చదువులపై టీఆర్​ఎస్​ సర్కార్​ చిన్నచూపు

చదువులపై టీఆర్​ఎస్​ సర్కార్​ చిన్నచూపు

కొట్లాడి సాధించుకున్న స్వరాష్ట్రంలో విద్యారంగానికి తీవ్ర నష్టం జరుగుతోంది. పాలకులు ఏడేండ్లుగా ప్రతి అంశాన్ని ఓట్లు, రాజకీయంగానే చూస్తున్నారు తప్ప అభివృద్ధి కోణంలో చూడటం లేదు. విద్యపై పెట్టే పెట్టుబడిని రాబడి లేని ఆదాయంగా భావిస్తూ.. రాష్ట్రంలో విద్యావ్యవస్థను పట్టించుకోవడం మానేశారు. కేజీ టు పీజీ ఉచిత విద్య హామీ అమలు కావడం లేదు. రేషనలైజేషన్​ పేరుతో ప్రభుత్వ బడులు మూసివేస్తున్న సర్కారు.. ఖాళీలు లేవని రిక్రూట్​మెంట్​చేపట్టడం లేదు. సౌలత్​లు లేక సర్కారు బడుల పరిస్థితి అధ్వానంగా ఉంది. టీచర్లకు సరైన గౌరవం దక్కడం లేదు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి రాష్ట్రంలో విద్యారంగాన్ని సమీక్షించాలి. ఉన్నత విద్యను గాడిలో పెట్టాలి.

రాష్ట్ర ఏర్పాటు తర్వాత సీఎం కేసీఆర్​ కేజీ నుంచి పీజీ వరకు ఉచిత విద్య అందిస్తామని ప్రకటించారు. కానీ ఈ ఏడేండ్ల  కాలంలో ‘కేజీ టు పీజీ విద్య’ ఎక్కడా అమలు కావడం లేదు. రాష్ట్రంలో విద్యారంగాన్ని సమీక్షించాలనే విషయాన్ని ఆయన పూర్తిగా మరిచిపోయారు. కొన్ని సందర్భాల్లో ‘ నేను అన్ని రంగాలను సమీక్షించాను.. కానీ విద్యారంగాన్ని సమీక్షించలేదు.., సమీక్షించుకుందాం’ అన్నారు గానీ ఎన్నడూ టైం కేటాయించింది లేదు. గురుకులాలు నెలకొల్పి విద్యనందిస్తున్నాం, ప్రతి పిల్లవాని మీద ఏటా లక్ష 32 వేల రూపాయలు ఖర్చు చేస్తున్నామని ప్రభుత్వం చెబుతోంది. అయితే గురుకులాల ద్వారా విద్య కొంత మంది స్టూడెంట్స్​కే అందుతోంది. మరి మిగతా వారి పరిస్థితి ఏంటి?. రాష్ట్ర ఏర్పాటుకు ముందు 600 గురుకులాలు ఉండగా.. వాటికి తోడుగా తెలంగాణ సర్కారు మరో 300కు పైన కొత్తవి ఏర్పాటు చేసింది.  దాదాపు1,000 గురుకులాల్లో 5వ తరగతి నుంచి12 వరకు చదువుతున్న స్టూడెంట్స్ ​సంఖ్య 4 లక్షలకు మించరు. మరి మిగతా స్టూడెంట్స్ కు విద్యనందించే బాధ్యత సర్కారు మీద లేదా? సీఎం కేసీఆర్​చదువుకున్న దుబ్బాక బడి, మంత్రి హరీశ్​రావు ప్రాతినిధ్యం వహిస్తున సిద్దిపేట స్కూల్,  మంత్రి కేటీఆర్​ ప్రాతినిధ్యం వహిస్తున్న సిరిసిల్ల సర్కారు బడులు ఉన్నట్లే రాష్ట్రంలో అన్ని బడులు ఎందుకు ఉండకూడదు? రాష్ట్రంలోని మిగతా 6,000 హైస్కూల్స్, 20 వేల ప్రైమరీ, అప్పర్ ​ప్రైమరీ స్కూళ్లలో ఆ స్థాయి డెవలప్​మెంట్, సౌలత్​లు కల్పించాలె.

