నిజాం నచ్చని బిల్డింగ్‌లో ట్రంప్‌, ​మోడీ మీటింగ్​

నిజాం నచ్చని బిల్డింగ్‌లో ట్రంప్‌, ​మోడీ మీటింగ్​

ట్రంప్​మోడీ? మీటింగ్​ మన బిల్డింగ్​లోనే!

అమెరికా ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ పర్యటనలో ‘ హైదరాబాద్​ హౌస్’ కీలకపాత్ర పోషించబోతోంది. మంగళవారం ఉదయం ప్రధాని నరేంద్ర మోడీ, అమెరికా ప్రెసిడెంట్ ట్రంప్ ల మీడియా సమావేశానికి వేదిక కాబోతోంది. ఈ ఇద్దరు నేతలు ఇక్కడే మీడియాతో మాట్లాడతారు. ఇంతటి కీలకమైన మీటింగ్ జరిగే మన బిల్డింగ్​ హైదరాబాద్​ హౌస్ కథేమిటి ?

హైదరాబాద్​ హౌస్ పేరు వినగానే అదేదో హైదరాబాద్​ సిటీలో ఉన్న బిల్డింగ్ అనుకుంటారు చాలా మంది. అలా అనుకుంటే పొరపాటు పడ్డట్టే. హైదరాబాద్​ హౌస్ దేశ రాజధాని ఢిల్లీలో ఉంది. ఎనిమిదెకరాల పై చిలుకు స్థలంలో నిర్మించిన ఈ బిల్డింగ్ ఇప్పటిది కాదు. వందేళ్ల కిందటిది. ఎప్పుడో 1926 లో బిల్డింగ్ నిర్మాణం మొదలెడితే రెండేళ్లకు కానీ పూర్తి కాలేదు. ఏడో నిజాం మీర్​ ఉస్మాన్ అలీ ఖాన్ హైదరాబాద్​ హౌస్ ను నిర్మించారు. అప్పట్లో బ్రిటిష్ వాళ్లు వచ్చినప్పుడు వాళ్లను కలవడానికి  సంస్థానాధీశులు ఢిల్లీ వెళ్లాల్సి వచ్చేది. అంతేకాదు బ్రిటిష్ వాళ్లతో ఒక్కోసారి కొన్ని రోజుల పాటు సమావేశాల్లో పాల్గొనాల్సి వచ్చేది. ఈ పరిస్థితుల్లో ఢిల్లీకి తాను వెళ్లినప్పుడు ఉండటానికి వీలుగా  మీర్ ఉస్మాన్ అలీ ఖాన్ నిర్మించుకున్న కట్టడమే  ఈ ‘ హైదరాబాద్​ హౌస్’. ‘ ఇండియా గేట్ ’ కు నార్త్ వెస్ట్ దిక్కున ఉంటుంది ఈ కట్టడం.  ప్యాలెస్ ఎంట్రన్స్ హాల్ ఓ అద్భుతం అంటారు చాలా మంది.

ఎటుచూసినా పెయింటింగ్సే

సీతాకోక చిలుక ఆకారంలో కట్టిన హైదరాబాద్​ హౌస్ లోపలకు అడుగు పెడితే అద్భుతమైన  హ్యాండ్ పెయింటింగ్స్ కనపడతాయి.. ఇలాంటి హ్యాండ్ పెయింటింగ్స్ 17 వరకు ఉంటాయి.  ఒక్కో  పెయింటింగ్ కు  పది వేల నుంచి ఇరవై వేల రూపాయల వరకు ఖరీదు పెట్టి విదేశాల నుంచి దిగుమతి చేసుకున్నారు. ఈ పెయింటింగ్స్ తో పాటు ఒక పెద్ద పెయింటింగ్ టేబుల్, పెయింటింగ్ స్క్రీన్ కూడా హౌస్ లోపల కనపడతాయి. ఇవే కాదు, అప్పట్లో లాహోర్ లో  ప్రముఖ పెయింటర్​గా పేరున్న  అబ్దుల్ రహ్మాన్ చౌఖ్​తి నుంచి కొనుక్కొచ్చిన 30 హ్యాండ్ పెయింటింగ్ లు కూడా హైదరాబాద్ హౌస్ లోపల  స్పెషల్ అట్రాక్షన్ గా ఉంటాయి.

