నేను అధ్యక్షుడిని అయ్యుంటే ఇట్ల జరిగేది కాదు

నేను అధ్యక్షుడిని అయ్యుంటే ఇట్ల జరిగేది కాదు

వాషింగ్టన్: అఫ్గానిస్థాన్‌లో జరుగుతున్న పరిణామాలు, కాబూల్‌లో వరుస బాంబు పేలుళ్లపై అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ స్పందించారు. తాను రెండోసారి గెలిచి మళ్లీ అధ్యక్షుడిని అయ్యుంటే కాబూల్‌లో ఈ ఘోరం జరిగేది కాదని ఆయన అన్నారు. ‘‘ఇటువంటి విషాద సంఘటనలు ఎప్పడూ జరగకూడదు. ఇలా జరగడం బాధాకరం. ఈ ఘటన జరిగి ఉండకూడదు. నేను అమెరికా అధ్యక్షుడిగా ఉండుంటే ఇది జరిగేది కాదు” అని ట్రంప్ అన్నారు. అఫ్గాన్‌లో జరిగిన ఉగ్రదాడుల్లో అమెరికా సర్వీస్‌ మెంబర్స్‌ ప్రాణాలు కోల్పోవడంపై అమెరికా మొత్తం ఒక్కటిగా విలపిస్తోందని ఆయన అన్నారు. తమ విధి నిర్వహణలో అమెరికన్ వారియర్స్ ప్రాణాలు కోల్పోయారని అన్నారు. తాము ప్రేమించే దేశం కోసం వాళ్లు బలిదానాలు చేశారని, ప్రమాదకర పరిస్థితుల నుంచి అమెరికన్లను రక్షించేందుకు కాలంతో పరుగు తీస్తూ ప్రాణాలు కోల్పోయారని, అమెరికన్న హీరోలుగా మరణించిన ఆ సోల్జర్స్‌, ఆఫీసర్లను మన దేశం ఎప్పటికీ మరువదని ట్రంప్ అన్నారు.

కాబూల్ ఎయిర్ పోర్ట్ బయట నిన్న జరిగిన వరుస పేలుళ్లలో దాదాపు 110 మంది ప్రాణాలు కోల్పోయారు. అందులో 13 మంది అమెరికా సైనికులున్నారు. మొత్తంగా మృతుల్లో 28 మంది తాలిబన్ సభ్యులు కూడా ఉన్నట్టు సమాచారం. తాలిబాన్లకు శత్రువు అయిన ISIS- ఖొరోసన్ సంస్థ ఈ పేలుళ్లకు బాధ్యత ప్రకటించుకుంది. తమ ఆత్మాహుతి దళ సభ్యులే ఈ దాడికి పాల్పడినట్టు తెలిపింది. అమెరికా ఆర్మీతో కొలాబరేట్ అయినవారు, ట్రాన్స్ లేటర్లను తాము టార్గెట్ చేసినట్టు ప్రకటించింది. మరోవైపు అఫ్గన్ లో మరిన్ని దాడులు జరగొచ్చని అమెరికా అనుమానిస్తోంది. దీనిపై అమెరికన్ ఇంటెలిజెన్స్ రిపోర్ట్ వచ్చినట్టు సమాచారం.