బండి సంజయ్ ప్రసంగాన్ని అడ్డుకున్న టీఆర్ఎస్ నేతలు

బండి సంజయ్ ప్రసంగాన్ని అడ్డుకున్న టీఆర్ఎస్ నేతలు

బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ప్రజా సంగ్రామ యాత్రలో ఉద్రిక్తత నెలకొంది. పాదయాత్రలో భాగంగా బండి సంజయ్ ప్రసంగిస్తుండగా టీఆర్ఎస్ నాయకుడు ఒకరు అభ్యంతరం వ్యక్తం చేయడంతో ఇరు వర్గాల మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. తెలంగాణలో టీఆర్ఎస్ ప్రభుత్వం ఎన్ని ఉద్యోగాలు ఇచ్చిందని బండి సంజయ్ ప్రశ్నించిగా... దేశంలో ఎన్ని ఉద్యోగాలు కల్పించారని టీఆర్ఎస్ నాయకుడు బండి సంజయ్ ని నిలదీశారు . ఈ క్రమంలోనే బీజేపీ నాయకులపైకి టీఆర్ఎస్ నాయకులు రాళ్ళ దాడి చేశారు. వాగ్వాదానికి దిగిన టీఆర్ఎస్ నాయకులు బీజేపీకి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. అయితే ఈ సందర్భంలోనే సీపీ ఏం చేస్తున్నాడంటూ బండి సంజయ్ సీరియస్ అయ్యారు. ఇంటెలిజెన్స్ వాళ్ళకు తమ పాదయాత్ర గురించి తెలుసు కదా... పోలీసులు ఎందుకిలా వ్యవహరిస్తున్నారని ప్రశ్నించారు. దమ్ముంటే సీఎం కేసీఆర్ రాష్ట్రంలో పాదయాత్ర చేయాలని బండి సంజయ్ ఈ మేరకు ముఖ్యమంత్రికి సవాల్ విసిరారు. ఈ క్రమంలోనే సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు ఆందోళనకారులను చెదర గొట్టారు.

లా అండ్ ఆర్డర్ చేతకాని సీపీ ఇంట్లో కూర్చో

దేవరుప్పులలో జరిపిన టీఆర్ఎస్ గూండాల దాడిలో పలువురు బీజేపీ కార్యకర్తలకు తీవ్ర గాయాలయ్యాయి. ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ లో రాళ్లు విసిరినా.. పోలీసులు చూసీ చూడనట్టు వ్యవహరించడంతో పోలీస్ కమిషనర్ తీరుపై బండి సంజయ్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. బీజేపీ కార్యకర్తలపైనే పోలీసులు లాఠీఛార్జ్ చేశారన్న ఆయన... లా అండ్ ఆర్డర్ చేతకాని సీపీ ఇంట్లో కూర్చో అని మండిపడ్డారు. ఈ క్రమంలో డీజీపీతోనే బండి సంజయ్  నేరుగా ఫోన్లో మాట్లాడారు. బీజేపీ కార్యకర్తల తలల పగలకొడుతుంటే పోలీసులు ఏం చేస్తున్నారంటూ నిప్పులు చెరిగారు. పోలీసులకు జీతాలు కేసీఆర్ జేబుల్లోంచి ఇస్తున్నారా? అని ప్రశ్నించారు. కేసీఆర్ ఉండేది ఇంకో 6 నెలలేనని... తక్షణమే పాదయాత్ర ప్రశాంతంగా కొనసాగేలా చూడండని బండి సంజయ్ డిమాండ్ చేశారు. లేనిపక్షంలో జరగబోయే పరిణామాలకు పోలీసులే బాధ్యత వహించాల్సి ఉంటుందన్నారు. వెంటనే స్పందించాల్సిందేన్న ఆయన.... లేనిపక్షంలో గాయపడ్డ కార్యకర్తలను తీసుకుని మీ వద్దకొస్తానని.. బండి సంజయ్ డీజీపీకి డెడ్ లైన్ పెట్టారు. కాగా ఈ ఘటన అనంతరం బండి సంజయ్ పాదయాత్ర యథావిధిగా కొనసాగింది.

బండి సంజయ్ ప్రజా సంగ్రామ యాత్ర 13వ రోజుకు చేరుకున్న నేపథ్యంలో వాగ్వాదానికి ముందు దేవరుప్పల బీజేపీ శ్రేణులు బాణాసంచా కాలుస్తూ స్వాగతం పలికారు. డప్పు వాయిద్యాలు, కళాకారుల నృత్యాలతో బండి సంజయ్ పాదయాత్రకు యువకులు నీరాజనం పలికారు. గ్రామంలోని ఆడపడుచులు బండి సంజయ్ కి హారతి పట్టి స్వాగతం చెప్పారు. కాగా, దేవరుప్పుల నుండి దేవరుప్పుల తండా, ధర్మపురం మీదుగా మైలారం శివారు వరకు నేడు బండి సంజయ్ పాదయాత్ర చేయనున్నట్టు సమాచారం.