టీఆర్ఎస్ నేతలకు ఐటీ, ఈడీ దాడుల భయం

టీఆర్ఎస్ నేతలకు ఐటీ, ఈడీ దాడుల భయం

హైదరాబాద్‌‌, వెలుగు: టీఆర్‌‌ఎస్‌‌ నేతలకు ఐటీ, ఈడీ దాడుల భయం పట్టుకుంది. తమ వ్యాపారాలు, ఆర్థిక వ్యవహారాల్లో లొసుగులు ఎక్కడ బయట పడుతాయోనని.. అవి తమ మెడకు ఎక్కడ చుట్టుకుంటాయోనని టెన్షన్ ​పడుతున్నరు. మునుగోడు ఉప ఎన్నికల్లో ఓటర్లను ప్రలోభ పెట్టేందుకు భారీ మొత్తంలో చేసిన ఖర్చుల చిట్టా వెలుగు చూస్తుందని హైరానాకు గురవుతున్నారు. రాష్ట్ర ప్రభుత్వంలోని మంత్రులు, టీఆర్‌‌ఎస్‌‌ ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు సహా కీలక నాయకులు, వాళ్ల కుటుంబ సభ్యులు అనేక వ్యాపారాల్లో ఉన్నారు. తమ వ్యాపారాలకు తోడుగా రియల్‌‌ ఎస్టేట్‌‌ దందాలోనూ భారీగా పెట్టుబడులు పెట్టారు. అధికారాన్ని అడ్డం పెట్టుకొని అడ్డగోలుగా భూములు కొట్టేసి వెంచర్లు వేయడం, భారీ టవర్లు నిర్మించడం లాంటి వ్యాపారాల్లో గులాబీ నేతలు భాగస్వాములుగా ఉన్నారు. ఇప్పుడు ఐటీ, ఈడీ వీళ్ల వ్యాపారాలపై నజర్‌‌ వేయడంతో తమ లోటుపాట్లన్నీ బయట పడుతాయేమోనని టెన్షన్‌‌ పడుతున్నారు. ఇప్పటికే ఇద్దరు మంత్రుల వ్యాపార సంస్థల్లో సోదాలు నిర్వహించారు. ఇంకో మంత్రి కుటుంబ సభ్యులను విచారించారు. ప్రభుత్వంలో అత్యంత కీలక మంత్రితో సన్నిహిత సంబంధాలున్న నిర్మాణ సంస్థపై దాడులు చేశారు. ఢిల్లీ లిక్కర్‌‌ స్కాంలో కవిత సన్నిహితులను అరెస్ట్‌‌ చేశారు. రానున్న రోజుల్లో కనీసం వంద మంది లీడర్ల వ్యాపారాలు, దందాలపై దర్యాప్తు సంస్థలు దాడులు చేసే అవకాశముందన్న హెచ్చరికలతో రేపు ఏం జరుగుతుందోనని ఆందోళనకు గురవుతున్నారు.

ఎంత దాకా వెళ్తుందో..? 

