పింఛన్లు..  ఇండ్లు.. రేషన్ కార్డులు.. ఏమడిగినా ఇస్తం

పింఛన్లు..  ఇండ్లు.. రేషన్ కార్డులు.. ఏమడిగినా ఇస్తం
  • హుజూరాబాద్​ జనానికి టీఆర్​ఎస్​ లీడర్ల ఆఫర్లు
  • ఊర్లన్నీ చుట్టేస్తున్న మంత్రులు, ఎమ్మెల్యేలు, ఇతర లీడర్లు
  • కులాలు, వర్గాల వారీగా మీటింగులు, సమ్మేళనాలు
  • హుజూరాబాద్​లో అధికారపార్టీ హడావుడి

కరీంనగర్, వెలుగు: త్వరలో జరగనున్న హుజూరాబాద్ ఉప ఎన్నికలో ఎలాగైనా గెలవాలని భావిస్తున్న టీఆర్ఎస్.. అప్పుడే ప్రచారం మొదలుపెట్టింది. మండలానికో ఇన్​చార్జ్‌‌ని పెట్టి, మంత్రులను, ఎమ్మెల్యేలను రంగంలోకి దింపి, హామీల వరద పారిస్తోంది. హైకమాండ్ సూచనలతో నియోజకవర్గంలో పర్యటిస్తున్న నేతలు ‘టీఆర్ఎస్​పార్టీ కుటుంబసభ్యుల ఆత్మీయ సమ్మేళనాల’ పేరిట ఊరూరా పబ్లిక్​ మీటింగులు పెడుతున్నారు. కరోనా రూల్స్ కూడా పట్టించుకోకుండా వందల మందిని ఒకచోట కూర్చోబెట్టి, ‘కొత్త రేషన్ ​కార్డులు కావాలా? కొత్త పెన్షన్లు కావాలా? డబుల్ బెడ్​రూం ఇండ్లు కావాలా? కార్పొరేషన్ లోన్లు కావాలా? కమ్యూనిటీ బిల్డింగులు కావాలా? ఏం కావాలో చెప్పండి. ఏమడిగినా ఇస్తం’ అంటూ ఆశపెడుతున్నారు. గొల్లకుర్మలకు గొర్రెల యూనిట్లు, రజకులకు దోబీ ఘాట్లు, నాయీ బ్రాహ్మణులకు సెలూన్లు ఇస్తామని  హామీలిస్తున్నారు. ఎన్నికల నోటిఫికేషన్ రాకముందే ప్రచారం ఇంతలా ఉంటే.. రానున్న రోజుల్లో ఎలా ఉంటుందోనని జనం అంటున్నారు. గతంలో ఎప్పుడూ కనిపించని లీడర్లు వచ్చి, ‘మీకు మేమున్నం.. ఏది కావల్నంటే అది చేస్తం’ అని చెబుతుండడంతో ఆశ్చర్యంగా చూస్తున్నారు.

హుజూరాబాద్ సెగ్మెంట్‌‌లో టీఆర్ఎస్​ లీడర్లు చేస్తున్న హడావుడి చూస్తే అప్పుడే ఎన్నికలు వచ్చాయేమో అనిపిస్తుంది. నియోజకవర్గంలోని మండలాలకు ఇన్​చార్జ్‌‌‌‌లను కూడా పార్టీ హైకమాండ్ నియమించింది. హుజూరాబాద్ మండలానికి ఎమ్మెల్యే వొడితెల సతీశ్ బాబు, కరీంనగర్​ మేయర్ సునీల్ రావు, జమ్మికుంట మండలానికి ఎమ్మెల్యే ఆరూరి రమేశ్, వీణవంక మండలానికి ఎమ్మెల్సీ నారదాసు లక్ష్మణరావు, కమలాపూర్ మండలానికి పరకాల ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి, ఇల్లందకుంట మండలానికి ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్ రెడ్డిని ఇన్​చార్జ్‌‌‌‌లుగా వేశారు. కరీంనగర్ జిల్లాలోని 4 మండలాలను కో ఆర్డినేట్ చేసే బాధ్యతను ఉమ్మడి కరీంనగర్​జిల్లా మంత్రులు గంగుల కమలాకర్, కొప్పుల ఈశ్వర్ కు అప్పగించారు. వరంగల్ అర్బన్ జిల్లాలోని కమలాపూర్ మండలాన్ని కో ఆర్డినేట్ చేసే బాధ్యతను మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావుకు కట్టబెట్టారు. నర్సంపేట ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి, ఎమ్మెల్సీ బస్వరాజు సారయ్య అన్ని మండలాలకు అతిథులుగా వెళ్తున్నారు.

