
అభ్యర్థుల ప్రచారం లేదు.. ఇన్చార్జ్ల హడావుడి లేదు
మజ్లిస్ పోటీ చేస్తున్న స్థానాల్లో క్యాంపెయిన్ చేయొద్దని తమ క్యాండిడేట్లకు ఆర్డర్స్!
కాదని ప్రచారానికి వెళ్తే సీరియస్ అవుతున్న పార్టీ పెద్దలు
150 డివిజన్లలో పోటీ చేస్తున్నా.. 99 స్థానాలపైనే ఫోకస్
పాత బస్తీలో ప్రచారం చేయని కేటీఆర్.. రోడ్ షోలూ లేనట్లే!
హైదరాబాద్, వెలుగు: ‘‘ఈ ఎన్నికల్లో టీఆర్ఎస్, ఎంఐఎం మధ్యే ప్రధాన పోటీ ఉంటుంది. గత ఎన్నికల్లో మజ్లిస్ స్థానాలను మేం గెలుచున్నాం. ఆ పార్టీతో మాకు ఎలాంటి పొత్తు లేదు. కొందరు కావాలనే మా మధ్య అవగాహన ఉందని విమర్శలు చేస్తున్నారు”.. రెండు రోజల కిందట తెలంగాణ భవన్ లో మంత్రి కేటీఆర్ చేసిన కామెంట్లివి. కానీ హైదరాబాద్ ఓల్డ్ సిటీలో గ్రౌండ్లెవెల్లో టీఆర్ఎస్ తీరు వేరేలా ఉంది. గులాబీ పార్టీ బడా నేతలు పాత బస్తీలో కనీసం ప్రచారం చేయట్లేదు.
అక్కడి డివిజన్లలో పోటీ చేస్తున్న క్యాండిడేట్లు కూడా ప్రచారానికి పోవడం లేదు. ప్రచారం చేయద్దని పార్టీ పెద్దల నుంచి అభ్యర్థులకు ఆదేశాలు ఉన్నట్టు లీడర్లు చెప్తున్నారు. ఎవరైనా కాస్త దైర్యం చేసి ప్రచారానికి వెళ్తే.. వెంటనే పార్టీ పెద్దల నుంచి వాళ్లకు ఫోన్లు వస్తున్నాయని, ఎందుకు క్యాంపెయినింగ్ చేస్తున్నారని సీరియస్ అవుతున్నారని ప్రచారం జరుగుతోంది. దీంతో పార్టీ ఇన్చార్జ్లు కూడా అక్కడ కాలు మోపేందుకు
ఆలోచిస్తున్నారు.
ఆ 51 డివిజన్లు తప్ప..
గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల్లో మొత్తం 150 డివిజన్లలో తమ అభ్యర్థులను బరిలోకి టీఆర్ఎస్ దింపింది. గత ఎన్నికల్లో 44 సీట్లలో గెలిచిన ఎంఐఎం.. ఈసారి 51 డివిజన్లలో క్యాండిడేట్లను ప్రకటించింది. మజ్లిస్ పోటీ చేస్తున్న ప్రాంతాలను పట్టించుకోని టీఆర్ఎస్.. మిగతా 99 స్థానాలపైనే ఫోకస్ పెట్టిందనే చర్చ జరుగుతోంది. హైదరాబాద్ పార్లమెంట్ పరిధిలోని కొన్ని డివిజన్లలో స్థానిక ప్రజలు టీఆర్ఎస్ పట్ల ఆదరణ కనబరుస్తున్నా, అటువైపుకు వెళ్లొద్దని అభ్యర్థులకు కండిషన్లు పెట్టినట్టు తెలిసింది.
ఓల్డ్ సిటీలో కేటీఆర్ రోడ్ షోల్లేవు
జీహెచ్ఎంసీ ఎన్నికల ప్రచార బాధ్యతలు తీసుకున్న కేటీఆర్.. రోజూ నాలుగైదు చోట్ల రోడ్ షోలు నిర్వహిస్తున్నారు. ఒక్కో చోట నాలుగైదు డివిజన్ల అభ్యర్థులను ప్రజలకు పరిచయం చేస్తూ, ఓట్లు అడుగుతున్నారు. కాని ఇంతవరకు ఓల్డ్ సిటీలో ఆయన ఎన్నికల ప్రచార షెడ్యూలు ఖరారు కాలేదని, అసలు ఉండే చాన్స్ లేదని పార్టీకి చెందిన సీనియర్ లీడర్లు చెప్తున్నారు.
పార్టీ పెద్దలు వద్దంటున్నరు
నాంపల్లి అసెంబ్లీ సెగ్మెంట్ లో ఎన్నికల ప్రచారం చేస్తుంటే వద్దని పార్టీ పెద్దలు చెప్పారు. మళ్లీ ప్రచారం చేయొద్దని తిట్టారు. దీంతో మధ్యలో ఆపేశాం. అసలు ఎందుకు పోటీకి దింపాలి. ప్రచారం చేయొద్దని ఎందుకు చెప్పాలి. దీని వల్ల పార్టీకి ఏమోగాని మాకు మాత్రం పరువు పోతోంది. -ఓ టీఆర్ఎస్ క్యాండిడేట్
వెళ్లిపోమంటున్నరు
ఎన్నికల ప్రచారం కోసమని నాకు అప్పగించిన డివిజన్లకు పోయిన. అక్కడ పోటీ చేస్తున్న అభ్యర్థి ఇంటికి వెళ్తే.. ‘‘సార్ ఎందుకు వచ్చారు. ఇక్కడ ప్రచారం చేయొద్దని మజ్లిస్ పార్టీ వాళ్లు అడ్డు చెప్తున్నారు. మీరు వెనక్కి వెళ్లి పోండి. గులాబీ కండువా, జెండా కనిపిస్తే గొడవ చేస్తున్నరు’’ అని చెప్పిండు.-కార్వాన్ అసెంబ్లీ సెగ్మెంట్‌లో ఎన్నికల ఇన్చార్జ్గా ఉన్న ఓ లీడర్.
Read More News….