మునుగోడు ఉప ఎన్నికల్లో ఎలాగైన గెలిచి తీరాలని వంద మందికిపైగా ప్రజాప్రతినిధులను అక్కడ మోహరించారు. ఒక్కో ఎంపీటీసీ స్థానానికి మంత్రి, ఎంపీ, ఎమ్మెల్యే, ఎమ్మెల్సీని ఇన్‌‌చార్జీగా నియమించారు. టీఆర్‌‌ఎస్​ను గెలిపించడానికి ఎవరికి వారే కష్టపడి పనిచేయాలని ఆదేశించారు. అక్కడ బీజేపీ ప్రాబల్యం ఎక్కువగా ఉండటంతో టీఆర్‌‌ఎస్‌‌ గెలుపు కోసం పనిచేశారు. అయినా ఓట్లు పడవేమోనన్న అనుమానంతో పలుమార్గాల్లో భారీగా డబ్బు సమీకరించి ఓటర్లను ప్రలోభ పెట్టారు. సంబంధిత లీడర్లకు ఎక్కడెక్కడి నుంచి డబ్బు వచ్చింది.. ఆయా సంస్థల పూర్వాపరాలు ఏమిటి అనే కోణంలోనూ దర్యాప్తు సంస్థలు వివరాలు సేకరిస్తున్నాయి. అలాగే టీఆర్‌‌ఎస్‌‌ లీడర్ల వ్యాపార సంస్థలు భారీగా పన్ను ఎగవేతకు పాల్పడినట్టు సమాచారం సేకరించాయి. రియల్‌‌ ఎస్టేట్‌‌ పెట్టుబడుల్లోనూ అనేక అక్రమాలు చోటు చేసుకున్నట్టు దర్యాప్తు సంస్థలకు సమాచారం అందింది. వాటి ఆధారంగా త్వరలోనే మరికొంత మందిపై దాడులు జరగొచ్చని ప్రచారం జరుగుతోంది. 2014కు ముందు సామాన్యులుగా ఉన్న కొందరు అధికారాన్ని అడ్డు పెట్టుకొని పెద్ద ఎత్తున ఆస్తులు కూడబెట్టారు. అనేక వ్యాపారాల్లో భాగస్వాములుగా ఉన్నారు. ఈ దందాలపైనా దాడులు జరగొచ్చనే సమాచారంతో గులాబీ నేతలు ఆందోళన చెందుతున్నారు. తమ వ్యాపారాల్లో అక్రమాలపై ఫైన్‌‌లు చెల్లించే వరకైతే ఓకేగాని.. విచారణ ఎంతదాకా వెళ్తుందో.. ఎలాంటి పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందో అని ఆందోళన చెందుతున్నారు. దర్యాప్తు సంస్థలు తమవరకు రాకుంటే అదే పదివేలు అని పలువురు లీడర్లు సన్నిహితుల వద్ద వాపోతున్నారు.

లిక్కర్.. గ్రానైట్.. క్యాసినో స్కామ్​లు

మంత్రి గంగుల కమలాకర్‌‌, ఎంపీ వద్దిరాజు రవిచంద్ర కుటుంబ సభ్యులతో పాటు అనేక మంది గ్రానైట్‌‌ వ్యాపారులు ప్రభుత్వానికి చెల్లించాల్సిన ట్యాక్స్‌‌ ఎగ్గొట్టారని ఏండ్లకేండ్లుగా విచారణ సాగుతోంది. ఇటీవల మంత్రి, ఎంపీలతో పాటు వారి సభ్యుల నివాసాల్లో ఈడీ అధికారులు సోదాలు నిర్వహించారు. అక్రమ మార్గాల్లో చైనాకు గ్రానైట్‌‌ ఎగుమతి చేశారని, మనీలాండరింగ్‌‌ జరిగిందని వారిపై ఆరోపణలున్నాయి. మంత్రి మల్లారెడ్డి, ఆయన కుటుంబ సభ్యులకు ప్రైవేట్‌‌ యూనివర్సిటీతో పాటు పలు విద్యా సంస్థలు ఉన్నాయి. వాటిలో అనేక అక్రమాలు జరిగాయనే ఆరోపణలతో ఐటీ అధికారులు మంగళవారం వాళ్ల ఇండ్లల్లో సోదాలు చేసి భారీగా నగదు, పలు డాక్యుమెంట్లు స్వాధీనం చేసుకున్నారు. చీకోటి ప్రవీణ్‌‌ క్యాసినో వ్యవహారంలో మంత్రి తలసాని శ్రీనివాస్‌‌ యాదవ్‌‌ సోదరులతో పాటు ఆయన పీఏను ఈడీ అధికారులు విచారించారు. త్వరలోనే మంత్రి మరికొందరు కుటుంబ సభ్యులనూ విచారణకు పిలిచే అవకాశమున్నట్టు సమాచారం. ఇదే వ్యవహారంలో ఎమ్మెల్సీ ఎల్‌‌.రమణ, మెదక్‌‌ డీసీసీబీ అధ్యక్షుడు చిట్టి దేవేందర్‌‌రెడ్డిని విచారించారు. రాష్ట్ర ప్రభుత్వంలో అత్యంత కీలక మంత్రికి సన్నిహిత సంస్థగా చెప్పే ఫీనిక్స్‌‌పైనా దాడులు నిర్వహించారు. ఢిల్లీ లిక్కర్‌‌ స్కాంలో ఎమ్మెల్సీ కవిత సన్నిహితులను అరెస్ట్‌‌ చేశారు. ఈ కేసులో దర్యాప్తు సంస్థ తనను ఎప్పుడు విచారణకు పిలిచినా సహకరిస్తానని కవిత తెలిపారు.