న్యూ ఎడ్యుకేషన్​ పాలసీతో..
మూడేండ్లు నిండిన పిల్లలు సర్కారు బడుల్లో శిశు తరగతులు ప్రారంభించి అడ్మిషన్లు పొందే అవకాశం గతంలో లేదు. కానీ కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన న్యూ ఎడ్యుకేషన్​ పాలసీ ద్వారా కిండర్​గార్టెన్​ తరగతులు స్టార్ట్​ చేసుకునే వీలు కలిగింది. ఈ అకడమిక్​ ఇయర్​ నుంచి ఆ అవకాశం ఉన్నా.. ప్రభుత్వం పెద్దగా పట్టించుకోవడం లేదు. అంగన్‌‌వాడీలను సర్కారు బడులకు అనుసంధానం చేసి కేజీ తరగతుల ప్రారంభం గురించి ఇప్పటి వరకు ప్రణాళికలే సిద్ధం చేయకపోవడం దురదృష్టకరం. ఫస్ట్ నుంచి టెన్త్​ వరకు కొనసాగుతున్న 26 వేల పైగా బడుల్లో విద్యార్థులు లేని వాటిని మూసివేయడానికి ప్రభుత్వం రేషనలైజేషన్ ప్రక్రియ ప్రారంభించింది. దాదాపు 2 వేల బడులను మూసివేసి పది వేల మంది టీచర్లు అదనంగా ఉన్నారని లెక్కలు వేసింది. కానీ బడుల సమస్యల మీద ఏ మాత్రం దృష్టి పెట్టలేదు. ప్రభుత్వ పాఠశాలల్లో స్వచ్ఛ కార్యక్రమాలు నిర్వహించేందుకు స్వీపర్, స్కావెంజర్లను నియమించకుండా ఆ బాధ్యత టీచర్​ విధిగా మార్చడం దురదృష్టకరం. ప్రస్తుతం రాష్ట్రంలో 500 పైగా ఎంఈవో పోస్టులు. 1,800 హైస్కూల్​ హెచ్ఎం, 2,000 వరకు స్కూల్​అసిస్టెంట్​ పోస్టులు ఖాళీగా ఉన్నాయి. అయితే అన్ని స్థాయిల్లో నిబంధనల మేరకు పదోన్నతులు కల్పిస్తే.. ప్రభుత్వం చెబుతున్న అదనపు పోస్టులు ఎక్కడా ఉండవు. పదోన్నతులు కల్పించకపోవడంతో  వేలాది మంది టీచర్లు అన్ని అర్హతలు ఉన్నా.. ఒకే పోస్టులో 30 ఏండ్లపాటు కొనసాగి చివరికి అదే స్థాయిలో ఉద్యోగ విరమణ చేస్తున్నారు. ప్రమోషన్లు లేక టీచర్లు లేక అంతిమంగా విద్యా వ్యవస్థపై తీవ్ర ప్రభావం పడుతోంది. సర్కారు బడుల తీరు ఇట్లుంటే.. ప్రైవేటు స్కూళ్లది మరో గోస. కరోనా దెబ్బతో రాష్ట్రంలో దాదాపు 10 వేలకు పైగా బడ్జెట్​స్కూళ్లు మూతపడ్డాయి. వాటిలో చదువుకుంటున్న స్టూడెంట్స్​ తప్పనిసరి పరిస్థితుల్లో సర్కారు బడులకు వెళ్తున్నారు. ప్రైవేటు స్కూళ్లలో ఇన్నాండ్లు సదువు చెప్పిన టీచర్లు.. ఇప్పుడు రోడ్డున పడ్డరు. కార్పొరేట్​స్కూళ్ల దోపిడీని అరికట్టేందుకు ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదు. పీజీ విద్య మరీ అధ్వానంగా మారింది. ఏడేండ్లుగా వర్సిటీలు చాన్స్​లర్లు, ఫ్రొఫెసర్లు లేకుండానే నడిచాయి. ఇటీవల వీసీలను నియమించినా.. ఇంకా ప్రొఫెసర్ల రిక్రూట్​మెంట్​ చేపట్టడం లేదు. వర్సిటీల డెవలప్​మెంట్​కు ఫండ్స్​ఇవ్వడం లేదు. వర్సిటీ స్థాయి, హయ్యర్​ఎడ్యుకేషన్​లో ప్రమాణాలు పడిపోయే ప్రమాదం నెలకొంది.

