న్యూయార్క్ కోర్టుకు ట్రంప్.. కాసేపట్లో అరెస్ట్ .?

న్యూయార్క్ కోర్టుకు ట్రంప్.. కాసేపట్లో అరెస్ట్ .?

పోర్న్ స్టార్ కు మనీ చెల్లించిన కేసులో  అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్  న్యూయార్క్‌లోని మాన్‌హటన్ కోర్టులో విచారణకు హాజరుకానున్నారు. కాసేపటి క్రితమే కోర్టు దగ్గరకు చేరుకున్న ట్రంప్‌ను అరెస్టు చేస్తారని ప్రచారం జరుగుతోంది. కేసు తీవ్రతను బట్టి అరెస్టు చేయాలా? బెయిల్‌ ఇవ్వాలా అన్నది న్యాయమూర్తి నిర్ణయంపై ఆధారపడి ఉంటుంది. కోర్టుకు వచ్చిన వెంటనే ఆయన ఫింగర్‌ ప్రింట్స్ తీసుకోనున్నారు.  ట్రంప్ ను అరెస్ట్ చేస్తారనే ప్రచారంతో న్యూయార్క్ కోర్టు దగ్గర  భారీ భద్రతను ఏర్పాటు చేశారు. కొన్ని నగరాల్లో హై అలర్ట్ ప్రకటించారు.

డొనాల్డ్ ట్రంప్ 2016లో ఎన్నికల ప్రచారంలో పోర్న్ స్టార్ స్ట్రోమీ డానియల్స్ తో తనకున్న శారీరక సంబంధం బయటపడకుండా  ఆమెకు  డబ్బు చెల్లించి ఒప్పందం చేసుకున్నారని ట్రంప్ పై అభియోగాలు ఉన్నాయి.  ఆ ఒప్పందాన్ని రద్దు చేయాలంటూ ఆమె 2018లో  కోర్టును ఆశ్రయించింది.  అయితే ట్రంప్ ఈ ఆరోపణలను అప్పట్లో  కొట్టిపారేశారు. 2024లో మరోసారి అమెరికా అధ్యక్షుడిగా పోటీ చేసేందుకు సిద్ధమవుతోన్న తనపై కావాలనే ఆరోపణలు చేస్తున్నారని అన్నారు .  అయితే పోర్న్ స్టార్ తో డబ్బు చెల్లింపులపై ట్రంప్ తో ఒప్పందం కుదుర్చుకున్నట్లు ఆయన పర్సనల్ లాయర్  మైఖేల్ కోహెన్ తెలిపారు. 

ట్రంప్  అధ్యక్ష పదవిలో ఉండటంతో హైప్రొఫైల్‌ కేసుగా దర్యాప్తు సంస్థలు విచారణ చేపట్టాయి. తనను అరెస్ట్ చేసేందుకు రంగం సిద్ధమవుతోందని ,ఆందోళనలకు సిద్ధం కావాలని ట్రంప్ ఈ మధ్య తన అనుచరులకు పిలుపునిచ్చారు.  ఈ క్రమంలోనే న్యూయార్క్ కోర్టు డొనాల్డ్ ట్రంప్ పై నేరారోపణలను దృవీకరించింది.