నల్ల చొక్కాలతో పార్లమెంటుకొచ్చిన టీఆర్ఎస్ ఎంపీలు

నల్ల చొక్కాలతో పార్లమెంటుకొచ్చిన టీఆర్ఎస్ ఎంపీలు

కేంద్రం తీరుకు నిరసనగా టీఆర్ఎస్ ఎంపీలు పార్లమెంట్ సమావేశాలను బహిష్కరించారు. కేంద్రం తీరుకు నిరసనగా టీఆర్ఎస్ ఎంపీలందరూ నల్లచొక్కాలు ధరించి పార్లమెంటుకు హాజరయ్యారు. రైతు సమస్యలపై ప్రశ్నిస్తే కేంద్రం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని టీఆర్ఎస్ పార్లమెంటరీ పక్ష నేత, రాజ్యసభ సభ్యులు కే. కేశవరావు అన్నారు. ‘కేంద్రం ప్రజావ్యతిరేక విధానాలను అవలంభిస్తోంది. రైతులను కేంద్రం అయోమయానికి గురిచేస్తోంది. ధాన్యం కొనుగోళ్లపై కేంద్రం స్పష్టమైన జాతీయ విధానంతో పాటు ఎంఎస్పీని ప్రకటించాలి. ఆ ఎంఎస్పీకి చట్టబద్ధత కల్పించాలి. తదుపరి కార్యచరణను త్వరలోనే ప్రకటిస్తాం. బీజేపీ కుట్రలను ప్రజల్లోకి తీసుకెళ్తాం. ఏడు రోజులుగా ఆందోళన చేస్తుంటే పట్టించుకోవడంలేదు’ అని కేశవరావు అన్నారు.

యాసంగిలో ధాన్యం కొనుగోళ్ల పై సభలో కేంద్రం ప్రకటన చేయాలని డిమాండ్ చేస్తూ ఇన్ని రోజులు ఆందోళన చేశారు టీఆర్ఎస్ ఎంపీలు. ఈ నెల 23 వరకు పార్లమెంట్ సమావేశాలు ఉన్నాయి. ఐతే ఉన్న పళంగా ఇవాళ సెషన్ ను బహిష్కరిస్తున్నట్టు ప్రకటించి బయటకు వచ్చారు గులాబీ పార్టీ ఎంపీలు. మరోవైపు రాష్ట్రంలో యాసంగిలో వరి వేయోద్దని.... ఒకవేళ కాదు లేదని ధాన్యం పండించినా రాష్ట్ర ప్రభుత్వం కొనదని ప్రకటించారు వ్యవసాయశాఖ మంత్రి నిరంజన్ రెడ్డి. మరోవైపు యాసంగిలో బాయిల్డ్ రైస్ కాకుండా రా రైస్ ఎంతైనా కొంటామని స్వయంగా పార్లమెంట్ లో ప్రకటించారు కేంద్ర మంత్రి పీయూశ్ గోయల్. ఈ పరిస్థితుల్లో టీఆర్ఎస్ ఎంపీల బై కాట్ నిర్ణయం హాట్ టాఫిక్ అయ్యింది.