గురువులకు ఇచ్చే గౌరవం..
సర్వేపల్లి రాధా క్రిష్ణన్ జన్మదినాన్ని పురస్కరించుకొని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అధికారికంగా టీచర్స్​డే నిర్వహిస్తాయి. విద్యారంగంలో విశిష్ట సేవలు అందించిన అధ్యాపకులు, టీచర్లను ఎంపిక చేసి ఆ రోజు సన్మానించుకోవడం ఆనవాయితీ. ఈ సందర్భంగా మానవ వనరుల అభివృద్ధిలో గురువుల పాత్రను గుర్తు చేసుకోవడం కనీస మర్యాద. స్వరాష్ట్రంలో రెండు టర్మ్​లు సీఎంగా ఉన్న కేసీఆర్​8 సార్లు జరిగిన టీచర్స్​డే వేడుకల్లో పాల్గొన్నది కేవలం ఒకేఒక్కసారి. అదీ రాష్ట్రం ఏర్పడిన మొదటి ఏడాది. ఆ తరువాత జరిగిన ఏ కార్యక్రమంలో పాల్గొనడానికి ఆయనకు తీరిక లేదు. మొన్నటి టీచర్స్​డే సందర్భంగా ఢిల్లీలో ఉండి శుభాకాంక్షలు తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించిన కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి సీఎం శుభాకాంక్షలు, ఆయన మాటలు గుర్తు చేశారు. రాష్ట్రంలో సుమారు 2.5 లక్షల మంది ఉపాధ్యాయ, ఉద్యోగులను ప్రభుత్వం సేవకులుగా భావిస్తోంది. ప్రతి ఉద్యోగికి వృత్తి ధర్మం ఉంటుంది. సర్కారు ఉద్యోగులను వృత్తి ధర్మం పాటించకుండా వారిపై ద్వేషపూరితంగా వ్యవహరించిన సందర్భాలెన్నో ఉన్నాయి. జీహెచ్ఎంసీ ఎన్నికల్లో టీచర్లను ఎన్నికల విధుల్లోకి తీసుకోకపోవడం ద్వారా ప్రభుత్వం వారి పట్ల చూన్న చూపు ప్రదర్శించింది. పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఉద్యోగుల ఓట్లు పొందడానికి, అయిదేండ్లకు ఒకసారి హక్కుగా వచ్చే పీఆర్సీని మూడేండ్లు ఆలస్యంగా తెచ్చి, మా అభ్యర్థులు గెలిస్తేనే ఇస్తానని ప్రకటించడం దారుణం. 

నిలదీయాలె..
సర్కారు విద్యపై పెట్టే పెట్టుబడిని రాబడి లేని ఆదాయంగా చూస్తూ విద్యావ్యవస్థను పట్టించుకోవడం లేదు. రేషనలైజేషన్​తో ప్రభుత్వ బడులను మూసి వేస్తూ.. ఖాళీలు లేవని రిక్రూట్​మెంట్​ చేపట్టడం లేదు. కరోనా కారణంగా విద్యారంగానికి తీవ్ర నష్టం జరిగింది. ఆ నష్టాన్ని వేగంగా పూడ్చేందుకు ప్రభుత్వం అవసరమైన చర్యలు తీసుకోవాలె. కేజీ టు పీజీ ఉచిత విద్య హామీ ఇచ్చిన సీఎం కేసీఆర్​ను విద్యార్థుల తల్లిదండ్రులు, సామాజిక కార్యకర్తలు, విద్యావేత్తలు నిలదీయాలె. ఎన్నికల్లో లబ్ధి కోసం కొన్ని ప్రాంతాల్లో కొన్ని పథకాలు అమలు చేస్తుంటే.. అన్ని ప్రాంతాల్లోనూ వాటిని అమలు చేయాలని కోరుతున్నట్లే. గురుకుల విద్యను, దుబ్బాక, సిద్దిపేట, సిరిసిల్ల ప్రభుత్వ పాఠశాలలకు సమకూర్చిన వసతులు రాష్ట్రంలోని అన్ని బడులకు కల్పించాలని డిమాండ్​ చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. 

- పులి సరోత్తం రెడ్డి, బీజేపీ రిటైర్డ్ టీచర్స్ & ఎంప్లాయిస్ రాష్ట్ర కో-చైర్మన్

For More News..

నచ్చిన కాలేజీలో నచ్చిన క్లాస్ వినొచ్చు

మటన్‌‌‌‌ ముక్కలు వేయలేదని కొట్టి చంపిన్రు