
- హుజూరాబాద్‌లో బేరసారాలు
- ఈటల అనుచరులపై టీఆర్ఎస్ ఆపరేషన్ ఆకర్ష్
- సర్పంచులు, జడ్పీటీసీలకు రూలింగ్ పార్టీ నజరానాలు
- మండలానికో ఇన్చార్జిని పెట్టి ప్రలోభాలకు తెరలేపిన హైకమాండ్
- సర్పంచులకు రూ.3 లక్షల నుంచి 10 లక్షల వరకు క్యాష్
- ముఖ్య నాయకులకు బహుమతిగా ఇన్నోవా వెహికల్స్
- వైరల్ అవుతున్న టీఆర్ఎస్ లీడర్ల ఆడియో క్లిప్
‘డబ్బులిచ్చి అందరిని కొంటున్నరు.. సర్పంచులకు 3 లక్షలు, ఎంపీటీసీలకు రూ. 4 లక్షలు ఇస్తున్నరు.. డైరెక్టుగా క్యాష్ ఇస్తున్నరు.. నియోజకవర్గం మొత్తానికి కలిపి రూ. 100 కోట్ల వరకు ఖర్చు పెడుతున్నరు.. ఈ రాజకీయం చూస్తుంటే గలీజ్ అనిపిస్తుంది.. చిల్లర వేషాలు.. గొడ్లను కొన్నట్లే కొంటున్నరు.. విలువల్లేని రాజకీయాలు అయినయ్.. అంతా వన్ సైడ్ ఉండాలని కొంటున్నరు.. ఇప్పుడు వీళ్ల దగ్గర పైసలు తీసుకున్నా.. ఈటల వైపు చేరరని నమ్మలేము.. కేసీఆర్ కూడా ఇట్ల చేయొద్దు.. ఇలాంటివి చూస్తుంటే రాజకీయాలు ఎందుకు అనిపిస్తుంది.’
- హుజూరాబాద్ నియోజకవర్గంలోని ఓ ప్రజాప్రతినిధి మరొక లీడర్‌తో ఫోన్లో మాట్లాడిన సంభాషణ ఇదీ.
కరీంనగర్, వెలుగు: మంత్రివర్గం నుంచి ఈటల రాజేందర్ ను బర్తరఫ్ చేసినప్పటి నుంచి హుజూరాబాద్నియోజకవర్గంలో రాజకీయాలు రోజుకో మలుపు తిరుగుతున్నాయి. మొదట ఆఫీసర్లను బదిలీ చేశారు. ఆ తర్వాత లోకల్టీఆర్ఎస్ప్రజాప్రతినిధులు, నేతలు తమ వెంటే ఉన్నారని చెప్పుకొనేందుకు ఆ పార్టీ పెద్ద లీడర్లు నానా తంటాలు పడుతున్నారు. మంత్రి గంగుల కమలాకర్ హుజూరాబాద్‌కు చెందిన చిన్న పెద్ద నేతలతో తన క్యాంపు ఆఫీస్ లో పలుసార్లు చర్చలు జరిపారు. వెంటనే వారంతా తమ ఏరియాల్లో ప్రెస్మీట్లు పెట్టి ఈటల రాజేందర్ కు వ్యతిరేకంగా.. కేసీఆర్ కు అనుకూలంగా మాట్లాడారు. రూలింగ్పార్టీ లీడర్లు ఎవరూ ఈటలతో లేరని, ఆయన ఒంటరి అని చెప్పడానికి టీఆర్ఎస్ నేతలు వేసిన స్కెచ్‌లో భాగంగా ఈ ప్రెస్ మీట్ల వ్యవహారం నడుస్తోంది. ఇక నాలుగైదు రోజుల నుంచి మండల, గ్రామస్థాయి లీడర్లను తమ వైపు తిప్పుకొనేందుకు టీఆర్ఎస్ లీడర్లు పైసలు వెదజల్లుతున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి.