500 మంది ఒకేసారి భోజనం చేసే డైనింగ్ హాల్​

హైదరాబాద్​ హౌస్ లోని డైనింగ్ హాల్​ చాలా విశాలమైంది. ఇక్కడ ఒకేసారి 500 మంది భోజనం చేసే వీలుంటుంది. అలాగే డైనింగ్ రూంలోని స్పూన్ సహా  ప్రతి చిన్న వస్తువు కూడా చాలా ఖరీదైంది. అప్పట్లోనే వేల రూపాయలు పెట్టి బయటి దేశాల నుంచి తీసుకువచ్చారు. భోజనం వడ్డించడానికి యాభై వేల రూపాయలకు పైగా ఖర్చు పెట్టి వెండి పళ్లాలను బయటి దేశాల నుంచి కొనుక్కొచ్చారట.

కార్పెట్స్ కలెక్షన్

హైదరాబాద్​ హౌస్​లో ఎటు చూసినా ఖరీదైన కార్పెట్లు కనిపిస్తుంటాయి. వీటిని ఇరాక్, పర్షియా, ఆఫ్ఘనిస్తాన్ నుంచి దిగుమతి చేసుకున్నారు. వీటికోసం పెద్ద ఎత్తున్న డబ్బు ఖర్చు పెట్టారు. కార్పెట్స్​ ఒక్కటే కాదు, బిల్డింగ్​లోని అనేక వస్తువులు దిగుమతి చేసుకున్నవే.

ల్యూటెన్స్ నిర్మించిన అతి పెద్ద కట్టడం

అప్పట్లో ఢిల్లీలోని అనేక ప్రముఖ నిర్మాణాలకు ఆర్కిటెక్ట్ గా ఎడ్విన్ ల్యూటెన్సే  ఉండేవారు. ఢిల్లీ సిటీలో ఎటు చూసినా ఆయన నిర్మించిన కట్టడాలే కనిపిస్తాయి. అయితే ల్యూటెన్స్ డిజైన్ చేసిన అతి పెద్ద కట్టడం  హైదరాబాద్​ హౌస్! అంతే కాదు,  అత్యంత ఖరీదైన కట్టడం కూడా ఇదే. మొదటి నుంచీ ఈ బిల్డింగ్​పై అక్కడి సిబ్బంది ప్రత్యేక శ్రద్ధ పెట్టేవాళ్లు. నీట్​ నెస్​కి ప్రయారిటీ ఇచ్చేవారు. దీంతో ఈ బిల్డింగు దేశ రాజధానిలో ఉన్న భవనాల్లోకెల్లా అత్యంత శుభ్రమైన భవనంగా పేరు తెచ్చుకుంది.

నిజాంకు నచ్చలే

ఇంతకీ మీర్ ఉస్మాన్ అలీ ఖాన్ ఎంతో ముచ్చటపడి హైదరాబాద్​ హౌస్ ను కట్టించుకున్నా  ఆ కట్టడం ఆయనను బాగా నిరాశపరచిందట. నిర్మాణం పూర్తయిన పదేళ్లకు ఆయన ఢిల్లీ వెళ్లి  హైదరాబాద్​ హౌస్ ను చూసి పెదవి విరిచారట. ఓ పెద్ద  ‘రాయల్ ప్యాలెస్’ ను కట్టాలంటూ  తాను డబ్బు పంపిస్తే చివరకు గుర్రాలను కట్టేసే బిల్డింగును నిర్మించారని అసంతృప్తి వ్యక్తం చేశారట. నిజాంకే కాదు ఆయన కొడుకులకు కూడా హైదరాబాద్​ హౌస్ నచ్చలేదట. బిల్డింగ్ ను పూర్తిగా  వెస్ట్రన్ అవుట్ లుక్ తో నిర్మించడమే ఆయన కొడుకులకు నచ్చకపోవడానికి ప్రధాన కారణమని తెలిసింది.

ఇప్పుడు కేంద్రం ఆధీనంలో..

