
ప్రస్తుతం జరుగుతున్న పరిణామాలను పరిశీలిస్తుంటే అమెరికా-పాకిస్థాన్ మధ్య చీకటి స్నేహం కొనసాగుతోందా అనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. పైకి డొనాల్డ్ ట్రంప్ ఇండియాకి సపోర్ట్ చేస్తున్నట్లే కనిపిస్తున్నప్పటికీ.. వెనుక పాక్ తో చేతులు కలిపారా అనే అనుమానం ఐఎంఎఫ్ నుంచి లోన్ ఇప్పించిన రోజునే అందరి మదిలో కలిగింది.
అయితే ట్రంప్ గతవారం చివరిలో ఇండియా-పాక్ మధ్య శాంతికి రాజీ కుదిర్చానని. ఇరు దేశాలనూ కల్పుల విరమణకు అంగీకరించేలా చేశానని చెప్పుకున్న కొద్ది రోజుల తర్వాత షాకింగ్ విషయం బయటకు వచ్చింది. ట్రంప్ కుటుంబ క్రిప్టో సంస్థతో పాకిస్థాన్ డీల్ కుదుర్చుకున్నట్లు వార్తల్లో బయటపడింది. వరల్డ్ లిబరేషన్ ఫైనాన్షియల్ అనే క్రిప్టో సంస్థలో ట్రంప్ కుటుంబానికి 60 శాతం వాటా ఉన్న సంగతి తెలిసిందే. అయితే ఇటీవల ఈ సంస్థ కొత్తగా ఏర్పాటు చేయబడిన పాకిస్థాన్ క్రిప్టో కౌన్సిల్ తో ఒప్పందం కుదుర్చుకుంది. వరల్డ్ లిబర్టీ ఫైనాన్షియల్ సంస్థలో ట్రంప్ కుమారులు ఎరిక్, డొనాల్డ్ జూనియర్ పెట్టుబడులు కలిగి ఉన్నారు.
వాస్తవానికి పాకిస్థాన్ ఇస్లామాబాద్ ప్రాంతాన్ని దక్షిణ ఆసియాలో క్రిప్టోలకు కీలక హబ్ కింద మార్చే లక్ష్యంతో పాక్ ప్రభుత్వం కొన్ని వారాల కిందట దీనిని ఏర్పాటు చేసినట్లు వెలుగులోకి వచ్చింది. పాక్ ఏర్పాటు చేసిన కౌన్సిల్ ప్రముఖ క్రిప్టో ఎక్స్ఛేంజీ బినేన్స్ వ్యవస్థాపకుడిని దీనికి అడ్వైజరుగా నియమించింది. దీని ద్వారా ప్రజల్లో క్రిప్టోలపై తమ ప్రయత్నానికి నమ్మకం కలిగించాలని పాక్ ప్రభుత్వం నిర్ణయించింది. ఇస్లామాబాదులో కౌన్సిల్ చేపట్టిన సమావేశానికి ట్రంప్ అత్యంత సన్నిహితుడు స్టీవ్ విట్‌కాఫ్ కుమారుడు జాకరీ విట్‌కాఫ్ కూడా హాజరయ్యారు. వీరిని పాక్ ప్రధానితో పాటు, ఆర్మీ చీఫ్ అసిమ్ మునీర్ వెల్కమ్ పలికారు. దీని తర్వాతే పహల్గామ్ హింసకు మునీర్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని తెలుస్తోంది.
ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా క్రిప్టో కరెన్సీలను ఉగ్రవాద సంస్థలు హవాలాకి బదులుగా డబ్బును వివిధ దేశాల ప్రభుత్వాలకు తెలియకుండా తరలించేందుకు ఉపయోగిస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. భారత్ వంటి దేశాలు అందుకే ముందునుంచి క్రిప్టోలపై ప్రభుత్వాల నియంత్రణ అవసరమని కూడా చెబుతోంది. పాక్ లాంటి ఉగ్రవాద దేశాలు క్రిప్టోలకు కేంద్రంగా మారితే అవి చేసే దుర్వినియోగం ప్రపంచ వినాశనానికి దారితీయవచ్చనే వాదనలు ప్రస్తుతం వినిపిస్తున్నాయి.