బడ్జెట్లో తెలంగాణపై వివక్ష

బడ్జెట్లో తెలంగాణపై వివక్ష

న్యూఢిల్లీ: కేంద్ర ప్రభుత్వం ఇవాళ ప్రవేశ పెట్టిన బడ్జెట్ తనను పూర్తిగా నిరుత్సాహ పర్చిందని టీఆర్ఎస్ ఎంపీ కె.కేశవరావు అన్నారు. తెలంగాణ విషయంలో కేంద్రం పూర్తిగా వివక్ష ధోరణిని ప్రదర్శిస్తోందన్నారు. విభజన చట్టం ప్రకారం రాష్ట్రానికి రావాల్సిన కేటాయింపులు కూడా చేయడం లేదన్నారు. ద్రవ్యోల్బణం ఇంత ఎక్కువగా ఉన్నా.. దాన్ని ఎదుర్కొనే అంశం గురించి ప్రస్తావనే లేదన్నారు. కొవిడ్ కొత్త వేరియంట్లతో భయాందోళనలు నెలకొన్న నేపథ్యంలో ఆరోగ్య రంగానికి చేసిన కేటాయింపులు ఏం సరిపోతాయని ప్రశ్నించారు. నిరుపేద, నిరుద్యోగ సమస్యలను ఎలా ఎదుర్కొంటారో చెప్పలేదన్నారు. గ్రామీణ ఉపాధి హామీ పథకం ద్వారా గ్రామీణ ఆర్థిక వ్యవస్థ నిలబడిందని.. కానీ అలాంటి పథకానికి 25% కేటాయింపులు తగ్గించారన్నారు. ఇది సరికాదని మండిపడ్డారు. గ్రామీణాభివృద్ధి శాఖకూ కేటాయింపులు తగ్గాయని.. గ్రామీణ ఉపాధి హామీ పథకం తరహాలో పట్టణాల్లోనూ ఉపాధి కల్పించే కొత్త పథకం అవసరమని కేసీఆర్ చెప్పారని కేకే గుర్తు చేశారు. 

నిరుద్యోగ సమస్యపై ప్రస్తావనేదీ?

‘పట్టణ పేదలు, నిరుద్యోగుల సమస్యలను పరిష్కరించడంపై పద్దులో ఎలాంటి ప్రస్తావన లేదు. ఇది వ్యవసాయ, నిరుపేద పక్షపాత బడ్జెట్ అని ప్రధాని అంటున్నారు.. కానీ వ్యవసాయానికి అతి స్వల్పంగా కేటాయింపులు పెంచారు తప్ప ఇంకేమీ లేదు. ఎస్సీ, ఎస్టీ, మైనారిటీల కోసం ఎలాంటి కొత్త పథకాలు లేవు. కొన్ని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ పథకాలను కాపీ చేసి ఈ బడ్జెట్ లో పొందుపరిచారు. ఎక్కడైనా రిజిస్ట్రేషన్ అనేది తెలంగాణ నుంచి కాపీ చేసిందే. డిజిటల్ అసెట్స్ మీద 30 శాతం  పన్ను వేశారు. అంటే క్రిప్టోకరెన్సీని లీగలైజ్ చేస్తున్నారా’ అని కేకే క్వశ్చన్ చేశారు. 

రాష్ట్రానికి ఐఐఎం ఇవ్వాలె

విభజన చట్టం ప్రకారం రాష్ట్రానికి రావాల్సిన ఐఐఎం అంశాన్ని కేకే లేవనెత్తారు. ‘విభజన చట్టంలో పెట్టిన ఐఐఎం ఇవ్వాలి కదా? జల వివాదాల పరిష్కారానికి ఏర్పాటు చేయాల్సిన ట్రిబ్యునల్ సంగతి ఏమైంది? కార్పొరేట్ సెక్టార్ కు కొంత ప్రయోజనం కలిగేలా చేశారు. అయినా ఆ విభాగం సంతృప్తిగా లేదు. మౌలిక వసతుల కల్పన కోసం కేటాయించిన బడ్జెట్ లో పెద్దగా తేడా ఏమీ లేదు. మసిపూసి మారేడుకాయ తరహాలో ఈ బడ్జెట్ ను ప్రవేశపెట్టారు. తెలంగాణ విషయంలో పూర్తి వివక్షను ప్రదర్శిస్తున్నారు. మనల్ని శత్రువులా చూస్తున్నారు. లాభాల్లో ఉన్న ఎల్ఐసీ సంస్థను ప్రైవేటీకరణ చేస్తున్నారు. ఇది దారుణం’ అని కేంద్ర బడ్జెట్ పై కేశవరావు మండిపడ్డారు. 

మరిన్ని వార్తల కోసం:

బడ్జెట్ ఎఫెక్ట్: పెట్రోల్ రేట్లు తగ్గే చాన్స్!

మొబైల్ కొనుగోలుదారులకు కేంద్రం గుడ్న్యూస్

ఏపీ తెలంగాణ ఒప్పుకుంటే నదుల అనుసంధాన పనులు