పతారను బట్టి ప్యాకేజీలు
ఈటల రాజేందర్తన ఎమ్మెల్యే పదవికి ఇప్పట్లో రాజీనామా చేయనని చెబుతున్నారు. కానీ దమ్ముంటే ఆయన రాజీనామా చేసి ఎన్నికల బరిల దిగాలని మంత్రి గంగుల కమలాకర్సహా టీఆర్ఎస్ లీడర్లు ప్రెస్మీట్లు పెట్టి మరీ రెచ్చగొడుతున్నారు. ఎన్నికలు వస్తే ఎదుర్కొనేందుకు గ్రౌండ్ప్రిపేర్ చేసుకుంటున్నారు. ఇప్పటికే టీఆర్ఎస్హైకమాండ్, హుజూరాబాద్ నియోజకవర్గంలోని అన్ని మండలాలకు పార్టీ ఇన్ చార్జిలను నియమించింది. ఈ ఇన్ చార్జిలు మండలంలోని సర్పంచులు, ఎంపీటీసీలు, ఎంపీపీ, జడ్పీటీసీల మీద, జమ్మికుంట, హుజురాబాద్ మున్సిపాలిటీల్లోని చైర్మన్లు, కౌన్సిలర్ల మీద ఫోకస్పెడుతున్నారు. వాళ్లలో చాలామంది ఈటల అనుచరులే కావడంతో తమవైపు తిప్పుకొనేందుకు పైసలు ఎర వేస్తున్నారు. పబ్లిక్‌లో ఉన్న పతారను బట్టి నజరానాలు డిసైడ్ చేస్తున్నారు. ఇన్ చార్జిలు లోకల్ లీడర్లతో నేరుగా మాట్లాడుతున్నారు. డెవలప్మెంట్ఫండ్స్ఇస్తామనో.. రాజకీయ భవిష్యత్తుకు భరోసా ఇస్తామనో చెప్తే ఈ పరిస్థితుల్లో వర్కవుట్ కాదని తెలిసి.. డైరెక్ట్‌గా క్యాష్ చేతిలో పెడుతున్నారు. సర్పంచులకు, ఎంపీటీసీలకు రూ. 3 లక్షల నుంచి 10 లక్షల వరకు ఆఫర్ ఇస్తున్నారు. జడ్పీటీసీ, ఎంపీపీలకు రూ. 20 లక్షల పైనే ప్యాకేజీలు ఉన్నాయి. కౌన్సిలర్లకు రూ. 5 లక్షలు వరకు ఇస్తున్నట్టు సమాచారం. కొందరు ముఖ్యనాయకులకు ఇన్నోవా వెహికల్స్నజరానాగా ఇస్తున్నట్టు పార్టీ వర్గాల్లో చర్చ నడుస్తోంది. ఉమ్మడి వరంగల్జిల్లాకు చెందిన ఒక బడా లీడర్ఆధీనంలో ఉన్న వెహికల్స్‌ను త్వరలోనే నియోజకవర్గ లీడర్లకు అందించనున్నట్టు చెప్తున్నారు. మొత్తానికి నియోజకవర్గంలోని ఈటల అనుచరులందరితో కేసీఆర్‌కు జై కొట్టిచ్చేందుకు రూ.100 కోట్ల ఖర్చు కైనా పార్టీ వెనుకాడడం లేదని పార్టీ నేతల మాటలను బట్టి తెలుస్తోంది.
కేడర్ ఎటువైపు?
స్థానిక ప్రజాప్రతినిధులను వారి వైపు లాక్కోవడం మీద దృష్టి పెట్టిన టీఆర్ఎస్హైకమాండ్పబ్లిక్పల్స్ పట్టించుకోవడం లేదు. లీడర్లు ప్రలోభాల వల్లనో.. భయం వల్లనో టీఆర్ఎస్తోనే ఉంటామని చెప్తున్నా ప్రజల్లో మాత్రం రూలింగ్పార్టీ మీద వ్యతిరేకత వ్యక్తమవుతోంది. చాలాచోట్ల టీఆర్ఎస్కిందిస్థాయి కేడర్ఈటలకే సపోర్ట్చేస్తున్నది. వీణవంక జడ్పీటీసీ తాము కేసీఆర్ వెంట ఉంటామని కరీంనగర్లో ప్రకటించిన వెంటనే వారి స్వగ్రామం ఎలబాకలో కేడర్, ఊరి ప్రజలు సంబరాలు చేసుకున్నారు. ఈటల వెంట ఉన్న దరిద్రం పోయిందని కామెంట్చేయడమే ఇందుకు నిదర్శనం అని ఈటల అభిమానులు చెబుతున్నారు.
నయానా.. భయానా..
దాదాపు 15 ఏండ్లకు పైగా హుజూరాబాద్నియోజకవర్గంలోని టీఆర్ఎస్ లీడర్లు, క్యాడర్‌తో ఈటల రాజేందర్ కు ప్రత్యేక అనుబంధం ఉంది. ఒక్కసారిగా ఆయనను వదిలి వెళ్లేందుకు చాలామంది నాయకులు ససేమిరా అంటున్నారు. దీంతో ఈటలతో మొదటి నుంచి అంటీముట్టనట్టు ఉంటున్నవారిని మొదట టీఆర్ఎస్ లీడర్లు చేరదీశారు. వారితో ప్రకటనలు చేయించిన తర్వాత ఈటలకు దగ్గరగా ఉన్నవారిని టార్గెట్చేశారు. మొదట బుజ్జగించడం.. లేదంటే డబ్బులు ఆఫర్ చేయడం.. అయినా వినకపోతే బెదిరించయినా లొంగదీసుకోవడం.. ఈ మూడు సూత్రాలతో నియోజకవర్గంలో ఈటల ప్రభావాన్ని తుడిచిపెట్టాలని భావిస్తున్నారు. మొదటి నుంచి ఈటల వెంట ఉన్న వీణవంక జడ్పీటీసీ దంపతులు బర్తరఫ్తర్వాత కూడా ఆయనకే మద్దతిచ్చారు. దీంతో వాళ్ల మీద పాత కేసు ఒకటి బయటకు తీయడంతో.. రెండురోజుల కింద తాము కేసీఆర్నాయకత్వంలోనే ఉంటామని బహిరంగ ప్రకటన చేశారు.