వడ్లన్నీ కేంద్రమే కొనాలంటూ  ఊరూరా చావు డప్పు

వడ్లన్నీ కేంద్రమే కొనాలంటూ  ఊరూరా చావు డప్పు
  • కేంద్రం, ప్రధాని మోడీ దిష్టిబొమ్మలకు శవయాత్రలు
  • గజ్వేల్​లో హరీశ్​, మహబూబాబాద్​లో సత్యవతి, 
  • నిర్మల్​లో ఇంద్రకరణ్​, ఖమ్మంలో పువ్వాడ నిరసన
  • దగ్గరుండి నడిపించిన పోలీసులు

(వెలుగు, నెట్​వర్క్​): వడ్లన్నీ కేంద్రమే కొనాలని డిమాండ్​ చేస్తూ సోమ వారం రాష్ట్రవ్యాప్తంగా టీఆర్ఎస్​ లీడర్లు ‘చావు డప్పు’ కొట్టారు. ఊరూరా కేంద్ర ప్రభుత్వంతోపాటు ప్రధాని మోడీ దిష్టిబొమ్మలకు శవయాత్రలు నిర్వహించి, తగులబెట్టారు. మంత్రులు, ఎమ్మెల్యేలు, స్థానిక ప్రజాప్రతినిధులంతా ఆందోళనల్లో పాల్గొని కేంద్రానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ప్రతిపక్షాలు ఎప్పుడైనా సీఎం దిష్టిబొమ్మను తగులబెట్టేందుకు ప్రయత్నిస్తే శక్తివంచన లేకుండా అడ్డుకొనే పోలీసులు.. సోమవారం ప్రధాని దిష్టిబొమ్మల శవయాత్రకు ఎస్కార్ట్​లా ఉండి, వాటిని తగులబెడుతుంటే ఏ మాత్రం అడ్డుకునేందుకు ప్రయత్నించలేదు. కొన్ని చోట్ల టీఆర్ఎస్ ​లీడర్లకు నీళ్లు, చాయ్​, బిస్కెట్లు అందిస్తూ ముచ్చట్లు పెట్టారు. 
 

రైతుల కోసం కేంద్రం ఏం చేసింది?: హరీశ్​


కేంద్రంలోని బీజేపీ రైతు వ్యతిరేక ప్రభుత్వమని మంత్రి హరీశ్​రావు ఆరోపించారు. సిద్దిపేట జిల్లా గజ్వేల్​లో నిర్వహించిన చావుడప్పు కార్యక్రమంలో ఆయన పాల్గొని మాట్లాడారు. రైతుల కోసం కేంద్రం ఏం చేసిందో చెప్పాలని డిమాండ్​ చేశారు. సీఎం కేసీఆర్​రైతులకు 24 గంటల ఉచిత కరెంటు ఇస్తున్నారని,  రైతుబంధు కింద ఖర్చుఇప్పటికే రూ. 50 వేల కోట్లు రైతుల అకౌంట్లలో వేశారని, రూ. 1.5 లక్షల కోట్లు ఇరిగేషన్​ కింద పెట్టి చెరువులు, చెక్ డ్యాంలు దుంకిస్తున్నారని చెప్పారు.  కానీ కేంద్రంలోని బీజేపీ మాత్రం వడ్లు కొనబోమని చెప్పి ఆ నెపాన్ని టీఆర్ఎస్ మీదికి తోసి, రాజకీయంగా లబ్ధి పొందే కుట్ర చేస్తున్నదని ఆరోపించారు. రైతుల కోసం  కేంద్రం ఏం చేసిందో చెప్పాలని, తాము రైతుల కోసం కొంత భరించినప్పుడు కేంద్రం రైస్ ను ఎక్స్ పోర్టు చేయలేదా? అని హరీశ్​ ప్రశ్నించారు.  మహబూబాబాద్​లో చేపట్టిన ఆందోళనలో మంత్రి సత్యవతి రాథోడ్​పాల్గొని డప్పుకొట్టారు. నిర్మల్ మున్సిపాలిటీ నుంచి మంచిర్యాల చౌరస్తా వరకు నిర్వహించిన ర్యాలీలో మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి పాల్గొని.. రైతులు పండించిన వడ్లను కేంద్ర ప్రభుత్వం  మొత్తం  కొనాల్సిందేనని, లేదంటే బీజేపీకి పుట్టగతులుండవని హెచ్చరించారు. ఖమ్మం జిల్లా రఘునాథపాలెంలో జరిగిన ఆందోళన కార్యక్రమంలో మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ పాల్గొని డప్పు కొట్టారు. రైతులకు న్యాయం జరిగే వరకు, వడ్ల కొనుగోళ్లపై కేంద్రం దిగివచ్చే వరకు చావు డప్పు మోగిస్తూనే ఉండాలన్నారు. తర్వాత కేంద్ర ప్రభుత్వ దిష్టి బొమ్మను దహనం చేశారు. మహబూబ్​నగర్​లో నిర్వహించిన ఆందోళనలో మంత్రి శ్రీనివాస్‌‌‌‌‌‌‌‌ గౌడ్‌‌‌‌‌‌‌‌ పాల్గొన్నారు. 
 

