చేశారు. ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్‍రెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్న నర్సంపేటకు వెయ్యి డబుల్​ బెడ్​ రూం ఇండ్లు మంజూరైనా ఒక్క ఇంటిని కూడా కట్టలేదు.