కూసుకుంట్లకు తప్ప ఎవ్వరికైనా టిక్కెట్ ఇవ్వండి

కూసుకుంట్లకు తప్ప ఎవ్వరికైనా టిక్కెట్ ఇవ్వండి

యాదాద్రి భువనగిరి : యాదాద్రి భువనగిరి : మునుగోడు ఉప ఎన్నిక టీఆర్ఎస్లో కలకలం రేపింది. పార్టీ అభ్యర్థిగా కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డిని బరిలో దింపుతారన్న సంకేతాలు స్థానిక నేతల్లో ఆందోళన కలిగిస్తోంది. ఈ నేపథ్యంలో మునుగోడుకు చెందిన టీఆర్ఎస్ నాయకులు చౌటుప్పల్లో రహస్యంగా భేటీ అయ్యారు. దండు మల్కాపూర్లోని ఆందోల్ మైసమ్మ దేవాలయం వద్ద ఉన్న ఫంక్షన్ హాల్ లో జరుగుతున్న సమావేశానికి నియోజకవర్గంలోని అన్ని మండలాలకు చెందిన 300 మంది నాయకులు హాజరయ్యారు. మాజీ ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డికి టికెట్ కేటాయించవద్దని వారంతా తీర్మానం చేశారు. ఆయనకు తప్ప టికెట్ ఎవరికైనా ఇవ్వాలని వారు డిమాండ్ చేస్తున్నారు. టీఆర్ఎస్ లో అసంతృప్తులు ఎవరూ లేరు కేవలం ఆశావహులు మాత్రమే ఉన్నారని మంత్రి జగదీశ్ రెడ్డి చెప్పిన గంటల వ్యవధిలోనే నేతలు ఈ నిర్ణయం తీసుకోవడం విశేషం.

మునుగోడు నియోజకవర్గానికి చెందిన 90శాతం మంది టీఆర్ఎస్ నేతలు కూసుకుంట్ల అభ్యర్థిత్వాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నట్లు తెలుస్తోంది. మెజార్టీ జెడ్పీటీసీలు, ఎంపీటీసీలు ఆయనకు టికెట్ ఇవ్వవద్దని డిమాండ్ చేస్తున్నారు. మంత్రి జగదీశ్ రెడ్డికి సన్నిహితుడు కావడంతో ఆయన సూచన మేరకు సీఎం కేసీఆర్ కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి టికెట్ ఇచ్చేందుకు సిద్ధమైనట్లు తెలుస్తోంది.  ఈ నెల 20న టీఆర్ఎస్ తలపెట్టిన బహిరంగ సభకు అనువైన స్థలం ఎంపిక కోసం మంత్రి జగదీశ్ రెడ్డితో పాటు కూసుకుంట్ల వెళ్లారు. ఈ నేపథ్యంలో స్థానిక టీఆర్ఎస్ నేతల తీర్మానం మంత్రి జగదీశ్ రెడ్డికి తలనొప్పిగా మారింది.