అత్యుత్సాహంతో ప్యాంట్​కు నిప్పు

రంగారెడ్డి జిల్లా ఆమనగల్లులో కేంద్ర ప్రభుత్వ దిష్టి బొమ్మను దహనం చేస్తుండగా టీఆర్ఎస్​ లీడర్ల అత్యుత్సాహంతో ఆమనగల్లు మార్కెట్​కమిటీ డైరెక్టర్​రమేశ్ నాయక్​ ప్యాంట్​కు నిప్పంటుకుంది.  వెంటనే మంటలు ఆర్పినా కాలికి గాయాలయ్యాయి. గద్వాల జిల్లా అయిజలోని కొత్త బస్టాండ్ సెంటర్​లో దిష్టిబొమ్మపై పెట్రోల్ పోస్తుండగావెనుక నుంచి ఓ వ్యక్తి అగ్గిపుల్ల విసిరాడు. మంటలు ఎగిసిపడగా.. నేతలంతా పరుగులు తీశారు. 
 

లీడర్లను నిలదీసిన ప్రజలు

పల్లె, పట్టణం తేడా లేకుండా రాష్ట్రవ్యాప్తంగా టీఆర్ఎస్​లీడర్లు రోడ్డెక్కి ఆందోళనలు చేయడంతో పలుచోట్ల ప్రజల నుంచి నిరసన వ్యక్తమైంది. అనేక చోట్ల ట్రాఫిక్​కు అంతరాయం కలగడంతో వాహనదారులు, ప్రయాణికులు మండిపడ్డారు. అధికార పార్టీ ఎమ్మెల్యేలు, లీడర్లే రోడ్లెక్కి పబ్లిక్​కు ఇబ్బందులు కలిగిస్తే ఎట్లా అని ప్రశ్నించారు. నిర్మల్ జిల్లా సారంగాపూర్ మండల కేంద్రంలో టీఆర్​ఎస్​ రాస్తారోకో నిర్వహించగా.. స్టూడెంట్లు, ప్రజలు బస్సు దిగివచ్చారు. ‘‘క్లాసులు నడవకున్నా ఎగ్జామ్స్​ పెట్టి, ఫెయిల్​ చేసి స్టూడెంట్ల ప్రాణాలు తీసింది చాలదా? మళ్లీ ఎందుకు ఆందోళన చేస్తున్నరు..’’ అని లీడర్ల ముఖం మీదే నిలదీశారు. 
 

డప్పులు కొడుతూ.. ర్యాలీగా..!

