ట్రూకాలర్​ ఉందా.. డేటా గోవిందా!

ట్రూకాలర్​ ఉందా.. డేటా గోవిందా!

హైదరాబాద్​, వెలుగు: ట్రూకాలర్​.. చాలా మంది ఫోన్లలో ఉంటున్న యాప్​. తెలియని వ్యక్తులు ఫోన్​ చేసినా, వాళ్లు ఎవరన్నది ఆ యాప్​తో తెలిసిపోతుంది. ప్రపంచంలో 70 శాతం మంది యూజర్లు మనోళ్లే. 10 కోట్ల మందికిపైగా దానిని వాడుతున్నారు. స్పామ్​ ఫోన్లు, మెసేజ్​ల బెడద నుంచి తప్పించేందుకు అది ఉపయోగపడుతుందని యూజర్లు భావిస్తుండొచ్చు. కానీ, యూజర్లూ మీకో షాకింగ్​ న్యూస్​. మీ పర్సనల్​ డేటాను ట్రూ కాలర్​ అమ్మేసుకుంటోంది. మార్కెటింగ్​ కంపెనీలకు ఇచ్చేస్తోంది. ట్రూకాలర్​లో రిజిస్టర్​ చేసుకునే ముందు పేరు, ఫోను, సోషల్​ మీడియా వివరాలు తప్పకుండా ఇవ్వాల్సి ఉంటుంది కదా. ఆ వివరాలనే ఆసరాగా చేసుకుంటోంది సంస్థ. దానికి సంబంధించి తనకూ ఇలాంటి అనుభవమే ఎదురైందంటూ రాకేశ్  అనే వ్యక్తి ఆధారాలతో సహా ట్విట్టర్​లో పోస్ట్​ చేశారు. ట్రూకాలర్​లో ‘abcd efgh’ అన్న పేరుతో ఐడీ క్రియేట్​ చేసుకున్నారట. ఆ పేరుతోనే కొన్ని కార్పొరేట్​ కంపెనీల నుంచి ఆయనకు మెసేజ్​లు వచ్చాయట. అది చూసి కంగుతిన్న ఆయన, దాని తాలూకు స్క్రీన్​ షాట్లను ట్విట్టర్​లో పోస్ట్​ చేసి ట్రూకాలర్​కు ట్యాగ్​ చేశారు. మార్కెటింగ్​ సంస్థలకు తన డేటాను అమ్ముకుందని ఆరోపించారు. దానిపై ట్రూకాలర్​​సీఈవో అలన్​ మమేడి వెంటనే స్పందించారు. చిన్న బగ్​ వల్ల జరిగిన పొరపాటు అని, కంపెనీ ఎవరి డేటా అమ్ముకోదని వివరణ ఇచ్చారు.

ట్రూకాలర్​ ‘యూపీఐ స్కామ్​’

ఇంతకు ముందు యూజర్ల ప్రమేయం లేకుండానే నేరుగా బ్యాంక్​ సర్వీసులు చేసుకునేలా యూపీఐ అకౌంట్​ను క్రియేట్​ చేసింది ట్రూకాలర్​. 2017లో ఐసీఐసీఐతో కలిసి మొబైల్​ పేమెంట్స్​ను ప్రారంభించింది. చాలా మంది అకౌంట్లు యూజర్ల అనుమతి లేకుండానే యాడ్​ అయ్యాయి. దీంతో తమ ప్రమేయం లేకుండా అకౌంట్​ యాడ్​ అవడంతో డబ్బులూ మాయమయ్యే ప్రమాదం ఉందన్న ఆందోళనతో యూజర్లు కంపెనీపై ఫిర్యాదులు చేశారు. కొందరికైతే బ్యాంకు అకౌంట్​ డీయాక్టివేట్​ అయినట్టు మెసేజ్​లూ వెళ్లాయి. అసలు యూపీఐ అకౌంటే లేనప్పుడు ఎట్ల డీయాక్టివేట్​ అవుతుందని కొందరు యూజర్లు గందరగోళంలో పడ్డారు. దానిపై ఓ యూజర్​ నేషనల్​ పేమెంట్స్​ కార్పొరేషన్​ ఆఫ్​ ఇండియాకు ఫిర్యాదు చేశారు. దర్యాప్తు మొదలవడంతో, వెంటనే ట్రూకాలర్​ కొత్త వెర్షన్​ను తొలగించేసింది. ఓ బగ్​ వల్ల సమస్య వచ్చిందని, క్షమించాలని కోరింది.

అమ్ముకుంటున్నట్టు తేలింది

రెండు, మూడేళ్ల కిందట ట్రూకాలర్​ డేటాబేస్​ పెద్ద మొత్తంలో లీకైంది. జాగ్రత్తలు తీసుకుంటామని అప్పుడు కంపెనీ చెప్పింది. కానీ, ఇప్పుడు ఆ డేటాను అమ్ముకుంటున్నట్టు క్లియర్​గా అర్థమవుతోంది. డార్క్​వెబ్​లోనూ కొన్ని లక్షల ఈమెయిల్ ఐడీలు, డేటా కేవలం 50 నుంచి 60 డాలర్లకు అమ్మకానికి పెట్టారు. ఇలాంటి వాటిపై కఠినమైన చట్టాలు తేవాల్సిన అవసరం ఉంది. విదేశాల్లో అయితే, కఠిన చర్యలు తీసుకుంటారు.

‑ నల్లమోతు శ్రీధర్​, సాంకేతిక నిపుణులు