సామాజిక న్యాయానికి టీఆర్‌‌‌‌ఎస్‌‌‌‌ పాతర

సామాజిక న్యాయానికి టీఆర్‌‌‌‌ఎస్‌‌‌‌ పాతర

తెలంగాణలో గడిచిన ఎనిమిదేండ్లల్ల బడుగు, బలహీన వర్గాల బతుకుల్లో ఏ మార్పూ రాలే. ప్రజా సంగ్రామ పాదయాత్రలో భాగంగా పల్లెల్లో నడుస్తున్నప్పుడు ఆ దుస్థితి కళ్లకు కట్టినట్టు కనపడింది. వాళ్లు ఎదుర్కొంటున్న అనేక సమస్యల్ని, టీఆర్‌‌‌‌ఎస్‌‌‌‌ ప్రభుత్వం వాళ్లకు చేస్తున్న అన్యాయాల గురించి గోడు వెళ్లబోసుకున్నరు. స్వయంగా నేను ఆర్‌‌‌‌టీఐ ద్వారా సేకరించిన వివరాలను పరిశీలిస్తే నిజాలు కళ్లకు కట్టినట్లు ఉన్నాయి. ఎస్సీ, ఎస్టీ, బీసీలకు ఇచ్చిన హామీలను టీఆర్‌‌‌‌ఎస్‌‌‌‌ ప్రభుత్వం తుంగలో తొక్కింది. దళితుడినే ముఖ్యమంత్రి చేస్తనని, ఆ తర్వాత దళితులకు మూడెకరాల భూమి ఇస్తమని మోసం చేసింది. తర్వాత హుజూరాబాద్‌‌‌‌ ఉపఎన్నికలో గెలవడానికి రాష్ట్రమంతా ‘దళిత బంధు’ ఇస్తమని చెప్పింది. కానీ, అయినోళ్లకు ఆకుల్లో, కానోళ్లకు కంచంలో పెట్టినట్టు, ఇప్పుడు అక్కడక్కడ ‘దళితబంధు’  పుచ్చుకుంటున్నవాళ్లలో మెజారిటీ గులాబీ కార్యకర్తలే ఉంటుండటం టీఆర్‌‌‌‌ఎస్‌‌‌‌ పక్షపాత ధోరణికి అద్దం పడుతున్నది. హుజూరాబాద్‌‌‌‌ జడ్పీ చైర్‌‌‌‌పర్సన్‌‌‌‌ తమ బంధువులకు దళితబంధు పేరుతో అప్పనంగా కోట్లు దోచుకున్నట్లు ఇటీవలే వార్తలొచ్చాయి. ఇలా చెప్పుకుంటూ పోతే వీటికి అంతమే ఉండదు. రాష్ట్రంలో యాభై శాతానికి పైగా ఉన్న బీసీలకు టీఆర్‌‌‌‌ఎస్‌‌‌‌ ప్రభుత్వం రిజర్వేషన్ల అమలు తీరు నుంచి మొదలు పెడితే రాజకీయంగా, ఆర్థికంగా, విద్యాపరంగా పథకం ప్రకారం అన్యాయం చేస్తూ వస్తున్నది. బీసీల బలమేంటో బీసీలకు తెలిస్తే, సీఎం కుర్చీ కిందకు నీళ్లొస్తయనే వారిని మభ్యపెడుతోంది. 

రిజర్వేషన్లలో అన్యాయం

12 శాతం రిజర్వేషన్‌‌‌‌ ఇస్తమని ఎస్టీలను మోసం చేసిన్రు. రాజకీయంగా చూస్తే 50 శాతం కన్నా ఎక్కువున్న బీసీ జనాభాకు రాష్ట్ర అసెంబ్లీలో కేవలం 22 మందే ఎమ్మెల్యేలు ఉన్నరు. అందులో ముగ్గురికే మంత్రి పదవులు. 0.4 శాతం మంది ఉన్న సీఎం సామాజిక వర్గానికి మాత్రం 4 మంత్రి పదవులు ఇచ్చుకున్నరు. స్థానిక సంస్థల్లో బీసీలకు ఉండాల్సిన 33 శాతం రిజర్వేషన్లను15 శాతానికి తగ్గించిన్రు. ఫలితంగా జీహెచ్‌‌‌‌ఎంసీలో బీసీలు ఎక్కువగా ఉన్న 30 కార్పొరేటర్‌‌‌‌ స్థానాలను మైనార్టీలు దక్కించుకున్నరు. ఇదంతా బీసీలను రాజకీయంగా దెబ్బకొట్టడానికి టీఆర్‌‌‌‌ఎస్‌‌‌‌ ఆడుతున్న కపట నాటకం కాదా? బడుగు, బలహీన వర్గాలు చదువుకునే బడులు, వర్సిటీల్లో ఖాళీలను భర్తీ చేయకుండా ప్రభుత్వం విద్యా వ్యవస్థను నిర్వీర్యం చేస్తున్నది. రాష్ట్ర ఏర్పాటు తర్వాత 5 ప్రైవేట్‌‌‌‌ వర్సిటీలకు అనుమతిచ్చారు. వాటిలో రిజర్వేషన్లు, ఫీజు రియింబర్స్‌‌‌‌ మెంట్‌‌‌‌ ఉండదని చెప్పి బడుగు, బలహీన వర్గాల విద్యాహక్కును టీఆర్‌‌‌‌ఎస్‌‌‌‌ కాలరాసింది. జిల్లాకో బీసీ స్టడీ సర్కిల్‌‌‌‌ ఏర్పాటు చేస్తమని ఇచ్చిన హామీ ఎప్పుడో గాల్లో కలిసింది. జాతి అభివృద్ధికి మూలమైన విద్యను అందని ద్రాక్షగా మార్చడం, బీసీల పునాదులను పెకిలించే సంకేతం కాదా?