మెదక్​లో స్థానిక ఎమ్మెల్యే పద్మాదేవేందర్​ రెడ్డి ఆధ్వర్యంలో టీఆర్​ఎస్​ లీటర్లు, కార్యకర్తలు ఎమ్మెల్యే క్యాంప్​ ఆఫీస్​ నుంచి రాందాస్​ చౌరస్తా వరకు ర్యాలీ నిర్వహించి అక్కడ కేంద్ర ప్రభుత్వ దిష్టిబొమ్మ దహనం చేశారు. ఎమ్మెల్యే  చావు డప్పు మోగించారు. సత్తుపల్లి నియోజకవర్గంలోని తల్లాడలో ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య ఆధ్వర్యంలో నల్ల చొక్కాలు ధరించి వడ్ల బస్తాలను మోస్తూ, ఎడ్లబండ్లపై కేంద్ర ప్రభుత్వ దిష్టిబొమ్మలకు శవయాత్ర నిర్వహించారు. నల్గొండ జిల్లా నార్కట్‌‌‌‌‌‌‌‌పల్లిలో నిర్వహించిన ర్యాలీలో శాసనమండలి మాజీ చైర్మన్‌‌‌‌‌‌‌‌, ఎమ్మెల్సీ గుత్తా సుఖేందర్‌‌‌‌‌‌‌‌రెడ్డి పాల్గొన్నారు. దుబ్బాకలో కేంద్ర ప్రభుత్వ  దిష్టిబొమ్మను పాడెపై ఊరేగించి దహనం చేశారు. నిజామాబాద్ సిటీలో చావుడప్పుకు కిరాయి కార్యకర్తలను తెచ్చారు. అనంతరం డబ్బులు పంచుతూ దొరికిపోయారు.
 

టీఆర్​ఎసోళ్లకో లెక్క.. ఇతరులకు మరో లెక్క


రాష్ట్రమంతా 30 పోలీస్ ​యాక్ట్​ అమల్లో ఉన్నందున ప్రజలకు ఇబ్బంది కలిగించేలా ఎవరు ఆందోళన కార్యక్రమాలు చేపట్టినా పోలీసులు అడ్డుకోవాలి. కానీ టీఆర్​ఎస్​ చేపట్టిన చావు డప్పుకు దగ్గరుండి రక్షణ కల్పించి.. ఇతరులు చేపట్టిన నిరసనలకు మాత్రం ఆటంకాలు కల్పించారు. సోమవారం నిజామాబాద్‌‌‌‌‌‌‌‌ జిల్లా కేంద్రంలో టీఆర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఎస్‌‌‌‌‌‌‌‌ లీడర్లు మోడీ దిష్టిబొమ్మను దహనం చేస్తుంటే పోలీసులు నిలబడి చూశారు. మరోవైపు ఇంటర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ స్టూడెంట్ల రీవాల్యుయేషన్​ను ఫ్రీగా చేపట్టాలనే డిమాండ్​తో ఏబీవీపీ లీడర్లు కేసీఆర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ దిష్టిబొమ్మ  దహనానికి ప్రయత్నించగా.. అడ్డుకునేందుకు ప్రయత్నించారు.

ముందు, వెనుక ఎస్కార్ట్​గా..!


ఆదిలాబాద్​లో టీఆర్​ఎస్​ లీడర్లు ప్రధాని మోడీ దిష్టిబొమ్మకు శవయాత్ర నిర్వహించగా.. ముందు, వెనుక పోలీసులు ఎస్కార్ట్ గా ఉన్నారు. పెద్దపల్లి జిల్లా కాల్వ శ్రీరాంపూర్​ మండల కేంద్రంలో టీఆర్ఎస్ లీడర్లు మోడీ దిష్టిబొమ్మను దహనం చేసేందుకు ప్రయత్నించగా.. బీజేపీ నాయకులు అడ్డుకున్నారు. దిష్టిబొమ్మను బీజేపీ ఎంపీటీసీ జనార్దన్​రెడ్డి తీసుకొని వెళ్లిపోయారు. ఆయన వెంట టీఆర్​ఎస్ లీడర్లు ఉరికినా దొరకలేదు. అన్ని చోట్ల ఆందోళన కార్యక్రమాలకు పోలీసులు రక్షణ కల్పించారు. 

మరిన్ని వార్తల కోసం

తాను చనిపోతూ.. ఏడుగురికి పునర్జన్మ
వింత వైరస్.. తైవాన్ జామ రైతులకు నష్టాలు
రాష్ట్రంలో ఒక్కో వ్యక్తిపై రూ.81,944 అప్పు