ఏడో నిజాం మీర్ ఉస్మాన్ అలీ ఖాన్ తనకోసం కట్టుకున్న ఈ హైదరాబాద్​ హౌస్  1954 తరువాత కేంద్ర ప్రభుత్వ ఆధీనంలోకి వెళ్లింది.విదేశీ వ్యవహారాల శాఖ నిర్వహణలో ఉన్న ఈ బిల్డింగులో విదేశాల నుంచి ప్రముఖులు  వచ్చినప్పుడు కీలకమైన  సమావేశాలు పెట్టడానికి , వాళ్లకు విందులు ఇవ్వడానికి వేదికగా ఉపయోగపడుతోంది.

రాష్ట్రపతి భవన్ తరహాలోనే

హైదరాబాద్​ హౌస్ నిర్మాణాన్ని  మీర్ ఉస్మాన్ అలీ ఖాన్ చాలా ప్రిస్టేజియస్ గా తీసుకుని, పెద్ద ఎత్తున డబ్బు ఖర్చు పెట్టారు. అప్పటి ‘వైస్రాయ్ భవన్ ’ (ప్రస్తుత రాష్ట్రపతి భవన్ ) తరహాలో నిర్మించడానికి వీలుగా డిజైనింగ్ చేయించారు.

యూరోపియన్​ మొఘల్​ ఆర్కిటెక్చర్​…

ఢిల్లీలోని అనేక ప్రముఖ కట్టడాలను డిజైన్ చేసిన ఎడ్విన్ ల్యూటెన్స్  హైదరాబాద్​ హౌస్ ను కూడా డిజైన్  చేసి ‘ యూరోపియన్ –మొఘల్ ’ ఆర్కిటెక్చర్ కు తగ్గట్టు కట్టించారు. హైదరాబాద్​ హౌస్ చాలా విశాలమైంది. హౌస్ లోపల మొత్తం 36 గదులుంటాయి.  ‘హాంప్టన్ అండ్ సన్స్ లిమిటెడ్ ’, ‘వారింగ్ అండ్ గిల్లో లిమిటెడ్ ’ కంపెనీలు హైదరాబాద్ హౌస్ ను మరింత ఆకర్షణీయంగా కనిపించడానికి అవసరమైన తళుకు బెళుకులు అద్దాయి.

అమెరికా నుంచి ఎలక్ట్రిక్ ఫిట్టింగ్స్

బిల్డింగు నిర్మాణంలో వాడే టేకును బర్మా నుంచి ప్రత్యేకంగా తెప్పించారు. అవసరమైన ఎలక్ట్రికల్ ఫిట్టింగ్స్  న్యూయార్క్ నుంచి వచ్చాయి. తొలిరోజుల్లో హైదరాబాద్​ హౌస్ నిర్మాణానికి నిజాం ప్రభుత్వంకేటాయించింది కేవలం 26 లక్షల రూపాయలే.  తరువాత ఒక్కో వస్తువును ఒక్కో దేశం నుంచి తెప్పించడం మొదలయ్యాక ఖర్చు అంచనాలను దాటిపోయింది. దీంతో  హైదరాబాద్​ హౌస్ నిర్మాణానికి 50 లక్షల రూపాయలు కేటాయిస్తూ  నిజాం ప్రభుత్వం ఫర్మానా జారీ చేయాల్సి వచ్చింది.

మళ్లీ వస్తున్న…

మళ్లీ ఇండియాకు వస్తున్నందుకు తనకు ఎంతో ఆనందంగా ఉందని డొనాల్డ్​ ట్రంప్​ కూతురు ఇవాంక అన్నారు. రెండేండ్ల కిందట హైదరాబాద్​లో జరిగిన గ్లోబల్​ ఎంటర్​ప్రెన్యూరియల్​ సమ్మిట్​లో తాను పాల్గొన్న విషయాన్ని గుర్తుచేస్తూ ఆ ప్రోగ్రామ్​కు సంబంధించిన నాలుగు ఫొటోలను ఆదివారం ట్వీట్​ చేశారు. హైదరాబాద్​లో జరిగిన సమ్మిట్​లో ప్రధాని మోడీ, రాష్ట్ర మంత్రి కేటీఆర్​తో కలిసి దిగిన ఫొటోలనూ ఇవాంక పోస్ట్​​ చేశారు.