స్వయం ఉపాధి ఊసే లేదు..

ఎస్సీ, ఎస్టీ, బీసీ కార్పొరేషన్‌‌‌‌ సబ్సిడీ లోన్స్​ పత్తాలేవు. లక్షల సంఖ్యలో అప్లికేషన్లు పెండింగ్​లో ఉన్నాయి. రాష్ట్రంలో అన్ని కార్పొరేషన్లకు, పాలక మండళ్లు ఏర్పాటు చేసి చైర్మన్లు, డైరెక్టర్లను నియమించిన్రు. మరి, బీసీ కులాల ఫెడరేషన్స్‌‌‌‌, కార్పొరేషన్స్​ను మాత్రం ఎందుకు పట్టించుకోవడం లేదు? నాయీ బ్రాహ్మణుల్ని అన్ని విధాలుగా ఆదుకుంటమని, మోడర్న్‌‌‌‌ సెలూన్లు కట్టిస్తమని చెప్పిన ముచ్చటేమాయె? వాళ్లకు ఇస్తనన్న 250 యూనిట్ల ఫ్రీ కరెంటు ఇంకా పూర్తి స్థాయిలో అమలైతలేదు. సబ్సిడీ/ రుణాల కోసం 35, 651 దరఖాస్తులు వస్తే 7,375 మందికే లబ్ధి చేకూరినట్టు ఆర్‌‌‌‌టీఐ ద్వారా తెలిసింది. దేవాలయాల్లోని కల్యాణకట్టలో పని చేసే క్షురకులను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తిస్తమని సీఎం కేసీఆర్‌‌‌‌ ఇచ్చిన హామీ కూడా బుట్టదాఖలైంది. డ్రైవర్‌‌‌‌ సాధికారిత, హేర్‌‌‌‌కటింగ్‌‌‌‌ నైపుణ్య శిక్షణ పథకాలకు పైసా కూడా కేటాయించలేదు. సమైక్య రాష్ట్రంలో చేనేత మగ్గం గుంటలో చిక్కుకున్నదని, పద్మశాలి, చేనేత కార్మికులను కష్టాలు, నష్టాలు, కన్నీటి బాధల నుంచి బయటపడేయడానికి శాశ్వత పరిష్కారం చూపించడానికి ప్రభుత్వం ఎంత ఖర్చుకైనా వెనకాడబోదని సీఎం కేసీఆర్‌‌‌‌ చెప్పి ఐదేండ్లు దాటింది. వరంగల్‌‌‌‌ లో టెక్స్‌‌‌‌ టైల్‌‌‌‌ పార్క్‌‌‌‌ ఏర్పాటుతో సూరత్‌‌‌‌, ముంబైకి వలసపోయిన చేనేత కార్మికులను తిరిగి రప్పిస్తమని ఉత్తముచ్చట్లు చెప్పిన్రు. నేతన్నలకు50 శాతం సబ్సిడీపై నూలు, 5 లక్షల బీమా, హెల్త్‌‌‌‌ కార్డులిస్తమని చెప్పినా, ఏవీ అమలు కావడం లేదు. తెలంగాణ వచ్చినప్పుడు 470 సహకార సంఘాలు ఉంటే, టీఆర్‌‌‌‌ఎస్‌‌‌‌ నిర్లక్ష్యం వల్ల అవి ఇప్పుడు 220కి తగ్గాయి. రజకుల కోసం దోభీ ఘాట్లను ఏర్పాటు చేస్తమని 2014 ఎన్నికల్లో టీఆర్‌‌‌‌ఎస్‌‌‌‌ ఇచ్చిన హామీ నీటి మీద రాతే అయ్యింది. రైతు రుణమాఫీ చేయలేదు. ఉచిత ఎరువుల ఊసే లేదు. చివరికి ‘వరేస్తే ఉరే’ అని బెదిరించి, వ్యవసాయం మీద ఆధారపడిన మున్నూరు కాపులు, ఆయా బీసీలను ఆర్థికంగా, మానసికంగా దెబ్బకొట్టిన్రు. 