ఏం కావాలో చెప్పున్రి
ఎన్నడూ హుజూరాబాద్ వైపు కన్నెత్తి చూడని మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు రోజూ ఐదు నుంచి ఆరుగ్రామాల్లో తిరుగుతూ పబ్లిక్​ మీటింగ్ లు పెడుతున్నారు. ఆత్మీయ సమ్మేళనాల పేరిట ఆర్ఎంపీలు, కిరాణ దుకాణ నిర్వాహకులు, ఐకేపీ మహిళలు, ఆటోవాలాలు.. అందరినీ వర్గాలవారీగా, కులాలవారీగా వందల మందిని గ్యాదర్​ చేసి ‘మీ సమస్యలేంటో చెప్పండి’ అంటూ లిస్టు రెడీ చేస్తున్నారు. వారం, పదిరోజుల్లో సమస్యలు పరిష్కరిస్తామని హామీ ఇస్తున్నారు. తమకు డబుల్ బెడ్ రూం ఇండ్లు, కొత్త పెన్షన్లు, రేషన్​కార్డులు రావడం లేదని స్థానికులు చెప్పగానే.. ‘‘ఇండ్లు, పింఛన్లు, కార్డులు అన్నీ వస్తయి.. ఇప్పించే బాధ్యత మాది. కానీ మీరు మాత్రం టీఆర్ఎస్​అభ్యర్థికి ఓటేసి గెలిపించాలి’’ అని అడుగుతున్నారు. ‘‘కొత్త ఎమ్మెల్యే వచ్చేదాక మేమే మీ ఎమ్మెల్యేలం అనుకోండి. మీకు ఏం కావాలో కోరుకోండి’ అని వాగ్దానాలు చేస్తున్నారు. మంత్రి గంగుల కమలాకర్ ఈ విషయంలో ఓ అడుగు ముందుకేసి ఓటర్లను దాదాపు బెదిరించినంత పనిచేస్తున్నారు. సోమవారం జమ్మికుంట ఎంపీఆర్ గార్డెన్ లో మాట్లాడుతూ.. రాష్ట్రంలో అమలవుతున్న సంక్షేమ పథకాలు హుజూరాబాద్ నియోజకవర్గంలో  కొనసాగించాలంటే టీఆర్ఎస్​ను గెలిపించాల్సిందేనని హెచ్చరించారు.

అకౌంట్లలో రైతుబంధు.. సెంటర్లలో సీఎం ఫ్లెక్సీలు
రైతుబంధు కింద రైతుల ఖాతాల్లో సోమవారం పైసలు జమయ్యాయి. తెల్లారే సరికే హుజూరాబాద్ సెంటర్ లో పెద్ద పెద్ద ఫ్లెక్సీలు వెలిశాయి. ‘కేసీఆర్ పాలనలో రైతుబంధు సాయం: ఏడాదికి ఎకరానికి రూ.10వేలు’ అని రాసి ఉన్న ఈ ఫ్లెక్సీల్లో దాదాపు 40 శాతం సీఎం ఫొటోనే ఉంది. ఆ పక్కనే.. ‘హుజూరాబాద్ అభివృద్ధికి టీఆర్ఎస్​కి ఓటేయండి’ అని రాసి ఉంది. దీనికి తోడు ఏ గోడను చూసినా ‘రైతుబంధు పాలన కావాలి.. రాబందుల పాలన వద్దు’ అనే రైటింగులు కనిపిస్తున్నాయి. టీఆర్ఎస్ ప్రభుత్వ పథకాలైన కల్యాణలక్ష్మి, షాదీముబారక్ కింద అందిస్తున్న ఆర్థిక సాయం గురించి కూడా రాయిస్తున్నారు. ‘హుజూరాబాద్ ఉడుం పట్టు-.. అవినీతి పరుల ఆటకట్టు’ అనే రైటింగ్స్ తో గోడలు నిండిపోతున్నాయి.

తెరమీదికి మానేరు రివర్ ఫ్రంట్
కీలకమైన మానేరు రివర్ ​ఫ్రంట్​ను ప్రభుత్వం ఆరేండ్లుగా పక్కనపెట్టింది. హుజూరాబాద్ ఉప ఎన్నిక తెరమీదికి రాగానే.. ఆ ప్రాజెక్టు ఫైలు దుమ్ము దులిపింది. మానేరు నది సుందరీకరణ, నాలుగు కిలోమీటర్ల మేరకు రిటైనింగ్ వాల్ నిర్మాణానికి రూ.310 కోట్లు విడుదల చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. 

ఆపరేషన్ ఆకర్ష్ మరింత జోరుగా..
ఈటలను మంత్రివర్గం నుంచి బర్తరఫ్ చేసింది మొదలు ఇప్పటిదాకా హుజూరాబాద్‌‌లో టీఆర్ఎస్​ఆపరేషన్ ఆకర్ష్ కొనసాగుతూనే ఉంది. దీనికి మంత్రి గంగుల కమలాకర్ నేతృత్వం వహించారు. గతంలో ఈటల వెంట ఉన్న ఎంపీపీలు, జడ్పీటీసీలు, ఎంపీటీసీలు, సర్పంచులు, మున్సిపల్ చైర్మన్లు, వైస్ చైర్మన్లు, కౌన్సిలర్లు.. ఇలా అందరినీ కరీంనగర్​లోని తన క్యాంపు కార్యాలయానికి పిలిపించుకొని మాట్లాడారు. కమలాపూర్ మండలానికి చెందిన నేతలతో మంత్రి ఎర్రబెల్లి, ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి మంతనాలు సాగించారు. ఈ క్రమంలోనే ప్రజాప్రతినిధులను కొనుగోలు చేశారనే విమర్శలు వచ్చాయి. సర్పంచ్, ఎంపీటీసీలకు రూ.3 నుంచి రూ.5లక్షలు, అంతకంటే పెద్ద ప్రజాప్రతినిధులకు స్థాయిని బట్టి ఒక్కొక్కరికి రూ.10 లక్షలు ఆపైన ముట్టజెప్పారనే ఆరోపణలు వినిపించాయి. ఇందుకు సంబంధించిన ఆడియో క్లిప్పింగులు కూడా బయటపడ్డాయి.