బీజేపీతో కలిసి ఏకమవుతున్న బీసీలు

బీసీలకు బీజేపీ ఏం చేసిందో కూడా ఇక్కడ నేను చెప్తా. కేంద్ర ప్రభుత్వ విద్యా, ఉద్యోగాలకు 27 శాతం ఓబీసీ రిజర్వేషన్లు కల్పించింది. జనాభాలో పది శాతంగా ఉన్న ‘‘జాతీయ సంచార జాతుల సంక్షేమ అభివృద్ధి’’ బోర్డును ఏర్పాటు చేసింది. మత్స్యకారుల కోసం ప్రత్యేక మంత్రిత్వ శాఖ ఏర్పాటు చేసింది. బీసీ జాతీయ కమిషన్‌‌‌‌ కి రాజ్యాంగ హోదా కల్పించిన ఘనత బీజేపీకే దక్కుతది. దేశానికి ఒక బీసీ(మోడీ) రెండు సార్లు ప్రధాని అయ్యారు. నలభైశాతం బీసీలతో మంత్రివర్గం ఏర్పాటు చేసింది. ఇంతకుముందు ఒక దళితుడిని, ఈ సారి ఆదీవాసీని రాష్ట్రపతిగా ఎన్నుకోవడం కూడా బీజేపీ సాధించిన సామాజిక న్యాయం. సమగ్ర కుటుంబ సర్వేతో బీసీల లెక్క మొత్తం తీసుకున్న రాష్ట్ర సర్కారు, దాన్ని బయటపెట్ట లేదు. ఎందుకంటే, బీసీల బలమేందో వారికి తెల్వనీయొద్దు. కానీ, ఇప్పుడు ఆ పప్పులేం ఉడకవు. బీజేపీతో కలిసి బీసీలంతా ఏకమైతున్రు. గడీల పాలనను గద్దె దించడానికి, సామాజిక న్యాయం సాధించేందుకు అందరూ కాషాయంతో కలిసి రావాలని స్వాగతిస్తున్నం.

గొర్రెల పంపిణీ ఏమాయె?

గొర్రెల పంపిణీ పథకం మూలకుపడి మూడేండ్లు కావొస్తున్నది. రూ.31,250 చొప్పున డీడీలు కట్టిన మూడున్నర లక్షల మంది గొర్రెల యూనిట్ల కోసం ఎదురు చూస్తున్నరు. గొర్రెల పంపిణీకి గత బడ్జెట్‌‌‌‌ లో వెయ్యి కోట్లు, ఈ బడ్జెట్‌‌‌‌ లో వెయ్యి కోట్లు కేటాయించినా.. ఒక్క పైసా కూడా విడుదల చేయలేదు. ఇక మత్స్య శాఖ మంత్రి మైకు పట్టుకున్న ప్రతీసారి.. చేప పిల్లలు పంచినమని చెప్తుంటరు. వాటి పెంపకం వల్ల ఏపాటి బాగుపడ్డరో, ముదిరాజు, గంగపుత్ర సోదరులను అడిగితే తెలుస్తది. కల్లుగీత కార్మికులు వందల ఏండ్ల నుంచి మోకు ముస్తాదుతోనే తాటిచెట్లు ఎక్కుతూ ప్రమాదాల బారిన పడుతున్నరు. మోకుకు టెక్నాలజీ అనుసంధానం చేయడంలో రాష్ట్ర ప్రభుత్వం విఫలమైంది. గత ఎనిమిదేండల్లో 600 మంది గీత కార్మికులు తాటి చెట్ల మీద నుంచి పడి చనిపోగా, నాలుగు వేల మంది వికలాంగులయ్యారు. ప్రతి గ్రామంలో 5 ఎకరాలు తాటి, ఈత వనాలకు కేటాయిస్తమని చెప్పిన 560 జీవో అమలుకే నోచుకోలేదు. ఇట్లా ప్రతి కులానికి, ప్రతి వర్గానికి టీఆర్‌‌‌‌ఎస్‌‌‌‌ అరచేతిలో వైకుంఠాన్ని చూపించి, చివరికి మొండిచేయి చూపించింది.

- బండి సంజయ్‌‌‌‌ కుమార్‌‌‌‌, కరీంనగర్​ ఎంపీ, బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు